శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 మార్చి 2020 (11:35 IST)

"కరోనా విముక్త భారత్" కోసం చిరంజీవి పిలుపు (వీడియో)

కరోనా విముక్తి కోసం మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ కరోనా వైరస్‌ను దేశం నుంచి తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచన మేరకు ఈ నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూను పాటించాలని ఈ టాలీవుడ్ సూపర్ స్టార్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు, తన అభిమానులతో పాటు.. దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. 
 
"అందరికీ నమస్కారం.. కరోనా వైరస్‌ని నియంత్రించడానికి క్షేత్ర స్థాయిలో అహర్నిశలు సేవాభావంతో పనిచేస్తోన్న వైద్యులు, నర్సులకు, ఇతర వైద్య ఆరోగ్య బృందానికి, స్వచ్ఛ కార్మికులు, పోలీస్‌ శాఖ వారికి అలాగే ఆయా ప్రభుత్వాలకి హర్షాతిరేఖలు ప్రకటిస్తూ ప్రశంసించాల్సిన సమయమిది. 
 
దేశ ప్రధాని పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మనమందరం స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూని పాటిద్ధాం. ఇళ్ళకే పరిమితమవుదాం. మనకోసం సేవలందిస్తున్న‌ వారికి సరిగ్గా సాయంత్రం 5 గంటలకి మన ఇంటి గుమ్మాలలోకి వచ్చి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలుపుదాం. 
 
ఇది మన ధర్మం. భారతీయులుగా మనమందరం ఐకమత్యంతో ఒకటిగా నిలబడి క్లిష్టపరిస్థితులని ఎదుర్కొందాం. సామాజిక సంఘీభాం పలుకుదాం. కరోనా విముక్త భారతాన్ని సాధిద్ధాం. జైహింద్" అని చిరంజీవి వీడియో ద్వారా తెలిపారు.
 
అలాగే, మరో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కూడా ఓ ట్వీట్ చేశారు. "కరోనా వైరస్‌కి వ్యతిరేకంగా మన దగ్గర ఉన్న ఏకైక ఆయుధం సామాజిక దూరం పాటించ‌డం. మన గౌరవప్రదమైన ప్రధానమంత్రికి సంఘీభావంగా ఆదివారం ఇంట్లోనే ఉంటామ‌ని అంద‌రం ప్రతిజ్ఞ చేద్దాం" అని నాగార్జున త‌న ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. 
 
కాగా, దేశంలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. అన్ని దేశాలు కరోనా ధాటికి కకావికలమవుతున్నాయి. కరోనా నుండి ప్రజలని కాపాడేందుకు ప్రభుత్వాలతో పాటు వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు పలు రంగాల వారు తీవ్ర కృషి చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కరోనాని అంతమొందించేందుకు ఆదివారం జనతా కర్ఫ్యూకి ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. దీనికి పలువురు సెలబ్రిటీలు సంఘీభావం తెలిపారు. ఈ జనతా కర్ఫ్యూను పాటించేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చాయి.