మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (07:01 IST)

టీడీపీని ప్రజలు ఛీ కొడుతున్నారు... గుర్తించకపోతే వారి ఖర్మ: అంబటి రాంబాబు

ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కుప్పకూలిపోతే.. ఆయన సొంత నియోజకవర్గం, ఆయన పుట్టిన గడ్డ చంద్రగిరిలో కూడా బాబుకు ప్రజలు శంకరగిరి మాన్యాలు పట్టించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడుతూ.. పంచాయతీ నుంచి పరిషత్ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లోనూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు చూశాక, ఇక తెలుగుదేశం పార్టీని మూసివేయాల్సిందేనని అన్నారు.

పరిషత్ ఎన్నికలను బహిష్కరించామని సన్నాయి నొక్కులు నొక్కుతున్న టీడీపీ నేతలు.. మరి, గతంలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు ఏం సమాధానం చెబుతారని అంబటి నిలదీశారు. స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఎన్నికలు జరిపించలేదని చెప్పారు.

పైగా అప్పుడు జరిపించాల్సిన ఎన్నికలను ఇప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిపిస్తుంటే... స్వాగతించాల్సిందిపోయి, ఎన్నికలను నిలిపివేసేందుకు చంద్రబాబు అడుగడుగునా ఎన్నో కుట్రలు చేశారని రాంబాబు మండిపడ్డారు. ఇవన్నీ చూసి, టీడీపీని ప్రజలు క్షేత్రస్థాయిలో ఛీ కొడుతున్నారని, ఆ విషయాన్ని ఇంకా గుర్తించకుండా విర్రవీగితే.. అది వారి ఖర్మ అని అంబటి స్పష్టం చేశారు. 
 
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
1- భారతదేశం లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, ఎన్నికల ప్రక్రియ చాలా  పవిత్రంగా, గొప్పగా జరిగి తీరాలి. దానిలో స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే చాలా ప్రాముఖ్యత ఉంది. మహాత్మగాంధీగారు చెప్పినట్లు స్వపరిపాలన... గ్రామాల్లోనే పరిపాలన జరగాలని భావించడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరగాలని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది.

దురదృష్టవశాత్తూ కాలం గడిచిపోయినా కూడా ఎన్నికలు పెట్టని సందర్భాలు చూసినప్పుడు చాలా భాద కలుగుతుంది. 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు 2018 ఆగస్ట్‌కు పూర్తయ్యాయి. గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, నిమ్మగడ్డ రమేష్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఈ ఎన్నికల గడువు తీరిపోయింది. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ వారిద్దరూ ఎన్నికలు పెట్టే ప్రయత్నం చేయలేదు. 
 
2- చంద్రబాబు నాయుడు తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే గెలవలేమనే భయంతో పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వైయస్సార్‌ సీపీ 151 సీట్లు గెలిచి అధి​కారంలో వచ్చింది.  త్వరితగతిన ఎన్నికలు పెట్టి స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 2020 మార్చిలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తే... అది ఇవాళ వరకూ కొనసాగుతోంది.

వాస్తవానికి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత ఫలితాలు వచ్చాక, అప్పుడే జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలు ముగించాల్సిన ఉంది. అయితే ఈ లోపల జరిగిన పరిణామాలు చూస్తే ఎన్నికలకు చంద్రబాబు నాయుడు తన దుష్టచతుష్టంతో కలిసి అడుగడుగునా అడ్డుకునేందుకు దుర్మార్గంగా ప్రయత్నించారు. 
 
3- 2020 మార్చిలో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ 15వ తేదీకి వచ్చేసరికి నిమ్మగడ్డ రమేష్‌ అర్థాంతంగా వాయిదా వేశారు. కరోనా పేరుతో మూడు కేసులు ఉన్న తరుణంలో నిరవధికంగా ఎన్నికలను వాయిదా వేశారు. ఎన్నికల కోడ్‌ కూడా అమలులో ఉందని చెప్పుకుంటూ వస్తే.. సుప్రీంకోర్టుకు వెళ్లి కోడ్‌ను తొలగించుకోవడం జరిగింది. అక్కడ నుంచి అనేక మలుపులు, ఎన్నో కార్యక్రమాలు జరిగాయి.

ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఫలితాలు రాకుండా చంద్రబాబు, జనసేన నాయకులు న్యాయస్థానాకి వెళ్లి అడ్డుకున్నారు. ఎట్టకేలకు అన్ని అవరోధాలను అధిగమించి ఇప్పటికి ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. అయితే ఈ ఫలితాలను చూసి ఎవరు ఆశ్చర్యపోవడం లేదు. వాస్తవం అయిన ఫలితాలు ప్రతిఫలిస్తున్నాయి. 
 
4- ఇప్పుడు టీడీపీ నాయకులు మేము ఎన్నికలను బహిష్కరించేశామని చెబుతున్నారు. నామినేషన్లు వేసి, విత్‌డ్రాలు అయిపోయాయి. ఎన్నికలకు వెళ్లేముందు బహిష్కరించామని చెబితే ఎవరు నమ్ముతారు. వీటిని బహిష్కరించారు సరే, మరి బహిష్కరించని పంచాయతీ, మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో మీకు వచ్చిన ఫలితాలు ఏమిటి? వాటిల్లో ఎంత శాతం మీరు గెలుచుకున్నారు, మీకు వచ్చిన సీట్లు ఎన్ని, ఓట్లు ఎన్ని..?

ఆ ఎన్నికల సందర్భంలో చంద్రబాబు విశాఖ, గుంటూరు వచ్చి ఎన్నికల ప్రచార సభల్లో గెలుస్తున్నామని, పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పారే.. మరి ఫలితాలు తుస్సుమన్నాయి కదా? మీరు, మీ అబ్బాయి కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఫలితాలు సున్నా. ఇవాళ వచ్చిన ఫలితాలే అప్పుడు కూడా వచ్చాయి. బహిష్కరించామని ఈరోజు టీడీపీ నేతలు మాట్లాడటం చాలా చిత్రంగా ఉంది.
 
5- చంద్రబాబుగారి పుట్టిన గడ్డ చంద్రగిరిలో శంకరగిరి మాన్యాలు పట్టిపోయారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పంలో టీడీపీ కుప్పకూలిపోయింది. దీన్నిబట్టి మీకు ఏమర్థం అవుతుంది చంద్రబాబు గారూ? ఈ ఫలితాలు చూసిన తర్వాత, ఇక టీడీపీని మూసేయక తప్పదు అని ప్రజల నుంచి స్పష్టంగా సంకేతాలు వస్తున్నా... ఇప్పటికీ తెలుసుకోకపోతే అది మీ ఖర్మ. శాసనసభ ఎన్నికల్లో 175 స్థానాల్లో 151 సీట్లు గెలుచుకున్న జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ప్రభుత్వానికి అదేవిధంగా, ప్రతి ఎన్నికల్లోనూ చక్కని ఫలితాలు వస్తున్నాయి. ఎన్నికలు ఏవైనా ఫలితం మాత్రం ఒకటే. 
 
6- చిత్తశుద్ధి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష, అవినీతి రహిత పాలన, ప్రజలకు పరిపాలనను చేరువ చేయడం,  అన్ని సామాజిక వర్గాల మనస్సులను హత్తుకునేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు పని చేస్తున్నారు కాబట్టే... ఆయన నాయకత్వం మళ్లీ మళ్లీ కావాలి అని ప్రజలు ఓటు వేస్తున్నారు. అయిపోయింది అయిపోయిందని... చంద్రబాబు మాటలు చెబుతున్నారే? ఎవరి పని అయిపోయింది?

మీ పని, మీపక్కన తిరిగేవాళ్ల పని అయిపోయిందని ఇవాళ్టికి కూడా తెలుసుకోలేకపోతే అది మీ ఖర్మ.  ఇలాంటి చక్కని ఫలితాలు అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. చక్కటి పరిపాలన చేస్తున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి ప్రజలు బాసటగా నిలుస్తున్నారు. పంచాయతీ, మున్సిపల్‌, కార్పొరేషన్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏవైనా ప్రజలు ఒకే ఫలితాలు ఇస్తున్నారు.
 
7- టీడీపీకి, చంద్రబాబుకు ప్రజల్లో బలం లేదని ప్రజలు ఇంత స్పష్టమైన తీర్పు ఇచ్చాక కూడా, చంద్రబాబు, ఆయన చుట్టూ ఉండే దుష్టశక్తులు ప్రభుత్వంపై ఇంకా ఏమైనా కుట్రలు చేస్తాయేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. కుట్రలు, కుతంత్రాలు తప్ప ప్రజల్లోకి వెళ్లి గెలవాలనే తాపత్రయం చంద్రబాబు జీవితంలో లేదు. ఆయన అధికారంలోకి వచ్చింది కుట్రలతోనే. పరిపాలన చేసింది కుట్రలతోనే.. ప్రతిపక్షంలో ఉన్నా కుట్రలతోనే.

కుట్రలతోనే సాగే చంద్రబాబుకు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో ప్రజలు తిలోదకాలు ఇచ్చిన విషయాన్ని ఆ పార్టీ అర్థం చేసుకోవాలి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌గారికి మద్దతు పలుకుతున్న ప్రజలందరికీ పార్టీ తరపున హృదయపూర్వక  ధన్యవాదాలు చెబుతున్నాం. రాబోయే కాలంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత చేరువుగా ఉండి, అందరి మన్ననలు పొందుతుందని తెలియజేస్తున్నాం.
 
8- అచ్చెన్నాయుడు విమర్శలపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. మమ్మల్ని అయిదేళ్ల పాటు పరిపాలన చేయమని ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.  మేమేందుకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి. మాటలు చెప్పడం కాదు. చంద్రబాబును, టీడీపీని ప్రజలు ఛీ కొడుతున్నారు. దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తే, ఎన్నికలకు వెళదాం, అప్పుడు ఎవరి బలమేమిటో ప్రజలే నిర్ణయిస్తారు.