జనసేనను వెతుక్కుంటూ వెళ్లలేదు.. పవనే ఆహ్వానించారు.. లక్ష్మీనారాయణ
తాను జనసేనను వెతుక్కుంటూ వెళ్లలేదనీ, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణే తనను పార్టీలోకి ఆహ్వానించారు. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్నికల ముందు జనసేన పార్టీలో తాను చేరడానికి గల కారణాలను ఆయన తాజాగా వివరించారు.
'జనసేన పార్టీలోకి ముఖ్యంగా నేను రావడానికి కారణం ఏంటంటే. జీరో బడ్జెట్ పాలిటిక్స్. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. ఓటు కొనబోమని చెప్పారు. నేను ఆలోచిస్తోన్న విధి విధానాలు ఉన్నాయి. మీరొస్తే బాగుంటుందని పవన్ కల్యాణే నన్ను జనసేనలోకి ఆహ్వానించారు. పార్లమెంటరీ నియోజక వర్గంలో పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి.
గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ సింబల్ వంటివి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమయం పడుతుంది. 16, 17 రోజులు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నాను. రెండు బలమైన పార్టీలు ఉన్నప్పుడు 2,80,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఓడిపోయామని మేము ఎన్నడూ అనుకోలేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా గెలుస్తామని భావించాం అని చెప్పారు.
ఆ తర్వాత పొలీట్ బ్యూరోలో నన్ను ఉండాలన్నారు. ఐదుగురితో పొలిట్ బ్యూరో ఉండడం సరికాదని, ఆ సంఖ్య ఎక్కువ ఉండాలని చెప్పాను. ఆలోచనలు అనేవి అందులో జరగాలని అన్నాను. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుటుందన్నాను. మనం మజ్జిగ చిలికినట్లు నిర్ణయాలను చిలకాలి.
ఎక్కువ మంది మథనం చేస్తే మంచి నిర్ణయాలు వస్తాయి. ఆ తర్వాత ఏమైందో తెలీదు. ఆ పొలిట్ బ్యూరోలో నేను లేను. నేను పార్టీలో చేరిన తర్వాత పెద్దగా సమయంలేదు. ఎన్నికలు వచ్చాయి. సమావేశాల్లో పాల్గొన్నాను. నాకు ఇవ్వాల్సిన సలహాలు నేనిచ్చాను అని వివరించారు.