శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 16 మార్చి 2020 (14:02 IST)

మహేష్ విషయంలో చిరు, కొరటాల మధ్య డిఫరెన్సస్ వచ్చాయా?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడని తెలిసినప్పటి నుంచి ఈ సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే... చరణ్‌ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉండడం... పైగా ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కాకుండా చరణ్‌ మరో సినిమాలో నటించకూడదు.. నటించినా ఆ సినిమాని ఆర్ఆర్ఆర్ కంటే ముందుగా రిలీజ్ చేయకూడదు అని రాజమౌళి కండీషన్ పెట్టడంతో ఆలోచనలో పడ్డారు కొరటాల.
 
చరణ్‌, కొరటాల ఆ పాత్రను సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో చేయిస్తే బాగుంటుంది అనుకోవడం.. చరణ్‌, కొరటాల వెళ్లి మహేష్‌ని అడగడం.. మహేష్ ఓకే చెప్పడం జరిగింది. చిరు, మహేష్‌ కలిసి నటించనున్నారు అనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై అప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు. మహేష్ ఈ మూవీలో నటించేందుకు ఓకే అన్నప్పటి నుంచి 40 రోజులు డేట్స్ ఇచ్చాడు. 
 
మహేష్ కోసం కథలు మార్పులు చేస్తున్నారని.. మహేష్ ఇందులో స్టూడెంట్ లీడర్‌గా నటిస్తున్నాడని.. మే నెలాఖరు నుంచి మహేష్ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటాడని.. ఇలా వార్తలు రావడంతో అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను హాట్ టాపిక్ అయ్యింది. అంతా సెట్ అయ్యింది అనుకుంటే... ఇప్పుడు మళ్లీ మొదటికొచ్చిందని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే... చిరంజీవి, చరణ్ కలిసి ఇప్పటి వరకు మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నెంబర్ 150 చిత్రాల్లో నటించినప్పటికీ.. అవి ఒకటి రెండు నిమిషాల సీన్స్ లోనే తప్పితే.. పూర్తి స్ధాయి పాత్రలో ఇద్దరూ కలిసి నటించలేదు.
 
అందుచేత ఈ సినిమాలో ఇద్దరూ కలిసి నటిస్తే... స్పెషల్ మూవీ అవుతుంది. ఇలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు. అందుకని ఈ సినిమాలో చరణ్‌ నటిస్తేనే బాగుంటుందని చిరంజీవి కొరటాలకు చెప్పారని తెలిసింది. కొరటాల మాత్రం మహేష్ చేస్తే.. ఈ ప్రాజెక్ట్‌కి మరింత క్రేజ్ వస్తుందని చెప్పారట. ఈ విధంగా చిరు, కొరటాల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై కొరటాల స్పందిస్తారేమో చూడాలి.