ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (17:47 IST)

సీఎం జగన్ సర్కారు చర్యలను మెచ్చుకున్న సీబీఐ మాజీ జేడీ

కరోనా వైరస్ రోగులను గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ సంఖ్యలో ర్యాపిడ్ టెస్ట్‌లను నిర్వహిస్తోంది. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలో పోల్చితే ఏపీ అగ్రస్థానంలో ఉంది. అయినప్పటికీ కేసుల సంఖ్యలో మాత్రం ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. అయితే టెస్టులు చేయడంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీ మొదటి స్థానంలో ఉంది. దీన్ని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ప్రశంసించారు. 
 
అలాగే, కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం సీఎం జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో మరిన్ని టెస్టులను చేయడం మంచిదేనని, ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపించినా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరణాల సంఖ్య తక్కువగానే ఉందని ఆయన గుర్తుచేశారు. 
 
ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణం, అక్కడ జరిపించిన పరీక్షలేనని లక్ష్మీ నారాయణ అభిప్రాయపడ్డారు. కరోనా పరీక్షలను చేయడంలో ఏపీ ప్రభుత్వం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మిన్నగా ఉందని కితాబునిచ్చిన ఆయన, కరోనాపై జగన్ చేసిన వ్యాఖ్యలనూ సమర్థించారు.
 
లాక్‌డౌన్‌తో ప్రభుత్వాలకు కొంత వెసులుబాటు కలిగిందని, ప్రజారోగ్యంపై దృష్టిని సారించే సమయం లభించిందని, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం, ఎన్ని ఎక్కువ టెస్టులు చేస్తే అంత మంచిదని లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. 
 
టెస్టులు ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నా, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని గుర్తు చేశారు. కరోనా మృతుల్లో ఇతర సమస్యలున్న కారణంగా మరణించిన వారే అధికమని అన్నారు. సాధ్యమైనంత వరకూ వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.