ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2024 (15:19 IST)

ఫతే టీజర్ లో వయలెన్స్ ఓ రేంజ్ లో చేసిన స్టైలిష్ సోనూ సూద్

stylish Sonu Sood  in Fateh
stylish Sonu Sood in Fateh
సోనూ సూద్ దర్శకత్వంలో వస్తున్న తొలి చిత్రం 'ఫతే'. ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఫతే చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ, ఫతే నుంచి టీజర్ విడుదలైంది.
 
80 సెకన్ల నిడివి గల ఫతే టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. బుల్లెట్ల వర్షం కురిపించి, గన్ పట్టుకొని నిల్చొని ఉన్న సోనూ సూద్ పాత్రను పరిచయం చేస్తూ టీజర్ ప్రారంభమైంది. ప్రతి ఫ్రేమ్ లోనూ భారీతనం కనిపిస్తోంది. యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. వయలెన్స్ ఓ రేంజ్ లో ఉండబోతుందని టీజర్ స్పష్టం చేసింది.

విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టాప్ క్లాస్ లో ఉన్నాయి. సోనూ సూద్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. మొత్తానికి టీజర్ చూస్తుంటే, వయలెన్స్ తో కూడిన అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ తో సోనూ సూద్ బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయబోతున్నారని అర్థమవుతోంది.
 
దర్శకుడిగా చేస్తున్న తొలి చిత్రానికి, సోనూ సూద్ బలమైన కథను ఎంచుకున్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాంటి ఆసక్తికరమైన సైబర్ క్రైమ్ అంశాన్ని కథా వస్తువుగా తీసుకొని, దాని చుట్టూ బలమైన కథను అల్లుకున్నారు సోనూ సూద్. సైబర్ క్రైమ్ సిండికేట్ ను ఢీ కొట్టి, ఆ చీకటి సామ్రాజ్యంలోని రహస్యాలను ఛేదించి, ఎందరో జీవితాల్లో వెలుగులు నింపే వ్యక్తిగా సోనూ సూద్ కనిపిస్తున్నారు.
 
దర్శకుడిగా మొదటి సినిమాతోనే సోనూ సూద్ తన ప్రతిభను చాటుకోబోతున్నారని టీజర్ తో స్పష్టమవుతోంది. ప్రారంభం నుంచి చివరి వరకు.. తర్వాత ఏం జరుగుతోందన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ, ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూసే సినిమాగా సోనూ సూద్ ఫతే చిత్రాన్ని మలుస్తున్నారు. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని పంచడం కోసం, ఈ చిత్రం కోసం ప్రముఖ హాలీవుడ్ సాంకేతిక నిపుణులను సైతం రంగంలోకి దింపారు.
 
టీజర్ విడుదల సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ, "ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకుల నుండి నేను అందుకున్న ప్రేమ అసాధారణమైనది. ఇప్పుడు ఫతే టీజర్ తో మరోసారి ప్రేక్షకుల నుండి వెల కట్టలేని ప్రేమను చూస్తున్నాను. ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది. ఇది దర్శకుడిగా నా అరంగేట్రం మాత్రమే కాదు.. మనలో చాలా మంది తక్కువగా అంచనా వేసే భయంకరమైన ముప్పు అయినటువంటి సైబర్ ప్రపంచంలోని అదృశ్య, చీకటి శక్తులకు వ్యతిరేకంగా ఇది ఒక వాయిస్. రియల్ కి, వర్చువల్ కి మధ్య జరిగే ఆసక్తికర ఆటను, సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూసేలా చేసే యాక్షన్ థ్రిల్లర్ ఇది. మనలో చాలా మంది చూడని యుద్ధాలను ధైర్యంగా ఎదుర్కొనే హీరోలందరి కోసం ఈ చిత్రం చేశాను." అన్నారు.
 
సోనూ సూద్‌తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, విజయ్ రాజ్, లెజెండరీ యాక్టర్ నసీరుద్దీన్ షా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
 
జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సోనాలి సూద్, ఉమేష్ కెఆర్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫతే చిత్రం జనవరి 10, 2025న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.