ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2023 (16:57 IST)

వేదికవద్దకు చేరుకున్న లోకేష్ : వంద రోజుల్లో సైకో పాలనకు విముక్తి : రామ్మోహన్ నాయుడు

kinjarapu errannaidu
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభను విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వద్ద వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు హాజరవుతున్నారు. ఈ సభా వేదిక వద్దకు యువగళం హీరో నారా లోకేష్ చేరుకున్నారు. ఇదిలావుంటే ఈ సభలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కీలక ప్రసంగం చేశారు. ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్రలో నిర్వహిస్తున్న యువగళం-నవశకం కార్యక్రమం దేశ రాజకీయ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలుస్తుందన్నారు. 
 
'జనవరి 27న కుప్పంలో మొదలైన యువగళానికి చిత్తూరు చిందులేసింది. కడప కదిలింది. కర్నూలు కన్నుల పండువగా మారింది. అనంతపురం ఆత్మీయతను చాటుకుంది. నెల్లూరు నడుం బిగించింది. ఒంగోలు ఉరకలేసింది. గుంటూరు గర్జించింది. కృష్ణా జిల్లా కృష్ణమ్మలా కరుణ చూపించింది. గోదావరి గర్జించింది. విశాఖపట్నం విజృంభించింది. విజయనగరం విజయ పతాకాన్ని ఎగురవేసింది. శ్రీకాకుళం శంఖారావంతో పూనుకుని యావత్‌ ఉత్తరాంధ్ర కూడా ఉత్సాహంతో ఉద్యమిస్తూ ముందుకు నడుస్తోంది. యువగళం ముగింపు కాదు.. ఇప్పటి నుంచే ఆరంభమవుతుంది.
 
ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ 100 రోజులు ఓపిక పడితే టీడీపీ - జనసేన ప్రభుత్వం వస్తుంది. పేదలు, బడుగు బలహీనవర్గాలు, దళితులు, యువత, రైతులకు మంచి జరుగుతుంది. పోలవరం పూర్తి చేసుకుందాం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. వంద రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శని వదిలించుకోబోతున్నాం' అని రామ్మోహన్‌ నాయుడు అన్నారు. తెదేపా, జనసేన కార్యకర్తల కేరింతలతో సభా ప్రాంగణం సందడిగా మారింది.