బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 22 నవంబరు 2021 (18:24 IST)

శ‌భాష్ కృష్ణా పోలీస్... బాలుడి కిడ్నాప్ కేసు 3 గంట‌ల్లో కొలిక్కి...

కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఒక బాలుడి కిడ్నాప్ ఉదంతాన్ని పోలీసులు ఛేదించారు. సాంకేతిక సహాయంతో అతి తక్కువ సమయంలోనే కిడ్నాప్ కేసును కొలిక్కి తెచ్చారు. అపహరణ అయిన బాలుని 3 గంటల వ్యవధిలోనే తల్లి దండ్రుల చెంతకు చేర్చారు. జిల్లా ఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణలో 20 ప్రత్యేక బృందాలు ఈ ఆప‌రేష‌న్ లో పాల్గొన్నాయి. 
 
 
బాలుడు క‌నిపించ‌డం లేద‌నే ఫిర్యాదుకు తక్షణమే స్పందించి పోలీసులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. సాయంకాలం అవనిగడ్డ పరిధిలో ఏడు సంవత్సరాల వయసు కలిగిన ఒక బాలుడిని గుర్తు తెలియని దుండగులు అపహరించగా, స్థానికుల ద్వారా వచ్చిన సమాచారం మేరకు వెంటనే కృష్ణా జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. బాలుడికి ఏమి ప్రాణహాని లేకుండా క్షేమంగా వారి తల్లిదండ్రులు అప్పగించినందుకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అవనిగడ్డ డిఎస్పీ మహబూబ్ బాషా , సిఐ రవి కుమార్ , ఎస్సైలను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
 

అవనిగడ్డ కు చెందిన రేపల్లె రత్నగిరి అనే ఒక వ్యక్తి నాగాయలంక గ్రామంలో ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. ఏడు సంవత్సరాల వయసున్న ఆయ‌న కుమారుడిని సాయంకాలం 4:00 గంటల సమయంలో గుర్తు తెలియని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. ఆగంతకులు తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా, పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ కుమారుని చంపేస్తామని, వెంటనే లక్ష రూపాయలు అందజేయాలని బెదిరించారు. 
 

దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు మిన్నకుండిపోయారు. రత్నాగిరి బంధువుల్లో ఒక వ్యక్తి అవనిగడ్డ పోలీస్ స్టేషన్ కు ఫోన్ ద్వారా సమాచారం చేరవేయడంతో సమాచారం అందుకున్న అవనిగడ్డ సిఐ రవికుమా ర్ ఎస్పీకి తెలియజేశారు. ఆయ‌న వెనువెంటనే 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్, సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయం చేశారు. 
 

అవనిగడ్డ పరిధిలోగల 20 వార్డులలో  40 మందితో 20 షాడో పార్టీలను ఏర్పాటు చేసి,  అనుమానాస్పదంగా ఉన్న ప్రతి ప్రాంతాన్ని అనువనువున గాలించారు. అవనిగడ్డ చుట్టుపక్కల ప్రాంతాలలో నాకాబందీ నిర్వహించి, నాకాబందీ తో పాటు అదనపు బాహ్య వలయాన్ని ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాలకు వెల్లే పెనుమూడి వారధి ,కోడూరు, మోపిదేవి, అవనిగడ్డ నుండి బయట ప్రాంతాలకు వెళ్లే ప్రతి ఒక్క మార్గాలలో చెక్పోస్టులను ఏర్పాటు చేసి వచ్చి పోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
 

తల్లిదండ్రులకు వచ్చిన బెదిరింపు కాల్ ఫోన్ నెంబర్ ట్రేస్ చేసే పనిలో హెడ్క్వార్టర్ బృందం కాల్ డీటెయిల్స్ ఎనాలసిస్ నిర్వహిస్తుండగా, మరొక వైపు అవనిగడ్డ చుట్టుపక్కల పరిధిలోగల సీసీ కెమెరాలను మానిటర్ ద్వారా పరిశీలిస్తూ, అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించే పనిలో మరొక బృందం, ఇలా ఇరవై వార్డులకు ఏర్పాటు చేసిన 20 ప్రత్యేక బృందాలు ప‌నిచేశాయి. అదనంగా సిసిఎస్ డిఎస్పి, అవనిగడ్డ డిఎస్పీ, ఇతర పోలీసు అధికారులతో కూడిన మరొక 7 బృందాలు బాలుడిని కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.
 

అదే సమయంలో బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో సుమారు 20 సంవత్సరాల వయసు కలిగిన ఒక యువకుడు అనుమానాస్పదంగా తిరుగుతున్న స్థానికుల ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఆ గుర్తు లతో ఉన్న వ్యక్తి గురించి వెతుకులాట ప్రారంభించారు. అదే సమయంలో ఆ వ్యక్తి పారి పోతున్నట్లుగా గుర్తించి హెడ్ కానిస్టేబుల్ విక్రమ్, కానిస్టేబుల్ సురేష్ అతన్ని వెంబడించారు. తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా, అవనిగడ్డ డిఎస్పీ మహబూబ్ బాషా, సిఐ రవికుమార్, అవనిగడ్డ ఎస్సై శ్రీనివాస్, సిబ్బందితో కలిసి అతను ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
 
 
అతని పేరు హేమంత్(20) అని, నాగాయలంక మండలం మర్రిపాలం కు చెందిన వాడని, అతను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ దుర్వ్యసనాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకున్నాడు. డబ్బు ఇవ్వని పక్షంలో చంపుదామనుకున్నానని నేరం అంగీకరించాడు. ఆ బాలుడిని ఒక నిర్మానుష్య ప్రాంతంలొ  దాచినట్లు చెప్పగా, అవనిగడ్డ డిఎస్పీ ఆధ్వర్యంలో ఆ ప్రాంతానికి వెళ్లి బాలుడిని రక్షించారు.
 

తన కుమారునికి ఎలాంటి ప్రాణ హాని లేకుండా క్షేమంగా అప్పగించినందుకు భావోద్వేగానికి లోనైన తల్లిదండ్రులు, కన్నీటి పర్యంతమై జిల్లా ఎస్పీకి, పోలీస్ అధికారులకు సిబ్బందికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బాలుని సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడంలో కృషి చేసిన ప్రతి ఒక్క పోలీసు అధికారికి సిబ్బందికి ఎస్పీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసి, నగదు రికార్డులతో సత్కరించారు. 
 

ఈ సమావేశంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ధర్మేంద్ర, అవనిగడ్డ డిఎస్పీ మహబూబ్ బాషా, దిశ పోలీస్ స్టేషన్ డి.ఎస్.పి రాజీవ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సుభకర్, సత్యనారాయణ, అవనిగడ్డ సీఐ రవికుమార్, దిశ సీఐ నరేష్ కుమార్, అవనిగడ్డ సబ్ డివిజన్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.