సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (10:02 IST)

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం... రాష్ట్రంలో భారీ వర్షాలకు ఛాన్స్..

rain
ఉత్తర బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావం ఆదివారం ఏర్పడనుంది. ఇది సోమవారానికి మరింతగా బలపడే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఒక ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. విదర్భ నుంచి అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి కొనసాగుతున్నట్లు ఐఎండీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. 
 
శనివారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో 5.5 సెం.మీ., నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెళ్లి 5.4 సెం.మీ., నారాయణపేట జిల్లా ధన్వాడ 4.8 సెం.మీ., నిర్మల్ జిల్లా భైంస మండలం వనాలహాడ్‌లో 4.3 సెం.మీ. వర్షం కురిసింది. రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట, జోగులాంబ గద్వాల, కరీంనగర్ జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
 
చల్లటి వాతావరణం కొనసాగాల్సిన ఈ సమయంలో రాష్ట్రంలో పలుప్రాంతాల్లో ఎండాకాలాన్ని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగలూ, రాత్రి వేడి, ఉక్కబోత అల్లాడిస్తున్నాయి. గత ఐదారు రోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతోంది. శనివారం పగలు ఆదిలాబాద్‌లో 36.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ నగరంలో సాధారణం కన్నా 3.8 డిగ్రీలు అధికంగా 34.6, నిజామాబాద్‌లో 34.6, మెదక్ 33.2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా హన్మకొండ, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దాదాపు మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.