శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (09:20 IST)

దళితులను ప్రోత్సహించిన ఏకైకనాయకుడు చంద్రబాబు: మాజీ మంత్రి జవహర్

దళితుల సామాజిక న్యాయం కోసం, వారు సమాజంలో అన్ని రంగాల్లో ముందుండేలా, ఆర్థికంగా బలపడేలా  ప్రోత్సహించిన ఏకైకనాయకుడు  చంద్రబాబునాయుడు ఒక్కడేనని,  జీ.ఎంసీ. బాలయోగిని పార్లమెంట్ స్పీకర్ గా, ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్ గా, నారాయణన్ వంటివారిని టీడీపీ అధినేతే రాజకీయంగా ప్రోత్సహించాడనే నిజాలను వైసీపీలోని దళితనేతలు, మంత్రులు తెలుసుకుంటే మంచిదని టీడీపీనేత, మాజీమంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ సూచించారు.

ఆయన తన నివాసంనుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో దళితులు ఆత్మగౌరవంతో, మనోస్థైర్యంతో ఎలా నిలిచారో, జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ15నెలల్లో  ఎంతదారుణంగా జీవిస్తున్నారో అధికారపార్టీనేతలు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో దళితయువకుడు ఉరేసుకొని చనిపోవడం, దళితజడ్జి రామకృష్ణను వేధించడం వంటి దారుణాలు జరిగితే ఏం చేశారన్నారు. 

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో వరప్రసాద్ కు శిరోముండనం చేయించిన కవలకృష్ణమూర్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. కృష్ణమూర్తికి చెందిన ఇసుకలారీ దళితయువకుడిని ఢీకొట్టడంపై వరప్రసాద్ ప్రశ్నిస్తే, అతనిపై కక్షకట్టారన్నారు. వరప్రసాద్ శిరోముండనానికి కారకుడైన కృష్ణమూర్తిని రక్షిస్తున్న పెద్ద తలకాయ ఎవరో చెప్పాలన్నారు. 

కృష్ణమూర్తి వల్ల దెబ్బలు తిన్న వ్యక్తికి సహాయం చేయడానికి తామే ప్రోసిడింగ్స్ ఇచ్చామని  జిల్లాకలెక్టర్ చెప్పారని, ఆవిధంగా వరప్రసాద్ ఘటనలో కృష్ణమూర్తి ప్రమేయం స్పష్టంగా కనిపిస్తున్నా పాలకులు అతన్ని వదిలేయడం ఏంటని జవహర్ నిలదీశారు. ఆధారాలున్నా కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనకడుగువేస్తోందో, దీనిపై అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు ముఖ్యమంత్రిని ప్రశ్నించడంలేదని జవహర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

వైసీపీలోని దళితఎమ్మెల్యేలు మంత్రిపదవులకోసమే చంద్రబాబుపై విషప్రచారం చేస్తున్నారన్నారు.  ప్రభుత్వంలో ఐదుగురు దళిత మంత్రులున్నా ఉపయోగం ఏముందన్న జవహర్, హోంమంత్రికి షాడో హోం మంత్రి ఉన్నట్లే, మిగిలిన మంత్రులకు కూడా జగన్ వర్గంవారే షాడోలుగా వ్యవహరిస్తున్నారన్నారు.   కేవలం ఐదారుగురికి పదవులిచ్చినంత మాత్రాన జగన్ దళితద్రోహి కాకుండా పోతాడా అన్నారు.

జగన్ తమకు పదవులిచ్చాడని సంబరపడుతూ, ఆయన్ని దళితమిత్రగా ప్రచారం చేయడం, వైసీపీలోని దళితనేతలు మానుకోవాలన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ప్రభుత్వంలో దళితులపై 1000కిపైగా దాడులు జరిగాయని, అవన్నీ తెలిసికూడా మౌనంగాఉన్న జగన్ దళితద్రోహి అవుతాడుగానీ, చంద్రబాబు ఎలా అవుతాడని జవహర్ ప్రశ్నించారు. 

విశాఖ శిరోముండనం ఘటనలో అరెస్ట్ చేసినట్లే, మిగతా కేసుల్లో కూడా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నారు.  చంద్రబాబునాయుడే దళితద్రోహి అంటున్న మహిళా మంత్రి ఒక్కసారి తనగతాన్ని గుర్తుచేసుకోవాలని, టీడీపీ అధినేత పెట్టిన భిక్షతోనే ఆమె, ఆమెతండ్రి రాజకీయాల్లోకి వచ్చారనే నిజాన్ని సదరు మహిళామంత్రి తెలుసుకుంటే  మంచిదన్నారు.

వైసీపీలోని దళితఎమ్మెల్యేలు, మంత్రులు తక్షణమే తమతమ పదవులకు రాజీనామా చేశాకే, వారికి దళితుల గురించి మాట్లాడే హక్కు ఉంటుందని మాజీమంత్రి స్పష్టంచేశారు. నిజమైన దళితద్రోహి ఎవరో ప్రజలమధ్యనే చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్న జవహర్, వైసీపీ నుంచి ఎవరొస్తారో రావాలని సవాల్ విసిరారు.

చంద్రబాబు పాలనలో దళితులు ఎంతగౌరవంగా జీవించారో, ఈ ప్రభుత్వంలో ఎంతలాభయంతో బతుకుతున్నారో చర్చించడానికి రావాలన్నారు.  జగన్ ప్రభుత్వంలో దళితులకు రక్షణఉందని చెబుతున్న దళితమంత్రులు, ఆవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, ఇప్పటికైనా అవాకులు, అసత్యాలు ప్రచారంచేయడం మానుకోవాలన్నారు.

ప్రజలనుతప్పుదోవ పట్టించడం ఎల్లకాలం సాగదన్నారు. దళితులపై దాడులు చేసేవారిని ప్రోత్సహిస్తూ, నిమ్నవర్గాల వారిపై ఇన్ని దారుణాలు  జరుగుతున్నా మౌనంగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డే నిజమైన దళితద్రోహి అని, దళితమంత్రులు నిజాలు తెలుసుకుంటే మంచిదని జవహర్ సూచించారు. నూతన్ నాయుడి వల్ల తనకు ప్రాణహాని ఉందని భయపడుతున్న శ్రీకాంత్ కు ప్రభుత్వమే రక్షణ కల్పించాలన్నారు.