బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 20 మే 2020 (09:35 IST)

ఏపీలో వలస కార్మికులకు జాబ్‌కార్డులు!

ఏపీలో వలస కార్మికులు, ఇతర పేదలకు ప్రత్యేక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన ప్యాకేజిలో భాగంగా ఉపాధి హామీ నిధులతో ఈ ప్రణాళికకు అధికారులు రూపకల్పన చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఉపాధిహామీకి మరో 40 వేల కోట్లు ఖర్చు చేస్తామని కేంద్రం ప్రకటించింది. దీనికి సంబంధించి ఇంకా మార్గదర్శకాలు రాకపోయినప్పటికీ, రాష్ట్రంలో అమలు చేయాల్సిన పనులపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. మే నుంచి జూన్‌ నెలాఖరువరకు రోజుకు 40 లక్షల మందికి పని కల్పించాలని యోచిస్తున్నారు.

ఇదే సమయంలో వలస కార్మికులకు జాబ్‌కార్డులు అందించి ఉపాథి హామీ పథకం ద్వారా పని కల్పించాలని భావిస్తున్నారు. సాధారణ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 27,400 మంది వలస కార్మికులకు జాబ్‌ కార్డులు అందించిన అధికారులు కరోనా నేపథ్యంలో మరికొంత మందికి కార్డులు అందించాలని నిర్ణయించారు.

ఇదే సమయంలో వారికి ఉన్న భూములను కూడా అభివృద్ధి చేసి ఉద్యానవన, పట్టు పరిశ్రమలకు అనుకూలంగా మార్చాలని యోచిస్తున్నారు. వలస కూలీల్లో నైపుణ్యం ఉన్న వారిని గ్రామ, వార్డు సచివాలయాల్లో గుర్తించే చర్యలు తీసుకుంటూనే అటువంటి వారిని గ్రామ సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల వంటి వాటిల్లో ఉపయోగించుకోవాలని కూడా యోచిస్తున్నారు.

వారి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకుగాను సెర్ప్‌ ద్వారా శిక్షణ ఇప్పించాలని భావిస్తున్నారు. ప్యాకేజి నిధులతో వ్యవసాయ గోదాములు, పంట నూర్పిడి నేలలు అభివృద్ధి, చేపలు ఎండబెట్టుకునే ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.