గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (20:17 IST)

MPTC, ZPTC: చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలోనూ టీడీపీ ఓటమి, కుప్పంలో సైకిల్‌కు పోలైన ఓట్లు కేవలం 70

పరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విజయం దిశగా సాగుతోంది. ఇప్పటికే ఫలితాలు ప్రకటించిన స్థానాల్లో మూడింట రెండొంతుల ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లు ఆ పార్టీ ఖాతాలో చేరాయి. ఆధిక్యంలో ఉన్న సీట్లతో కలుపుకుంటే ఆ పార్టీకి తిరుగులేదన్నట్టుగా కనిపిస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ 9 జెడ్పీ పీఠాలను కైవసం చేసుకుంది. ఒక్క జెడ్పీ పీఠం మాత్రం ఇండిపెండెంట్‌గా గెలిచి, ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీకి 10 జిల్లా పరిషత్తుల్లో ఆధిక్యం కనిపించింది. అప్పుడు వైసీపీకి మూడు జిల్లాలు దక్కాయి.

 
అయితే, ప్రస్తుతం ఒక్క చోట కూడా టీడీపీకి అవకాశం కనిపించడం లేదు. పోలింగ్‌కి కొన్ని గంటల ముందు ఆ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. అయినప్పటికీ అనేక చోట్ల టీడీపీ అభ్యర్థులు చివరి వరకూ పోరాడారు. ప్రతీ జిల్లాలోనూ కొన్ని ఎంపీటీసీ సీట్లు, అక్కడక్కడా జెడ్పీటీసీ స్థానాలు కూడా టీడీపీ ఖాతాలో చేరుతున్నాయి. జనసేన ప్రభావం కూడా పెద్దగా కనిపించలేదు. బీజేపీతో కలిసి పోటీ చేసినప్పటికీ ఇరుపార్టీలకు పెద్దగా ప్రయోజనం దక్కినట్టు కనిపించలేదు. ఇక వామపక్షాలు, ఇతర పార్టీల ప్రభావం కూడా నామమాత్రమే. దాంతో అధికార వైసీపీకి స్పష్టమైన ఆధిక్యం కనిపించింది.

 
బ్యాలెట్ పద్దతిలో జరిగిన ఈ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో జాప్యం జరుగుతోంది. తుది ఫలితాలు వెలువడేందుకు ఇంకా కొన్ని గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 30 శాతం సీట్లలో ఫలితాలు వెలువడ్డాయి. వాటిలో 80 శాతం వరకూ పాలకపక్షం పై చేయి సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో సగానికి పైగా ఆపార్టీ గెలుచుకుంది.

 
మరోవైపు ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ల ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీల ఎన్నిక జరగబోతోంది. 25న జిల్లా పరిషత్ చైర్ పర్సన్లను ఎన్నుకుంటారు. ఈసారి జెడ్పీలకు ఇద్దరేసి వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగా ఎన్నికలు జరపబోతున్నారు.

 
అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళతారా? - అచ్చెన్నాయుడు
టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ బ్యాలెట్ పేపర్ పై ఆపార్టీ గుర్తు కనిపిస్తోంది. దాంతో బరిలో ఉన్నట్టుగానే ఫలితాలు ప్రకటిస్తున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ఈ ఎన్నికలను బోగస్ అంటున్నారు. ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యం పెచ్చుమీరిన విషయం దేశమంతా గమనించిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

 
"పోలీసులు సాయంతో బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారు. అధికారులు, పోలీసులు అధికార పార్టీకి అన్ని విధాలా సహకరించి ప్రజాస్వామ్యాన్నికాల రాశారు. ఎన్నికల్లో వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం వల్లే టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది. ఈ ఎన్నికలు ప్రజాభిప్రాయం కాదు. ప్రజాబిప్రాయం అని భావిస్తే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే దమ్ము ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఉందా?" అని ఆయన ప్రశ్నించారు.

 
టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి - మంత్రి అనిల్ కుమార్
టీడీపీ నేతల వాదనను అధికార పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రజాభిప్రాయం గమనించి పారిపోయారంటూ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. "ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలన్నీ పంచాయతీ, మునిసిపల్ ఫలితాలకు కొనసాగింపుగా ఉన్నాయి. ప్రజల తీర్పుతో 80 శాతం పైగా సీట్లు గెలుస్తున్నాం. టీడీపీని ప్రజలు భూస్థాపితం చేస్తున్నారు. ఎన్నికలను బహిష్కరించినట్టు టీడీపీ చెప్పడం హాస్యాస్పదం. ప్రజల మూడ్ గమనించి ముందే పారిపోయారు. జగన్ పాలనపై ప్రజల విశ్వాసంతో ఇస్తున్న తీర్పు ఇది" అని అనిల్ అభిప్రాయపడ్డారు.

 
టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే ఉప ఎన్నికలకు వెళ్లొచ్చని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నకు సమాధానంగా అనిల్ అన్నారు. ‘‘రాజీనామాల డిమాండ్ చేస్తున్న అచ్చెన్నాయుడికి దమ్ముంటే తక్షణమే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగాలి. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏమయ్యిందో తెలుసు కదా. నోటికొచ్చింది మాట్లాడి ప్రజలను మభ్యపెట్టాలనే ప్రయత్నం ఇకనైనా మానుకోండి’’ అని మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు.

 
చంద్రబాబు స్వగ్రామం, సొంత నియోజకవర్గంలో వైసీపీ విజయం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారి పల్లె ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం సాధించింది. వైసీపి అభ్యర్థి రాజయ్య ఇక్కడ గెలుపొందారు. ఇది చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఉంది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్యర్థులు వెనుకబడి ఉన్నారు. కుప్పం మండలంలో 17 ఎంపీటీసీల్లో వైయస్సార్‌సీపీ విజయం సాధించగా, 2 ఎంపీటీసీలకు మాత్రమే టీడీపీ పరిమితం అయ్యింది.

 
కుప్పంలో వైసీపీ తమ ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించిన అశ్విని హాసిని విజయం సాధించారు. కుప్పం ఎంపీటీసీ స్థానంలో ఆమె 1240 ఓట్లకు గానూ 1143 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థికి కేవలం 70 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆమె విజయాన్ని ధృవీకరిస్తూ అధికారులు సర్టిఫికెట్ అందించారు. టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు చంద్రబాబు చేసిన ప్రకటనని అప్పట్లోనే ఆ పార్టీకి అశోక్ గజపతిరాజు, జ్యోతుల నెహ్రూ వంటి వాళ్లు తప్పుబట్టారు. తమ అభ్యర్థులు బరిలో ఉంటారని, ఆఖరి నిమిషంలో ఇలాంటి నిర్ణయం సరికాదని వారు ప్రకటించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా చాలా చోట్ల టీడీపీ పోలింగ్ ఏజెంట్లు కనిపించారు.

 
బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు.. చెదలు పట్టిన బ్యాలెట్ పేపర్లు
దాదాపు ఐదు నెలల తర్వాత స్ట్రాంగ్‌ రూమ్‌లకు వేసిన సీలును తెరిచిన అధికారులు గదుల్లో భద్రపరిచిన బాక్సులను తెరిచారు. కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సుల్లోకి నీళ్లు చేరాయని, బ్యాలెట్ పేపర్లు తడిచిపోయాయని, మరికొన్ని చోట్ల బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టాయని అధికారులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలానికి సంబంధించిన కౌంటింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ బ్యాక్సులో పేపర్లు తడిచిపోయాయి.

 
దీంతో బేజాత్‌పురం ఎంపీటీసీ, రావెల ఎంపీటీసీ స్థానానికి సంబంధించిన కౌంటింగ్‌పై సందిగ్ధత నెలకొంది. పేపర్లు తడిచిపోయిన విషయాన్ని సిబ్బంది.. ఉన్నతాధికారులకు తెలియజేశారు. అదేవిధంగా మరి కొన్ని బాక్సుల్లో పేపర్లకు చెదలు పట్టినట్లుగా తెలుస్తోంది. చాలా నెలలుగా బ్యాలెట్ బాక్సులను రూముల్లో ఉంచడంతో ఈ పరిస్థితి నెలకొంది. మొత్తం బాక్సులు తెరిస్తే ఎన్ని దెబ్బతిన్నాయనే విషయం తెలియనుంది. విశాఖపట్నం జిల్లా పాకలపాడు లింగంపేట బ్యాలెట్‌ బాక్సుల్లోకి వాననీరు చేరడంతో పేపర్లు తడిసిపోయాయి. పాకలపాడు బ్యాలెట్‌ బాక్సులు ఆరు ఉండగా అందులో మూడు బాక్స్‌ల్లోని బ్యాలెట్ పేపర్లు లెక్కింపు వీలుపడని స్థాయిలో పాడయ్యాయని అధికారులు తెలిపారు.

 
ఆలస్యంగా లెక్కింపు..
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించి, కౌంటింగ్ సెంటర్లలో ఏర్పాట్లు చేశామని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. ఏప్రిల్ 8వ తేదీన జరిగిన పోలింగ్ తర్వాత కోర్టు ఆదేశాలతో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఈ ఎన్నికలు జరగడంతో, వీటిని రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ తొలుత తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఎస్ఈసీ అప్పీల్ చేయడంతో డివిజన్ బెంచ్ ఈ కేసును విచారించింది. చివరకు సెప్టెంబర్ 16న ఓట్లు లెక్కించి, ఫలితాలు వెల్లడికి హైకోర్టు పచ్చజెండా ఊపింది.

 
సిబ్బంది, ఏజెంట్లకు కోవిడ్ నిబంధనలు
కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఫలితాల ప్రకటన సమయంలో సిబ్బంది, అభ్యర్థుల తరుపున హాజరయ్యే కౌంటింగ్ ఏజెంట్లు కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. ప్రతి అభ్యర్థితో పాటుగా కౌంటింగ్ ఏజెంట్లు కూడా ర్యాపిడ్ యాంటి జెన్ టెస్ట్ లేదా ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేయించుకుని, నెగిటివ్ వచ్చినట్టు సర్టిఫికెట్ సమర్పించాలి. లేదా రెండు డోసుల వ్యాక్సిన్ ధ్రువీకరణ పత్రం అందించాలి. దానిని అనుసరించిన వారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రాలలో అనుమతిస్తామని ఎస్ఈసీ ప్రకటించింది. సిబ్బందికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల్లో కూడా మాస్కులు, శానిటైజర్లు సహా ఇతర అన్ని జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు వచ్చాయి.

 
ఎన్నికలు కూడా ఆలస్యంగానే..
2020 మార్చిలో జరగాల్సిన ఎన్నికలను 2021 ఏప్రిల్‌లో నిర్వహించారు. కానీ పోలింగ్ ముగిసినప్పటికీ గడిచిన ఐదు నెలలుగా ఫలితాల కోసం ఎదురుచూసిన అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడుతోంది. 13 జిల్లాల పరిధిలోని 660 మండలాలకు గానూ 515 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. 126 స్థానాలు ఏకగ్రీవం కాగా, వివిధ కారణాలతో 8 మండలాల్లో ఎన్నికలు జరగలేదు. ఇక సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు మరణించిన కారణంగా 11 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిపివేశారు. దాంతో 515 జెడ్పీసీలకు గానూ 2,058 మంది అభ్యర్థుల భవితవ్యం ఈరోజు తేలబోతోంది.

 
రాష్ట్రవ్యాప్తగా మొత్తంగా 10,047 ఎంపీటీసీ స్థానాలకుగానూ 2,371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మరో 375 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. పోటీచేసిన వారిలో 81 మంది అభ్యర్థులు మరణించడంతో ఆయా స్థానాల్లో పోలింగ్ జరగలేదు. మిగిలిన 7,220 స్థానాలకు గానూ 18,782 మంది అభ్యర్ధులు పోటీ చేశారు. పార్టీ గుర్తుల ఆధారంగా జరిగిన ఎన్నికలు కావడంతో రాష్ట్రంలో అన్ని పార్టీల నేతలు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

 
ఎన్ని స్థానాలకు కౌంటింగ్..
శ్రీకాకుళం: 37 జడ్పీటీసీ, 590 ఎంపీటీసీ
విజయనగరం: 31 జడ్పీటీసీ, 487 ఎంపీటీసీ
విశాఖ: 37 జడ్పీటీసీ, 612 ఎంపీటీసీ
తూ.గో.: 61 జడ్పీటీసీ, 996 ఎంపీటీసీ
ప.గో.: 45 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ
కృష్ణా: 41 జడ్పీటీసీ, 648 ఎంపీటీసీ
గుంటూరు: 45 జడ్పీటీసీ, 571 ఎంపీటీసీ
ప్రకాశం: 41 జడ్పీటీసీ, 368 ఎంపీటీసీ
నెల్లూరు: 34 జడ్పీటీసీ, 362 ఎంపీటీసీ
చిత్తూరు: 33 జడ్పీటీసీ, 419 ఎంపీటీసీ
వైఎస్ఆర్ కడప జిల్లా: 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ
కర్నూలు: 36 జడ్పీటీసీ, 484 ఎంపీటీసీ
అనంతపురం: 62 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ
మొత్తంగా 515 జడ్పీటీసీ, 7,216 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది.