గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2020 (09:22 IST)

తిరుమల కొండపై క్రిస్మస్ శుభాకాంక్షలా?: బోండా ఉమామహేశ్వరరావు

తిరుమల కొండపై నుంచి రాష్ట్ర మంత్రులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడమేంటని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. హిందూ మత విశ్వాసాలపై వైకాపా కుట్రపూరితంగా దాడి చేస్తోందని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...!
 
"జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మత విశ్వాసాలపై కుట్రపూరితంగా దాడి జరుగుతోంది. తిరుమల కొండపై సంప్రదాయాలను గౌరవించాలన్న స్పృహ లేకుండా మంత్రులు వ్యవహరించడం సిగ్గుచేటు. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు.

తిరుమల వెంకన్న సన్నిధిలో మంత్రులు అవంతి శ్రీనివాస్, నారాయణస్వామి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడం టీటీడీ నిబంధనలను ఉల్లంఘించడమే. తిరుమల సంప్రదాయాలను పాటించాల్సిన ప్రభుత్వ పెద్దలే వాటిని తుంగలో తొక్కడం సిగ్గుచేటు. మీ ప్రచార ఆర్బాటం కోసం తిరుమలను వేదికగా వాడుకుంటున్నారు.

ఇది రాజకీయ ప్రచార వేదిక అనుకుంటున్నారా? తిరుమల కొండ దిగి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదు. గతంలో తిరుమల కొండపై వైకాపా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి 2 వేల మందితో ర్యాలీగా వెళ్లి తిరుమల కొండపై డ్రోన్లు ఎగురవేయడం చూశాం.

మరోవైపు ద్వారకా తిరుమలలోనూ వైకాపా ఎమ్మెల్యే అబ్బాయ్ చౌదరి ఆలయ ప్రాంగణంలోనే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం వైకాపా విధానాలకు నిదర్శనం. ద్వారకా తిరుమల ఆలయ బోర్డు ఛైర్మన్ మేడిపల్లి గంగరాజు కూడా ఆలయంలో చెప్పులతో తిరగడం.. ఇవన్నీ దేనికి సంకేతం?

జగన్ రెడ్డి పాలనలో కుట్ర పూరితంగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. 18 నెలల పాలనలో 180కు పైగా దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేశారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం, దుర్గగుడిలో వెండి సింహాలు మాయమైతే బాధ్యులపై ఇంతవరకు చర్యలు లేవు.

రోజుకో దేవాలయంపై దాడులు జరుగుతున్నా జగన్ రెడ్డి స్పందించిన దాఖలాలు లేవు. మౌనం వహించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. హిందూ మతంపై జరుగుతున్న వరుస దాడులపై సత్వర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి. తిరుమల సంప్రదాయాలను ఉల్లంఘించిన మంత్రులపై చర్యలు తీసుకోవాలి."