ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2024 (08:42 IST)

రాజ్యసభ సీటు స్థానంలో మంత్రి పదవి... ఎందుకిచ్చారో తెలుసా?

nagababu
తన అన్న, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబుకు రాజ్యసభకు పంపించాలన్న కోరికకు టీడీపీ, బీజేపీలు అడ్డుకట్ట వేశాయి. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లను ఆ రెండు పార్టీలు 2, 1 చొప్పున పంచుకున్నాయి. దీంతో జనసేన పార్టీకి మరోమారు నిరాశే ఎదురైంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీట్లను త్యాగం చేసిన ఆ పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ ఇపుడు కూడా మరోమారు త్యాగం చేశారు. అదేసమయంలో నాగబాబుకు తన మంత్రివర్గంలో చేర్చుకునేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమ్మతించారు. దీంతో నాగబాబు త్వరలో ఏపీ మంత్రివర్గంలో చేరనున్నారు. అయితే, నాగబాబును ఎమ్మెల్సీ చేసిన తర్వాత మంత్రి పదవి ఇస్తారా లేక ముందుగానే ఇస్తారా అన్నది ఇపుడు తేలాల్సివుంది. 
 
ప్రస్తుతం రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నిక జరుగనుండగా.. ఒకటి తన అన్న నాగేంద్రబాబుకు ఇవ్వాలని పవన్ కోరారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్.కృష్ణయ్యకు తాము ముందే హామీ ఇచ్చామని, ఆ సీటు ఇవ్వలేమని బీజేపీ నాయకత్వం నిస్సహాయత వ్యక్తం చేసింది. తెలంగాణలో బీసీ వర్గాలను దరిచేర్చుకోవడానికి కృష్ణయ్య అవసరం ఉందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. టీడీపీ కూడా తన కోటా కింద వచ్చిన రెండు రాజ్యసభ సీట్లలో ఒక దానిని.. వైసీపీకి, రాజ్యసభకు రాజీనామా చేసి వచ్చిన బీద మస్తాన్ రావుకు ఇస్తామని ముందు
గానే ఇచ్చామని... రెండోది కాకినాడ జిల్లాకు చెందిన పార్టీ నేత సానా సతీస్‌కు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో నాగబాబుకు రాజ్యసభ సీటు అవకాశం దక్కలేదు. లోక్‌సభ ఎన్నికల్లో అనకాపల్లి సీటు జనసేన కోటా కిందకు వచ్చిందని... అక్కడ నాగబాబును నిలిపాలనుకున్నామని.. కానీ బీజేపీ కోసం త్యాగం చేశామని పవన్ కూటమి పార్టీలకు గుర్తుచేశారు. దీంతో ప్రత్యామ్నాయంగా నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూటమి నిర్ణయించింది. 
 
రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం ఒక ఖాళీ ఉంది. నాగబాబు ప్రస్తుతం శాసనసభలో గానీ, శాసన మండలిలో గానీ సభ్యుడు కాదు. ఏ సభలోనూ సభ్యుడు. కాకపోయినా మంత్రిగా తీసుకోవచ్చు. కానీ ఆరు నెలల్లోపు ఆయన ఏదో ఒక సభ నుంచి ఎన్నిక కావాలి. కూటమి సర్కారు వచ్చాక వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. 
 
వాటిని మండలి చైర్మన్ మోషేన్ రాజు ఇంకా ఆమోదించలేదు. అవి ఖాళీ అయితే అందులో ఒకటి నాగబాబుకు ఇస్తారు. లేదంటే వచ్చే మార్చిలో మండలిలో కొన్ని ఖాళీలు రానున్నాయి. అప్పుడైనా ఇచ్చే అవకాశం ఉంది. అయితే అంతకుముందే నాగబాబును మంత్రిగా తీసుకుంటారా.. లేక ఎమ్మె ల్సీగా ఎన్నికయ్యాక తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.