శుక్రవారం, 17 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జనవరి 2025 (16:36 IST)

పార్టీ గీత దాటిన జనసేన నేత.. పార్టీ నుంచి సస్పెండ్!

janasena
కోడిపందాల బరి వద్ద జనసేన ఫ్లెక్సీలు కట్టి పార్టీ క్రమశిక్షణా చర్యల ఉల్లంఘనకు పాల్పడిన నేతలు జనసేన పార్టీ సస్పెండ్ చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు వద్ద కోడిపందాలు నిర్వహించారు. అయితే, ఈ కోడిపందాల బరి వద్ద పెనమలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నేత ముప్పా గోపాలకృష్ణ (రాజా) పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీన్ని పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. 
 
ముప్పా గోపాలకృష్ణను క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. కోడి పందాల బరుల వద్ద ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు ఏర్పాటు చేయడం జనసేన పార్టీ విధానాలకు, ప్రతిష్టకు భంగకరం. ఇందుకు బాధ్యుతలైన మిమ్మల్ని పార్టీ నుంచి  సస్పెండ్ చేస్తున్నాం అని ఆ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ఇకపై, జనసేన పార్టీ కార్యక్రమాలతో మీకు ఎలాంటి అధికారిక సంబంధం లేదు అని ముప్పా గోపాలకృష్ణకు పార్టీ స్పష్టం చేసింది. ముప్పా గోపాలకృష్ణ పెనమలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.