సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2023 (19:12 IST)

గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన తెలంగాణ మంత్రివర్గం

revanth reddy
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీలో గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై చర్చించి, ఆ తర్వాత ఆ ప్రసంగానికి ఆమోదముద్ర వేసింది. ఇందులో ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్‌లో ఎలాంటి చర్యలు తీసుకుంటాం తదితర అంశాలపై ప్రధానంగా ప్రస్తావించారు. 
 
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలతో గ్యారెంటీ ఇచ్చింది. ఇందులో రెండు హామీలను ఇప్పటికే నెరవేర్చింది. మిగిలిన హామీలను కూడా నెరవేర్చేందుకు కసరత్తులు చేపట్టింది. ఈ అంశాలను కూడా గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. 
 
ఆ తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదిస్తూ తీర్మానం చేసింది. కాగా, ఈ నెల 9వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శుక్రవారం ప్రసంగించనున్నారు. 
 
తెలంగాణాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆటో డ్రైవర్ల ఆందోళన 
 
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ పథకం వల్ల తమ ఉపాధి కోల్పోతున్నామంటూ పలు ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఈ పథకం వల్ల తమ కుటుంబ సభ్యులు రోడ్డు పడుతున్నామని, అందువల్ల తమకు నెలకు రూ.20 వేల వేల జీవన భృతి ఇవ్వాలని, పింఛన్లు ఇచ్చి తమన ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
జిగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన నవ తెలంగాణ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, నిరసన ర్యాలీలో పాల్గొని, ఆ తర్వాత ఆందోళనకు దిగారు. అలాగే, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోనూ ఆటో డ్రైవర్లు రాస్తారోకో నిర్వహించారు. 
 
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో సాటాపూర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. కామారెడ్డిలో జిల్లాలోనూ ఆటో డ్రైవర్ల ఆందోళన జరిగింది. నిర్మల్ జిల్లా ముథోల్‌లోని బాసర - భైంసా రహదారిపై ఆటో డ్రైవర్లు రాస్తారోకో చేశారు. సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మిరుదొడ్డి, సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల, నల్గొండ జిల్లా దేవరకొండల్లోనూ ఆటో డ్రైవర్లు ఆందోళన చేశారు.