శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 20 మే 2020 (09:15 IST)

ఏపీలో రేపటి నుంచి ఆర్టీసి సేవలు..తెలంగాణ బస్సుల్లో జనం కరువు

ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 21వ తేదీ నుంచి ఆర్టీసి బస్సులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసి బస్సులు ఎక్కాలనుకునేవారు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు తీసుకోవాలని ఎపిఎస్‌ఆర్టీసి తెలిపింది.

ఆర్డీనరీ సర్వీసులను డిపో నుండి డిపోకు మధ్య నడపాలని నిర్ణయించారు. పట్టణాలకు వెళ్లే సర్వీసులకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. బస్సులు ఎక్కేముందు అందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారు. బస్సు ఎక్కేవారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాల్సి ఉంటుంది.
 
బస్సుల్లో సీటింగ్‌ మార్పు, గ్రీన్‌ జోన్ల మధ్య తిప్పేందుకు ప్రణాళిక, రెడ్‌ జోన్లలో పాటించే నిబంధనలు, తక్కువ సీట్లతో తిప్పితే వచ్చే నష్టం, ప్రజలకు బస్సులు తిరగడం వల్ల కలిగే ఉపయోగం తదితర అంశాలపై చర్చించారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ.. హైదరాబాద్‌ మినహా రాష్ట్రమంతా తిప్పేందుకు నిర్ణయం తీసుకొంది.

అదే తరహాలో మన రాష్ట్రంలోనూ పెద్దనగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో మరికొన్ని రోజులు బస్సులు నడపరాదని నిర్ణయించారు. చార్జీల విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి పెంపు లేకుండా పాత రేట్లతోనే నడపాలని సీఎం చెప్పడంతో అధికారులు సరేనన్నారు.

అయితే డిపోల్లో కొన్ని బస్సులకే సీటింగ్‌ విధానం మార్చడం వల్ల వీలైనంత మేరకు బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. స్పందన ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
 
తెలంగాణ బస్సుల్లో జనం కరువు
దాదాపు రెండు నెలల తర్వాత తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కానీ..  కరోనా వైరస్‌ వ్యాప్తి భయాందోళనలు ఇంకా వెంటాడుతుండడం, ఎండలు, పూర్తిగా సడలని లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా చాలా మంది బస్సుల్లో ప్రయాణించడానికి సాహసించలేదు.

దీనికితోడు.. మే నెలలో ఎక్కువగా జరిగే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సందడి లేకపోవడంతో ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.