శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (07:13 IST)

టీడీపీ కనుమరుగు అక్షర సత్యం: మంత్రి కె.కన్నబాబు

టీడీపీ కనుమరుగు అక్షర సత్యమని మంత్రి కె.కన్నబాబు జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పై నిప్పులు చెరిగారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే....
 
ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పార్టీ రోజు, రోజుకూ క్షీణిస్తూ ఉంటే తిరుపతి ఎన్నికల సందర్భంగా మనోభావాలను కార్యకర్తలతో పంచుకున్నప్పుడు ఆయన వ్యక్తం చేసిన భావాలను చాలా మంది ఆశ్చర్యంగా చూశారు. ఈరోజు మాత్రం ఆచ్చన్నాయుడు మాటలు మాత్రం అక్షర సత్యాలుగా కనిపిస్తున్నాయి.

ఆయన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. కానీ చిత్రం ఏమిటంటే మేం ఎన్నికలు బహిష్కరించాం కాబట్టే వైయస్సార్‌ పార్టీ గెల్చింది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీకంటూ ప్రచారం చేసుకునే సొంత సాధనాలున్నాయి కాబట్టి ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందనే గర్వం మీకు ఎప్పుడూ ఉంటుంది. 
 
మీరు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ఎట్లా అయింది. ఆ రోజు అన్ని స్ధానిక ఎన్నికల్లో పాల్గొన్నారు. పంచాయితీ ఎన్నికల్లో మీ మద్ధతుదారులు లేరా? మున్సిపల్‌ ఎన్నికల్లో మీరు అభ్యర్ధులను పెట్టలేదా? జిల్లా పరిషత్, మండల పరిషత్‌ ఎన్నికల్లో బీ–ఫారాలిచ్చి మీరు అభ్యర్ధులను పెట్టలేదా?  బీ–ఫారాలిచ్చి, ప్రచారం చేసి, డబ్బులు ఖర్చుపెట్టి ఎన్నికల్లో తలపడిన మీరు... ఈ రోజు ఏవిధంగా ఎన్నికలు బహిష్కరించామని చెప్తారు.

మేం ఎన్నికలను వదిలేశాం కాబట్టి మీరు గెలిచారని మాట్లాడుతున్నారు. అంటే ప్రజలు అది నిజమని నమ్మాలని మీ కోరిక. కానీ మీరిచ్చిన బీ–ఫారాలు, మీరు చేసిన ప్రచారాలు, మీరిచ్చిన ఫిర్యాదులు, హంగామా ఎవరూ మర్చిపోలేదు.
పంచాయతీ ఎన్నికల్లో వైయస్సార్స్‌ కాంగ్రెస్‌పార్టీకి 80 శాతానికి పైగా అనుకూల ఫలితాలు వస్తే... మున్సిపల్‌ ఎన్నికల్లో దాదాపుగా 99 శాతం అనుకూల ఫలితాలు వైయస్సార్సీపీకి వచ్చాయి.

ఒక్క తాడిపత్రి మున్సిపాల్టీ తప్ప మిగిలిన అన్ని మున్సిపాల్టీలలో వైయస్సార్‌ పార్టీ విజయకుందుభి మోగించింది.76 మున్సిపాల్టీలు, నగర పంచాయితీలలో 75 మున్సిపాల్టీలలోనూ, 12 కార్పొరేషన్లను వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెల్చుకుంది. ఒక మున్సిపాల్టీ పోయింది. అది కూడా స్వల్ప తేడాతో. గౌరవ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారు హుందాగా రాజకీయాలు చేయాలి మీరు అని స్ధానిక నాయకులను ఆదేశించడం వల్ల అది మీకొచ్చింది.
 
నేను ఇంతకముందే చెప్పినట్లుగా ఒక నాయుకుడికి ప్రజాబలం ఉందని చెప్పడానికి ఇంతకంటే ఏం ఫలితాలు కావాలి. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని వ్యవస్ధలను మీరు ఇష్టానుసారం వాడినా ప్రజలు మాత్రం జగన్మోహన్‌రెడ్డిగారి వెనుకే నిలబడ్డారు. నీ వెనుక మేమున్నాం, నువ్వు మాకోసం ముందుకెళ్లు అని నడిపించారు. అవే ఈ ఫలితాలు.  
 
ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే స్ధానిక ఎన్నికలు చేయాలన్న సంకల్పం కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడుగారికి ఏనాడూ కలగలేదు. 2018లో స్ధానిక ఎన్నికలు పెట్టాల్సి ఉన్నా పెట్టలేదు. 2019లో కూడా లేదు. అదే ఏడాది సాధారణ ఎన్నికలు అయ్యాయి.

ఆ తర్వాత ఎన్నికలు పెట్టాలనుకున్నప్పుడు అడుగడుగునా చంద్రబాబు అడ్డింకి సృష్టించారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ గుర్తుకొస్తున్నారు. ఏ విధంగా స్ధానిక ఎన్నికల ప్రక్రియను వారు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఒక ప్రసహనంలా మార్చేశారో గమనించాలి. 
 
అసలు నోటిఫికేషన్‌ ఇవ్వడానికి చంద్రబాబునాయుడు ఒప్పుకోకపోగా, ఇచ్చిన తర్వాత మరలా అడ్డుపడ్డాడు.  మూడు కేసులు మాత్రమే నమోదైన టైంలో కోవిడ్‌ పేరు చెప్పి ప్రభుత్వానికి కూడా సమాచారం లేకుండా అర్ధాంతరంగా ఎన్నికల ప్రక్రియను నిలిపివేశారు. ఆ తర్వాత నిర్వహించకూడదని కోర్టులకు వెళ్లారు. మరలా ఫలితాలు రాకుండా అడ్డుకున్నారు.

ఈ ఎన్నికలైతే ఒకరోజు జరపవద్దని తీర్పొచ్చింది. మరునాడు జరపమని తీర్పు వచ్చింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఎన్నికల ప్రక్రియ నిర్వహించాల్సిన పరిస్ధితి. తీరా ప్రక్రియ జరిగిన తర్వాత ఫలితాలు ఆగిపోయాయి.

అడుగడుగునా అడ్డంకులు వచ్చినా, ఎవరు ఎన్ని విధాలుగా ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి  నాయకత్వానికి అడ్డు తగిలినా, ప్రజలు మాత్రం మేం ఉన్నా నువ్వు ముందుకెళ్లు అని నడపించబట్టే.. రెండేళ్ల కాలంలో ఇంతకు ముందు కన్నా ప్రజామోదం లభించింది. 2019లో ముఖ్యమంత్రిగా  జగన్మోహన్‌ రెడ్డి గారు అధికారం సాధించిన దాని కన్నా, ఎక్కువ ప్రజా మద్ధతు లభిస్తోంది. 
 
ప్రజాస్వామ్యం మీద ఏనాడు చంద్రబాబుకి విశ్వాసం లేదనడానికి ఈ స్ధానిక ఎన్నికల ప్రక్రియలో ఆ పార్టీ వ్యవహరించిన తీరే నిదర్శనం. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు స్ధానిక ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు చేసినట్టుగా, దుర్మార్గాలు చేసినట్టు, ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నం చేసినట్లుగా ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఒక్కసారి గతంలోకి వెళితే ఆనాడు వాజ్‌పేయ్‌ ప్రభవల్ల, కార్గిల్‌ వార్‌  నేపధ్యంలో చంద్రబాబునాయుడు గెలిచిన తర్వాత 2001లో స్ధానిక ఎన్నికలు జరిగాయి.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన స్ధానిక ఎన్నికల్లో 23 జిల్లా పరిషత్‌లకు 10 జిల్లా పరిషత్‌లు ఆనాడు చంద్రబాబునాయుడు ఓడిపోయారు. ఎవరు కుట్ర చేస్తే ఓడిపోయారు. ప్రతిపక్షం కుట్ర చేసిందా? ఎందుక ఓడిపోయారు? అదీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల లోపు. దాదాపు సగం జిల్లా పరిషత్‌లో తెలుగుదేశం పార్టీ నుంచి పోతే, కాంగ్రెస్‌ గెలిచింది.

ఆ తర్వాత జరిగిన స్ధానిక ఎన్నికల్లో ఏనాడు తెలుగుదేశం పార్టీ సరైన, ఏకపక్ష ఫలితాలు ఎందుకు సాధించలేకపోయింది. ఒకవేళ గాలివాటంగానే ఇవి జరిగితే, ఇప్పుడు జరిగిన ఎన్నికలు అన్నీ గాలివాటంగా జరుగుతాయా అని ప్రశ్నిస్తున్నాం? అందువల్ల ఇవి ఏమాత్రం గాలివాటం ఎన్నికలు కావు.
 
నువ్వు ప్రచారం చేసినట్లు మేం కుట్రలు, కుతంత్రాలు చేసి ఎన్నికలు నిర్వహించినటై్లతే, ఆనాడు 2001లో జరిగిన తర్వాత 2006లో ఎన్నికలు చూస్తే ఏనాడు తెలుగుదేశం పార్టీ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజామోదం పొందింది లేదు. 
2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్ధానిక సంస్ధలకు జరిగిన ఎన్నికలు చూసుకుంటే... కాంగ్రెస్‌ 19 జిల్లా పరిషత్‌లు, టీడీపీ 2, టీఆర్‌ఎస్‌ ఒక జిల్లా పరిషత్‌ గెల్చుకుంది.

కాంగ్రెస్‌ 620 మండలాల్లో గెలిస్తే, తెలుగుదేశం 355, టీఆర్‌ఎస్‌ 22, సీపీఐ 23,  సీపీఎం 6 మండలాల్లో గెల్చింది. అంటే ఏనాడూ టీడీపీ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజామోదం పొందలేదు. 
 
మేం వదిలేశాం కాబట్టే మీరు గెలిచారు అని టీడీపీ వాళ్లు కొత్త రాగం మొదలు పెట్టారు. ఈ తెలుగుదేశం రాగాలు, కీర్తనలకు స్వరకర్తలెవరో మాకు తెలుసు. ఇప్పటికైనా మీరు ఆత్మ విమర్శ చేసుకోవట్లేదు. ఏంటి ఈ దుస్ధితి అని ఆలోచించుకోవట్లేదు. ఏ ఎన్నికలు తీసుకున్నా ఇదే పరిస్ధితి. 

మొన్న జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొత్తం 12 కార్పొరేషన్లను వైయస్సార్సీపీ గెల్చుకుంది. 671 డివిజన్లకు ఎన్నికలు జరిగితే 563 చోట్ల మా పార్టీ విజయం సాధించింది. అంటే 83.09 శాతం గెల్చుకుంది. తెలుగుదేశం పార్టీ 78 డివిజన్లు అంటే 11.62 శాతం కాగా, ఇతరులు 28 చోట్ల గెల్చారు. అంటే 4.17 శాతం. మున్సిపాల్టీలను తీసుకుంటే 75కు గాను 74 చోట్ల అంటే 98.96 శాతాన్ని వైయస్సార్‌ పార్టీ కైవసం చేసుకోగా, కేవలం ఒక్కటి మాత్రం టీడీపీ గెల్చుకుంది.

ఇక 2,123 వార్డులకు గాను 1,754 చోట్ల 82.65 శాతంతో వైయస్సార్‌ పార్టీ విజయం సాధించింది. 17 చోట్ల వైయస్సార్‌ రెబల్‌ అభ్యర్ధులు గెల్చారు. అది 0.8 శాతం. 270 వార్డులకు తెలుగుదేశం పరిమితం కాగా, అది  12.72 శాతంగా నమోదైంది. జనసేన 19 వార్డుల్లో గెల్చింది. అది 0.89 శాతం. 39 చోట్ల స్వతంత్ర అభ్యర్ధులు గెల్చారు. అది 1.83 శాతం. మరో 15 చోట్ల ఇతరులు 0.70 శాతంతో గెల్చారు.

ఈ విషయాలన్నీ ఎందుకు చెపుతున్నామంటే ముఖ్యమంత్రిగారికి మరొక్కసారి స్ధానిక ఎన్నికల ద్వారా అంతకముందు కన్నా  గట్టి మద్దతు లభించింది. దీనికి చాలా కారణాలున్నాయి. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయానికి నిజమైన అర్ధం చెప్పిన సీఎంగారు అది చేతల్లో చేసి చూపించారు. చెప్పాడంటే చేస్తాడంతే అని, చెప్పిన దానికన్నా ఎక్కువే చేస్తాడనేది ఇవాళ ముఖ్యమంత్రిగారికున్న బ్రాండింగ్‌.
 
మున్సిపల్‌ ఛైర్మన్లలో బీసీలకు చట్ట ప్రకారం 30 ఇవాల్సి ఉంటే.. 53 ఇచ్చారు. అంటే 60.91 శాతం పోస్టులు బీసీలకు, మైనార్టీలకు ఇచ్చాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చట్ట ప్రకారం ఇవ్వాల్సింది 45 అయితే 68 ఛైర్మన్‌ పోస్టులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 78.16 శాతం మున్సిపల్‌ ఛైర్మన్లు ఇచ్చిన ఘనత కూడా వైయస్సార్‌ ప్రభుత్వానిదే. 

మహిళలకు చట్ట ప్రకారం 42 పోస్టులు ఇవ్వాల్సి ఇంటే 53 పోస్టులు ఇచ్చారు. ఇది సామాజిక న్యాయానికి నిలువుటద్దం కాదా అని నేను అడుగుతున్నాను? చెప్పిన మాటకు కట్టుబడి చెప్పినదానికన్నా ఎక్కువే చేసే దమ్మున్న నాయుడు ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నదానికి ఇది తార్కాణం కాదా అని అడుగుతున్నాను ? 

అలాగే పంచాయితీలు తీసుకుంటే.. 13,081 పంచాయతీల్లో ఎన్నికలు జరిగితే వైయస్సార్‌ పార్టీ మద్ధతుదారులు గెల్చిన పంచాయతీలు 10,536, అంటే 80.51 శాతం. టీడీపీ మద్ధతుదారులు 2,100 పంచాయితీల్లో 16.06 శాతం గెలిచారు. ఇతరులు 445 మంది గెలిచారు.
 
మీరు బహిష్కరిస్తే మరి మీ మద్ధతుదారులు ఎలా గెల్చారు. ఇకనైనా ఓటమికి కారణాలు వెదుక్కొండి. కొత్త బాష్యాలు చెప్పొద్దు. మీరు భయపడి పారిపోయి.. దాన్ని ఇక్కడ ప్రజాస్వామ్యం నాశనమైపోతుంది కాబట్టి మేం ఎన్నికలు బహిష్కరించాం అన్నట్లుగా కొత్త రాగాలు అందుకోవద్దని గౌరవ తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ ఈ సందర్భంగా చెప్తున్నాను.

పూర్తి ప్రజామోదంతో ముఖ్యమంత్రిగా గెల్చిన తర్వాత ప్రజలు ఆశించిన దానికన్నా ఎంతో మెరుగైన పరిపాలన చేస్తున్నందుకు జగన్‌గారికి ప్రజల మద్దతు మరింత లభిస్తోంది. అందుకే ఇప్పటికైనా ఆ వేదనలు, రోదనలు కట్టిబెట్టి వైయస్సార్‌ పార్టీకి ప్రజల మద్ధతు ఏ విధంగా ఉందనేది అర్ధం చేసుకుని ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తే మంచిది. 
 
మీరు అత్యధికంగా ప్రేమిస్తున్న, మీరు రాజధాని అని చెప్తున్న అమరావతి ప్రాంతంలోనే పంచాయతీలు పోగొట్టుకున్నారు. స్ధానిక ఎన్నికలు ఓడిపోయారు. నిజం చెప్పాలంటే.. రాష్ట్రంలో ఇక్కడ మాకు సంపూర్ణ మద్ధతు లభించింది, ఈ మండలంలో మాకు గట్టి పట్టు ఉంది. ఈ జిల్లాలో మేం తిరుగులేని ఆధిపత్యంలో ఉన్నాం అని చెప్పుకునే పరిస్ధితి టీడిపికి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారికి ఒకే రకమైన ప్రజామోదం లభిస్తోంది.  
 
80 శాతానికి మించి పంచాయతీలు, 99 శాతానికి మించి మున్సిపాల్టీలు గెల్చుకున్నట్టుగా, తుది ఫలితాలు వచ్చేనాటికి వాటి కన్నా ధీటుగా అత్యధికంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు గెల్చుకుంటాం. మొత్తం 13 జిల్లా పరిషత్‌లలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగరవేయడం ఖాయం.