ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 నవంబరు 2024 (12:10 IST)

చెన్నైకు 480 కిమీ దూరంలో తీవ్ర వాయుగుండం.. ఏపీకి భారీ వర్షాలు

rain
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా గంటకు 12 కి.మీ వేగంతో కదులుతూ ట్రింకోమలికి తూర్పుగా 110 కిలోమీటర్లు, నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని విశాఖ వాతావరణ శాఖ తుపాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఇది బుధవారం సాయంత్రం తుఫాను (ఫెంగల్)గా బలపడింది.
 
ఫెంగల్ తుపాను శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపుకు కదిలే అవకాశముంది. ఈ నెల 30న దక్షిణ తమిళనాడు, శ్రీలంక మధ్యలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని, ఆ తర్వాత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతంలో పలు చోట్ల గురు, శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు విస్తారంగా పడతాయని వెల్లడించింది.
 
ప్రధానంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తుఫాను కారణంగా విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక.. కాకినాడ, గంగవరం పోర్టుల్లో సిగ్నల్ 4తో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరో వైపు నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
 
మత్స్యకారులు ఎవరూ డిసెంబరు 3 వరకూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఫెంగల్ తుఫాను దూసుకుకొస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పంట పొలాల్లో నిలిచే అదనపు నీరు వీలైనంత త్వరగా బయటకు పోయేలా రైతులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలకు తరలించుకోవాలని కోరారు.