విధి నిర్వహణే ధ్యేయం... కాలువలో చిక్కుకున్న యువకుడు
ఎన్ని అవాంతరాలు వచ్చినా విధులకు మాత్రం తప్పకుండా వెళ్ళాలనేది ఆ యువకుడి ఆలోచన. విధి నిర్వహణకు వెళ్ళే ప్రయత్నంలో కాలువలో చిక్కుకున్న యువకుడు ప్రాణపాయంతో విలవిల్లాడాడు. చివరికి అతడిని గ్రామస్తులు, సర్పంచి సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు.
చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం కుప్పడుతాగేలికి చెందిన యువకుడు అశోక్ స్థానిక పరిశ్రమలో పని చేస్తున్నాడు. విధులకు తప్పనిసరిగా వెళ్ళాలని, పెద్ధపాండూరు నుంచి తొండంబట్టుకు వెళ్ళే మార్గంలోని కాలువ దాటే ప్రయత్నం చేశాడు. అయితే వరద ఎక్కువగా ఉండటంతో నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయాడు. చివరికి కాలువకు పక్కనే ఉన్న విద్యుత్ పోల్ ను పట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ గ్రామస్తులతో కలిసి హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. తాళ్ళ సాయంతో ఆ యువకుడిని సురక్షితంగా కాపాడారు.
ఒక్క రోజు కూడా విధులకు సెలవు పెట్టకూడదనే ఆలోచనతో బయలుదేరిన అశోక్ ని గ్రామస్తులు అభినందించ కుండా ఉండలేకపోయారు. అయితే, ఇంత వరద ప్రమాదంలో చిక్కుకుపోయినందుకు వారిస్తూ, ప్రాణాలు దక్కినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.