1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (08:42 IST)

అభివృద్ధి, సంక్షేమాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు: బొండా ఉమామహేశ్వరరావు

తెలుగురాష్ట్రాల్లో తెలుగుదేశంపార్టీ ముద్ర శాశ్వతమని, చంద్రబాబు నాయుడి పనితీరు, అభివృద్ధి అనేవి ఎన్నటికీ చెరిగిపోవనే సత్యాన్ని అసమర్థ వైసీపీప్రభుత్వం తెలుసుకోవాలని టీడీపీ నేత, మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సూచించారు.

ఆయన పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సమైక్యరాష్ట్రంతో పాటు, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కూడా చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధిని, టీడీపీ అమలుచేసిన సంక్షేమపథకాలను మరే ప్రభుత్వం అమలుచేయలే దన్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే....!

తెలుగురాష్ట్రాల్లో టీడీపీ ప్రభుత్వ ముద్ర, చంద్రబాబు నాయుడి పనితీరు, అభివృద్ధి శాశ్వతం. ఆయన పేరు చెబితే, ముందుగా గుర్తొచ్చేది అభివృద్ధి, సంక్షేమాలే, వాటికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్. సమైక్య రాష్ట్రానికి, విభజనానంతర రాష్ట్రానికి తల్లి, పిల్ల కాంగ్రెస్ లు ఏం చేశాయో చెప్పగలవా? 1995కు ముందు హైదరాబాద్ నగరం ఎలాఉండేదో, అప్పుడు అక్కడ జరిగిన అభివృద్ధేమిటో చరిత్రలోకి వెళ్లి తెలుసుకోండి.

చంద్రబాబు హాయాంలో సైబరాబాద్ నిర్మాణంతో భాగ్యనగరం జాతీయస్థాయి నగరమైందని  వైసీపీ నేతలు గ్రహించాలి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, ఫ్లైఓవర్ల నిర్మాణం ఎవరు చేశారో తెలుసుకోండి. కొత్త రాష్ట్రంలో బెజవాడ ఫ్లైఓవర్, అమరావతి, హైకోర్టు, సచివాలయం, పట్టిసీమ, పోలవరం ఎవరు నిర్మించారో తెలియదా? చంద్రబాబు కట్టిన నిర్మాణాల్లో ఉంటూ, ఆయన కల్పించిన నీడన బతుకుతూ, ఆయనపైనే విమర్శలు చేస్తారా?

విట్, ఎస్ఆర్ఎం, అమృతామయి, ఎయిమ్స్ వంటి వైద్య, విద్యారంగ సంస్థలను తీసుకొచ్చింది ఎవరు?  ఉభయ తెలుగురాష్ట్రాల అభివృద్దిలో చంద్రబాబునాయుడి ముద్ర ఎన్నటికీ చెరిగిపోనిది.  కళ్లకు కట్టినట్లు నిర్మాణాలు ఆకాశమంత ఎత్తులో కనిపిస్తుంటే, గ్రాఫిక్స్ అంటూ సిగ్గులేకుండా విషప్రచారం చేస్తారా? వైసీపీ, కాంగ్రెస్ లు అసాధ్యమన్న దుర్గగుడి ఫ్లైఓవర్  నిర్మాణం పూర్తయింది చంద్రబాబు పాలనలో కాదా?

25ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏం చేశారనే వారు కళ్లు తెరిచి చూస్తే వాస్తవాలు కనిపిస్తాయి.  కాంగ్రెస్ ప్రభుత్వంలో  మంత్రిగా ఉన్న వ్యక్తి అవినీతి కారణంగా రాష్ట్రానికి రావాల్సిన వోక్స్ వ్యాగన్ కార్ల పరిశ్రమ  రాష్ట్రానికి రాకుండా పారిపోయింది.  చంద్రబాబు అధికారంలోకి రాగానే  కియా కార్ల పరిశ్రమను తీసుకొచ్చారు.

టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కియా కార్ల కంపెనీ యాజమాన్యాన్ని వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ అవినీతికోసం వేధిస్తున్నారు.  దాంతో సదరు కంపెనీ పక్క రాష్ట్రానికి వెళ్లే ఆలోచన చేస్తోంది. ఈవిధంగా ఉన్న దాన్ని నాశనం చేయడం తప్ప, వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఏవిధమైన అభివృద్ధిచేసింది?

15నెలల్లో పోలవరం సహా, రాష్ట్రంలో ఎక్కడా వీసమెత్తు పనిచేయని వైసీపీ ప్రభుత్వం, అబద్ధాలతో కాలం గడుపుతోంది. పోలవరం సహా, రాష్ట్రంలోని అనేక సాగు, తాగునీటి ప్రాజెక్టులను రివర్స్ టెండరింగ్ పేరుతో కమీషన్ల కక్కుర్తితో నిలిపేశారు. చంద్రబాబు మొదలుపెట్టిన అమరావతి నిర్మాణాలను ఈప్రభుత్వం పూర్తిచేసుంటే, అదే రాష్ట్రానికి పాడికుండ లా మారి, ప్రజల కష్టాలు తీర్చేది. అటువంటి రాజధానిని నాశనం చేయడంకోసం వేలకువేలకోట్ల ప్రజాధనాన్ని కోర్టులపేరుతో, మూడురాజధానులంటూ వృథాచేస్తోంది జగన్ కాదా?

రూ.2వేల పింఛన్ రూ.3వేలు చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం 3నెలలైనా దాన్ని పెంచలేదు. అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా చంద్రబాబు. వాటికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ. టీడీపీ హాయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాలను ఆధారాలతో సహా నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నాం. వైసీపీ తరుపున ఎవరు చర్చకు వస్తారో రావాలి. 

అన్నంపెట్టిన కాంగ్రెస్ కు, రాజకీయ భిక్షపెట్టిన సోనియాగాంధీకి ఒకటికి పది వెన్నుపోట్లు పొడిచింది వైసీపీఅధినేత జగన్ కాదా? 

ఎన్టీఆర్ మరణానంతరం తెలుగుదేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న కొన్ని దుష్టశక్తులనుంచి చంద్రబాబు ఆనాడు టీడీపీని కాపాడారు. ఈ విషయం తెలుగుప్రజలందరికీ తెలుసు. ఆతరువాత కూడా ప్రజలఆశీస్సులతో చంద్రబాబు  పలుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ మాదిరి కుట్ర రాజకీయాలు చేయడం చంద్రబాబుకు తెలియదు. 

15నెలల్లో లక్షకోట్ల అప్పు తేవడం తప్ప, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది? తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమం తెలుగురాష్ట్రాల్లో ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటాయి.