ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (07:46 IST)

చంద్రబాబు పాలనలో జరిగిందే నిజమైన విధ్వంసం: సజ్జల రామకృష్ణారెడ్డి

రాష్ట్రంలో వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తోందన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఆ విధ్వంసం ఎక్కడ జరిగిందో చూపించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. 
 
తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. "తన దోపిడీ కోసం చంద్రబాబు సృష్టించుకున్న స్వప్నాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ విధ్వంసం చేసి వుండవచ్చని, ప్రజలకు సంబంధించింత వరకు ఆయన చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రజాసంక్షేమం, అభివృద్ధి ముడిపడి వున్నాయని పేర్కొన్నారు. 
 
చంద్రబాబుకు అధికారం పోయాక విధ్వంసం కలలు వస్తున్నట్టున్నాయి..
నిన్నా, మొన్నా టిడిపి అధినేత చంద్రబాబు తన జూమ్ కాన్ఫెరెన్స్‌లో విధ్వంసం అనే ఒక కొత్త పదం ఖాయం చేశారు. జగన్ డిఎన్ఎలో విధ్వంసం వుందని, విధ్వంసంకు ఆయన మారు పేరు అని విమర్శలు చేశారు. సాధారణంగా రాత్రి పూట పీడకలలు వస్తుంటాయి,

నిద్రలేచిన తరువాత చూస్తే మామూలుగానే వుంటుంది, కానీ పీడకలల వల్ల వచ్చిన వణుకు పోదు. అలాగే చంద్రబాబుకు పద్నాలుగు నెలల కిందట అధికారంకు దూరమైన వైనంను జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రజల మద్దతుతో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైయస్‌ జగన్‌ పాలనను చూసి తట్టుకోలేక పోతున్నారు. అందుకే ప్రతిరోజూ ఆయన పాలనపై రకరకాలుగా తన వ్యతిరేకత చూపుతున్నారు.

తాజాగా ఆయన ఉపయోగించిన విధ్వంసం అనే మాటకు చాలా ఖచ్చితమైన అర్థం వుంది. ఈ రాష్ట్రంలో ఏ రూపంలో విధ్వంసం జరిగిందో చంద్రబాబు చెప్పాలి? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు వర్చ్యువల్ ప్రపంచంలోనే వున్నారు. అలాగే తనలాగానే ప్రజలు కూడా తాను సృష్టించిన వర్చ్యువల్ ప్రపంచంలో వుండాలని కోరుకున్నాడు. వృద్ధాప్యంలోకి వచ్చిన తరువాత తన వారసులను సెటిల్ చేయాలనే తపన మొదలవుతుంది.

దానిలో భాగంగానే చంద్రబాబు అమరావతి పేరుతో భారీగా సొమ్ము వెనుకేసుకోవాలని ప్రయత్నించాడు. ప్రజలు వర్య్యువల్ ప్రపంచంలో బతికేలా అలవాటు చేయాలని ప్రయత్నించాడు. ఈ ప్రాసెస్‌లో ఆయన చేసిందే నిజమైన విధ్వంసం. మొత్తం అన్ని వ్యవస్థలను కుళ్లిపోయేట్లు చేశాడు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా ఒక మాఫియా పాలనను, సువర్ణాక్షరాలతో నిలిచిపోయేలా తన పాలనను లిఖించుకున్నాడు.

ఈ విషయంలో ఏ రికార్డులో అయినా చంద్రబాబు పేరు నమోదు చేయవచ్చు అన్నారు. ఒక నిర్ధిష్టమైన వ్యవస్థలు లేకుండా చేసుకుంటూ వచ్చి, రూ.3.20 లక్షల కోట్లు అప్పులు చేశాడు. రాష్ట్ర ప్రజల నెత్తిమీద అప్పులు పడేసి వెళ్ళిన ఈ వ్యక్తి ఈ రోజు విధ్వంసం గురించి మాట్లాడుతున్నాడు. ఈ ప్రభుత్వం ఏ విషయంలో విధ్వసంకు పాల్పడిందో అడిగితే, ఒక్క చిన్న అంశాన్ని కూడా చూపలేక పోతున్నాడు.

ప్రజలకు ఉత్తమ పాలనను అందిస్తూ, సంక్షేమాన్ని డోర్‌ డెలివరీ వరకు తీసుకు వెళ్ళడం విధ్వంసమా? వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు చేరువ చేయడం విధ్వంసమా? సంతృప్తకర స్థాయిలో ప్రభుత్వ పథకాలను అందించడం విధ్వంసమా? ప్రతిపైసా కూడా నేరుగా అర్హులైన లబ్ధిదారుల చేతుల్లోకి వెళ్ళేలా చేయడం విధ్వంసమా? వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి" అని సజ్జల నిలదీశారు. 
 
టీడీపీని ఇక జూమ్ పార్టీ అనాలా..?
"ప్రజల్లో ఉంటే పార్టీ అంటారు. ప్రజల్లో నడిస్తే నాయకుడు అంటారు. ప్రజల కోసం పనిచేస్తే అధికారం ఇస్తారు. మరి తానుగానీ, తన పుత్రరత్నంగానీ ప్రజల్లోకి రావటానికే భయపడితే అటువంటి పార్టీని ఏమనాలి..? జూమ్ పార్టీ అనాలా..? వీడియో కాన్ఫరెన్స్ పార్టీ అనాలా... ? అని సజ్జల ప్రశ్నించారు.

రోజూ ప్రెస్ మీట్ పెట్టే  రాక్షస బలం చంద్రబాబు నాయుడికి ఉందని అర్థమవుతోంది కానీ, దాన్ని భరించే శక్తి ఎవరికీ ఉండదు. ఈ వీర సుత్తిలో ఒక నిజమైనా మాట్లాడతారా.. అంటే అదీ లేదు" అని ఎద్దేవా చేశారు. 
 
అరటి, చెరుకు తోటలు తగలబెట్టించింది మీరు కాదా..?
బసుల్ని తగలబెట్టిస్తే తప్ప సమ్మె చేసినట్టు కాదని, తునిలో రైలు తగలబెట్టాలని ఆదేశించిన వ్యక్తి ఈరోజున వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. అమరావతిలో రూ. 2,150 కోట్లు ఖర్చు పెడితే అంతా పూర్తయ్యేదంటున్న చంద్రబాబు నాయుడు.. రైతులకు ఇవ్వాల్సిన ఇళ్ళ స్థలాల ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లకు డ్రైనేజీ, నీరు, కరెంటు, రోడ్లకు రూ. 10 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అర్థం చేసుకోబట్టే కదా.. వారికి  అధికారంలో ఉన్న 5 ఏళ్ళలో ప్లాట్లు కూడా డెవలప్ చేయకుండా వదిలేశారు అని విమర్శించారు.

అమరావతిలో అరటి, చెరుకు తోటలు తగలబెట్టింది ఎవరని అప్పటి గుంటూరు రూరల్ ఎస్పీ నిజాయితీగా దర్యాప్తు చేస్తుంటే.. వారు టీడీపీ వాళ్ళేనన్న నిజాలు బయటకు వస్తున్నమీదట ఆ ఎస్పీనే ట్రాన్స్ ఫర్ చేసింది నిజం కాదా అని సజ్జల ప్రశ్నించారు. 
 
అమరావతి ఉద్యమం ఒక అభూత కల్పన
అమరావతి ఉద్యమం ఒక అభూత కల్పన అని, పది మంది చంద్రబాబు మనుషులు తమ భూముల రేట్ల కోసం టీవీ కెమెరాలు రాగానే అరిచే అరుపుల్ని ఒక పద్ధతి ప్రకారం ఆడే డ్రామాలను ఉద్యమాలు అనే పేరుతో పిలిస్తే.. అది ఉద్యమం అన్న పేరుకే అవమానం అని అన్నారు. తెలుగుదేశం పార్టీని నడిపే చేవగానీ, శక్తిగానీ చంద్రబాబుకు లేదు.

రాదు కూడా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఈ ప్రభుత్వం నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది. కాబట్టే, బాబు వీటిలో ఏ ఒక్క సామాజికవర్గానికి ప్రతినిధి కాడు. కాలేడు కూడా.. ఇక మిగిలింది ఏమిటి.. రాజకీయ సన్యాసం మాత్రమే అని సజ్జల చెప్పారు. 
 
ఉత్తరాంధ్ర, రాయలసీమలో అడుగు పెట్టే హక్కే బాబుకు లేదు
వికేంద్రీకరణను వ్యతిరేకించిన చంద్రబాబు-అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ జిల్లాల్లో అడుగు పెట్టే హక్కునే కోల్పోయాడు. విజయవాడను, గుంటూరును కూడా తన స్వార్థం కోసం చంపేసి ఈ రెండింటికీ 30 కిలో మీటర్ల దూరంలో ఎవరూ ఊహించని ప్రాంతంలో బినామీలతో భూములు కొనిపించి వాటికి రేట్లు పెరగాలని ఆయన చేస్తున్న ఆందోళనకు చివరికి విజయవాడ, గుంటూరు ప్రజల మద్దతు కూడా లేదని చెప్పారు. మరి ఇప్పుడు టీడీపీని పేరు మార్చి.. జూమ్ పార్టీ అని పెట్టుకుంటే బాగుంటుందని చంద్రబాబుకు సజ్జల సలహా ఇచ్చారు. 
 
బాబు హయాంలో జరిగిన విధ్వంసం ఇప్పుడు జరగటం లేదనే బాధేమో..
 కరోనా సమయంలోనూ, తాజాగా వరదల్లో కూడా నడిచివెళ్ళి ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటర్ల వ్యవస్థ అందరి ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్రంలో పద్నాలుగు నెలల్లో రూ.59వేల కోట్లు నేరుగా ప్రజలకు అందించడం ద్వారా లబ్ధి చేకూర్చాం. ఏడాది కాలంలో రూ.40వేల కోట్లు ప్రజలకు పలు సంక్షేమ పథకాల ద్వారా అందించాం.

ప్రతినెలా ఒకటో తేదీనే ఎనబై శాతం వరకు నేరుగా పెన్షనర్ల చేతికే సొమ్మును అందిస్తున్నాం. ఇదే చంద్రబాబు హయాంలో అయితే నెలలో ఏ రోజు పెన్షన్ అందుతుందో తెలియని పరిస్థితి. అమ్మ ఒడి, చేయూత, ఆసరా ఇలా అన్ని పథకాలు ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ లబ్ధిదారుల ఖాతాలకే నేరుగా జమ అవుతోంది. గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు సేవలు అందుబాటులోకి తెచ్చాం. పేద విద్యార్ధుల కోసం ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు సిద్దమవుతున్నాయి.

ఇంత బాధ్యతాయుతంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఆఖరికి ఎల్లో మీడియాలో వచ్చిన విమర్శల్లో కూడా వాస్తవం వుంటే, సీఎం గారు స్వయంగా డైరెక్షన్ ఇచ్చి వాటిని పరిష్కరించమని ఆదేశిస్తున్నారు. కరోనా సంక్షోభంలో గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్న టమాట, నిమ్మ, ఆఖరికి దొండ రైతులను కూడా ప్రభుత్వం ఆదుకుంది. ఎక్కువ మంది ప్రజాబాహుళ్యం, రైతులు నష్టపోతుంటే ప్రభుత్వం స్పందిస్తుంది.

కానీ తక్కువ మందికి నష్టం జరుగుతున్నా సరే ఎందుకు వారిని ఆదుకోవడం లేదని మన సీఎం ప్రశ్నిస్తున్నారు. ఇది విధ్వంసం అని చంద్రబాబు అనుకుంటున్నారా? బహుశా తన హయాంలో జరిగినంతగా విధ్వంసం ఇప్పుడు జరగడం లేదని చంద్రబాబు అనుకుంటున్నాడు. శ్రీ వైయస్‌ జగన్ పాలన బ్రహ్మండంగా వుందని టిడిపి వారు కూడా అంగీకరిస్తున్నారు" అని సజ్జల వివరించారు. 
 
పక్కరాష్ట్రంలో వుండి కరోనా గురించి బాబు మాట్లాడుతున్నారు...
కరోనా వచ్చిన నాటి నుంచి చంద్రబాబు ఎక్కడ వున్నారు?  మీ వృద్ధాప్యం వల్ల హైదరాబాద్‌లో వుండిపోయారు. మరి మీరు ఎన్నో ఆశలు పెట్టి రాజకీయాల్లోకి తీసుకు వచ్చిన మీ కుమారుడు లోకేష్  యువకుడే కదా? ఎందుకు పక్కరాష్ట్రంలో కూర్చుని ఉన్నారు?

మేం ప్రతిపక్షంలో వున్నప్పుడు నిరంతరం ప్రజల్లో వుండే జగన్ గారిపై అనేక విమర్శలు చేశారు. ఇప్పుడు మీరు ఎక్కడ వుండి జూమ్ సమావేశాలు పెడుతున్నారు? ఆనాడు కృష్ణా కాలువ గట్టున, ఎవరిదో కబ్జా చేసి అక్రమంగా కట్టిన ఇంట్లో వున్న మీరు పదేపదే వైయస్ జగన్‌ ని ప్రశ్నించారు. కనీసం జూమ్ కాన్ఫరెన్స్ లు అయినా ఇక్కడి నుంచి ఎందుకు చేయడం లేదు?  అని సజ్జల ప్రశ్నించారు.

రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకు పది వేలు బయటకు వస్తున్నాయని వాపోతున్న చంద్రబాబు-రికవరీ రేటులోగానీ, క్వారంటైన్ సదుపాయాల్లో గానీ దేశంలోనే మెరుగైన రాష్ట్రాల్లో ఏపీ ఉందన్న నిజాన్ని ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు.
 
జగన్ చేతల మనిషి.. మీ తప్పుడు విమర్శలను పట్టించుకోరు..
ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, వాటి ఫలాలు ప్రజలకు అందడాన్ని ఎలా అడ్డం కొట్టాలి అని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు.

పూర్వం మహాయజ్ఞం జరుగుతుంటే, రాక్షసులు పైనుంచి దానిలో వ్యర్థాలను వేసి చెడగొట్టేవారు. అలాగే చంద్రబాబు కూడా రోజూ జూమ్ కాన్ఫరెన్స్‌లు పెట్టి, మంచిగా జరుగుతున్న పాలనపై తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు.  సీఎం జగన్ చేతల మనిషి, మీరు చేస్తున్న తప్పుడు విమర్శలను ఆయన పట్టించుకోవడం లేదు. వేరే రాష్ట్రంలో కూర్చుని జూమ్‌లో ప్రతిరోజూ ఒక్కో సెక్షన్‌తో మీటింగ్‌లు పెట్టుకుంటూ అడ్డగోలు విమర్శలు చేస్తున్నాడు. 
 
బాబు లిటిగెంట్ మాదిరిగా తయారయ్యాడు. 
ఆఖరికి లిటిగెంట్‌ల మారిదిగా కోర్ట్‌ లను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం చేసే ప్రతి పనిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రారంభంలో కరోనా పరీక్షలపై విమర్శలు చేశాడు, ఇప్పుడు కరోనా పాజిటీవ్ కేసులు ఎక్కువగా రావడం పైన కూడా విమర్శలు చేస్తున్నాడు. డబ్ల్యుహెచ్‌ఓ నిబంధనల ప్రకారమే ప్రభుత్వం రెడ్‌ జోన్‌లలో పరీక్షలు చేస్తోంది.

కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువ టెస్ట్‌లు చేస్తుంటే పాజిటీవ్‌ కేసులు బయటపడుతున్నాయి. పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతాయుతంగా కరోనాను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అంతేకానీ లెక్కలు బయటకు రాకుండా మేం చేయడం లేదు. వైద్యలు కూడా సరిహద్దుల్లోని ఆర్మీకంటే ఎక్కువ బాధ్యతతో దీనిని ఒక విపత్తుగా భావించి పనిచేస్తున్నారు.

ఇటువంటి నేపథ్యంలో ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు జరిగితే, దానిని పెద్దగా చిత్రీకరించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు. శవాలపై పేలాలు ఏరుకుంటున్నట్లుగా, మురికి గుంట నుంచి కూడా ఏదైనా దొరుకుతుందా అనే చందంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు.

ఇటువంటి ప్రతిపక్షంను ఎక్కడా చూడలేదు. చంద్రబాబుకు ఏ ప్రజాస్వామిక విలువలపైనా గౌరవం లేదు. అసలు ప్రజాస్వామ్యంపైనే చంద్రబాబుకు గౌరవం లేదు. తెలుగుదేశం పార్టీని సైతం కెమేరాలను నమ్ముకున్న పార్టీగా మార్చాడు. 
 
అమరావతిలో ఏ రైతుకూ అన్యాయం జరగదు...
అమరావతి ఉద్యమం 250 రోజులు దాటిందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడు. తన బాధను మొత్తం  ఊరి బాధ చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు. అమరావతిని అడ్డం పెట్టుకుని తన బినామీలతో కొనుగోలు చేయించిన వేలాది ఎకరాల భూమికి ఇప్పుడు వికేంద్రీకరణ వల్ల విలువ పోతుందనే బాధతో చంద్రబాబు వున్నాడు.

ఆ బాధ ఏమిటో స్పష్టంగా బయటకు చెప్పుకోలేక చంద్రబాబు విలవిలలాడుతున్నాడు. అందుకే తన సమస్యను మొత్తం రాష్ట్ర సమస్యగా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు అని సజ్జల అన్నారు. 
 
2019 నవంబర్ నాటికి వున్న లెక్కల ప్రకారం అమరావతిలో 28,526 వేల మంది రైతుల నుంచి 34,385 ఎకరాలను ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంది. దీనిలో 30,913 ఎకరాలు పట్టాభూమి. 2,671 ఎకరాల భూమి అసైన్డ్ భూములు వున్నాయి. ఈ అసైన్డ్ భూములను కూడా తెలుగుదేశం బినామీలు దళితులను బెదిరించి, ప్రలోభపెట్టి కొనుగోలు చేశారు.

ఆ భూములు ప్రభుత్వానికి ఇచ్చి లబ్ధిపొందాలని ప్రయత్నించారు. ఇప్పుడు మా ప్రభుత్వం అసైన్డ్ భూములు ఇచ్చిన వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నిజమైన భూయజమానులకే లబ్ధి చేస్తామని ప్రకటించింది. దీనిపై రాజధానిలోని అసైన్డ్‌ రైతులు కూడా సంతోషంగానే వున్నారు. రాజధానిలో ఎకరం లోపు భూములు ప్రభుత్వానికి ఇచ్చిన వారు 19,970 మంది రైతులు వున్నారు.

మొత్తం 5 వేల ఎకరాల లోపు భూములు ఇచ్చిన రైతులు 27,347 మంది వున్నారు. మిగిలిన వారు పెద్ద రైతులు. భూములు ఇచ్చిన రైతుల్లో 10,050 మంది సీఆర్‌డిఎ కు తమ భూములు ఇచ్చే ముందే ఇతరులకు అమ్మేసుకున్నారు. ప్రభుత్వం కేటాయించిన ప్లాట్‌ లకు గానూ  7500 రైతులు అమ్మేసుకున్నారు.

మొత్తం మిగిలింది సుమారు 11 వేల మంది  రైతులు వుంటారని అంచనా. వీరికి మరింత న్యాయం చేయడానికి కౌలును మరో అయిదేళ్ళ పాటు ఇవ్వాలని, రైతుకూలీలకు  పెన్షన్ అయిదు వేలు చేయడం, అసైన్డ్‌ భూముల వారికి న్యాయం చేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నామన్నారు. 
 
అమరావతిలో బాబు కెమెరా ఉద్యమం చేయిస్తున్నాడు..
ఇంకా రాజధాని ప్రాంతంలో భరించలేనంత బాధతో రైతులు ఎక్కడ వున్నారు? రాజధానిని పూర్తిగా తీసేయడం లేదు. ఈ ప్రాంతంలో జనాభా పెంచడం కోసం పేదలకు ప్లాట్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే,  దానికి కూడా చంద్రబాబు అడ్డం పడుతున్నాడు.

చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు ఈ ప్రాంత అభివృద్దికి సంబంధించి ఏం ప్లాన్ చేశారు? అమరావతి రాజధాని నిర్మాణంకు రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు  అవుతుందని చంద్రబాబు అన్నారు. అంత అవసరం లేకుండా అన్ని విధాలుగా ఈ ప్రాంతంను అభివృద్ధి చేయాలనేదే మా ప్రభుత్వ ఆలోచన. చంద్రబాబు వర్చ్యువల్ ప్రపంచంలో బతుకుతూ, మోసకారి  రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వ్యవహరించారు.

కానీ వాస్తవంగా అభివృద్ధిని రైతులకు అందించాలని మేం కృషి చేస్తున్నాం. అది అర్ధం చేసుకోబట్టే మంగళగిరిలో చంద్రబాబు కుమారుడిని ప్రజలు ఓడించారు. అది అర్థం చేసుకోకుండా చంద్రబాబు ఇంకా అమరావతిలో కెమేరా ఉద్యమం చేస్తున్నారని సజ్జల విమర్శించారు. 
 
చంద్రబాబు తన కులానికి కూడా అన్యాయం చేస్తున్నాడు...
కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభ సమయంలో ప్రజలకు సేవలు అందించే ఆసుపత్రుల విషయంలో చంద్రబాబు ప్రజానాయకుడిగా వ్యవహరించడం లేదు. తనకు ఏ కులంతోనూ సంబంధం లేదని చెబుతూనే తన వైఖరితో తన సొంత కులానికి కూడా చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడు.

రాజకీయం అనేది కులాలపై ఆధారపడి చేయకూడదు, అలా చేస్తే అధికారంలోకి రాలేరు. అన్ని వర్గాల ఆదరణ పొందినప్పుడు మాత్రమే అధికారంలోకి రాగలం. దీనిని విస్మరించి చంద్రబాబు ఒక కులానికి, ఒక చిన్న ప్రాంతానికి పరిమితమైపోయాడు. తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను కూడా పక్కకుపెట్టేశాడు. తన కులానికి కూడా అన్యాయం చేసుకుంటూ, మిగిలిన అందరూ తెలియకుండానే ఆయన కులాన్ని అనుమానించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు అని సజ్జల విమర్శించారు. 
 
కులం చూడం, పార్టీ చూడం.. అందరికీ సంక్షేమ ఫలాలు
 ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడా ఎవరి కులం చూడటం లేదు. రైతులు, డ్వాక్రా గ్రూపుల్లో ఏ కులం వారు వున్నారు? వారిలో అన్ని కులాలు వున్నాయి. వారందరూ ప్రభుత్వం వల్ల లబ్ధిపొందుతున్నారు. టిడిపి అయినందువల్ల లబ్ధి పొందలేదని ఎవరైనా ముందుకు వస్తే, దానికి బాధ్యులైన వారిపై ఖచ్చితంగా చర్యలు వుంటాయి.

రాష్ట్రంలోని ప్రజలందరికీ ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తోంది. సీఎం జగన్ గారు తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల దేశంలోనే తన పనితీరుతో అ్రగస్థానంలోకి వస్తున్నారు. మీలాగా ప్రచారం చేసుకోవడం లేదు, అవసరమైన సందర్భంలోనే మాట్లాడుతూ పాలన చేస్తున్నారు. జూమ్‌లో గంటల తరబడి మాట్లాడుతున్నారు. ప్రజలకు భరించలేనంత వికారం పుట్టిస్తున్నారని సజ్జల విమర్శించారు.
 
బాబులా వికేంద్రీకరణపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు
వికేంద్రీకరణపై ఒక పూర్తి నమ్మకంతోనే సీఎం వైయస్ జగన్ పని చేస్తున్నారు. మధ్యలో చిన్నచిన్న ఇబ్బందులు ఎదురవుతున్నా దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాజధాని అంశం అనేది రాష్ట్రానికి సంబంధించిన విషయమని కేంద్రం కూడా చెప్పింది.

అందుకే ఆనాడు చంద్రబాబు ఎవరితోనూ చర్చించ లేదు, ఎవరి పర్మీషన్ తీసుకోలేదు. చంద్రబాబులా మేం చేయలేదు. ఏడాది పాటు వికేంద్రీకరణపై కసరత్తు చేశాం. నిపుణులు, కేబినెట్ సబ్ కమిటి నివేదికలను తీసుకున్నాం. శాసనసభ, కౌన్సిల్‌లో చర్చ జరిగింది. అయినప్పటికీ ఏదో ఒక విధంగా కుట్రలతో దీనిని అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు.

ఒకసారి  సెలెక్ట్ కమిటీ అంటాడు, మరోసారి లిటిగెంట్‌ మాదిరిగా కోర్ట్‌లో పిటీషన్లు వేయిస్తాడు. ఈ మొత్తం వ్యవహారంపై సీఆర్‌డిఎ ప్రాంతంలోని ప్రజలు పట్టించుకోవడం లేదు. రాజధాని వల్ల లబ్ధి పొందాలని అనుకుంటున్న కొద్ది మంది తప్ప ఎవరూ దీనిని ఉద్యమంగా భావించడం లేదు అని సజ్జల అన్నారు. 
 
కొడాలి నాని ప్రశ్నకు బాబు సమాధానం చెప్పాలి
పేదలకు ఇళ్ళస్థలాలు ఇవ్వకూడదన్న చోట శాసనసభలు వుండకూడదు అన్న మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే అవకాశం లేని చోట రాజధాని అసలే అవసరం లేదు అన్న మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను మేం పూర్తిగా ఏకీభవిస్తున్నాం అని అన్నారు. 

కమ్యూనిస్టులు ఎందుకు నోరు మెదపడంలేదు
పేదల ఇళ్ళస్థలాల కోసం పోరాటాలు చేసే కమ్యూనిస్ట్‌లు కూడా పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వొద్దని అంటుంటే ఎందుకు నోరు మెదపడం లేదు? చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. రమేష్ హాస్పటల్స్ విషయంలో కింది కోర్ట్, పై కోర్ట్‌ వేర్వేరుగా ఆదేశాలు ఇచ్చాయి. పది మంది ప్రాణాలు పోతే ప్రాథమిక బాధ్యత రమేష్ హాస్పటల్స్‌ ది కాదు అని అనడం కూడా దుస్సాహసం అవుతుందని సజ్జల అన్నారు. 
 
ఆ గనులు బాబు బినామీలవా..
గొట్టిపాటి రవి, రామారావులకు చెందిన గ్రానైట్ లీజుల్ని చట్ట ప్రకారమే ప్రభుత్వం రద్దు చేసింది. వారి అక్రమాలకు వారు కాదు తాను బాధ్యుడ్ని అని, లేదా ఆ గనులు తన బినామీ గనులని బాబు చెప్పదలచుకున్నారా..? అని ప్రశ్నించారు.  నిమ్మగడ్డ రమేష్, డాక్టర్ రమేష్.. ఈ ఇద్దర్ని ఎందుకు వెనకేసుకొచ్చారని నేరుగా మా పార్టీ తరఫున ప్రశ్నిస్తే.. దానికి సమాధానం చెప్పకుండా నేరగాళ్ళను, వ్యవస్థల్లో ఉన్న తన మనుషుల్ని బాహాటంగా బాబు వెనకేసుకొని వస్తూనే ఉన్నారని సజ్జల అన్నారు.