బుధవారం, 19 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 మార్చి 2025 (13:15 IST)

తప్పుడు కేసుల నుంచి విముక్తి కల్పించండి.. సీఎం బాబును కోరిన నటి జెత్వానీ!!

jethwani
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ముంబై నటి కాదంబరి జెత్వానీ ఓ విజ్ఞప్తి చేశారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో తనపైన బనాయించిన తప్పుడు కేసుల నుంచి విముక్తి కల్పించాలని ఆమె కోరారు. అలాగే, పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న 10 ఫోన్లు కూడా ఇప్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 
 
మహిళా సంఘాల సమాఖ్య ప్రతినిధులు సుంకర పద్మశ్రీ, దుర్గా భవానీ, రమాదేవిలతో కలిసి ఆమె విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. వైకాపా హయాంలో తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని, ఆ కేసుల నుంచి తనకు విముక్తి కల్పించాలని ఆమె కోరారు. అప్పటి పోలీసులు స్వాధీనం చేసుకున్న పది మొబైల్ ఫోన్లను కూడా తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. తప్పుడు కేసుల కారణంగా తన కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె వాపోయారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనితలు తనకు న్యాయం చేయాలని కోరారు. ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఆర్డర్‌తో సజ్జన్ జిందాల్, కుక్కల విద్యా సాగర్ తనను వేధిస్తున్నారని ఆరోపించారు. కేసు విచారణను సీఐడీకి అప్పగించినా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటివరకు ఫోరెన్సిక్ నివేదిక రాలేదని, తమను వేధించిన వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టడానికి కారణమైన కుక్కల విద్యాసాగర్ బెయిలుప స్వేచ్ఛగా తిరుగుతున్నాడని ఆయన వెనుక నుంచి సజ్జన్ జిందాల్ నడిపిస్తున్నారని పేర్కొన్నారు.