వసంత నియోజకవర్గం మైలవరంలో విభేదాలు సృష్టిస్తే ఖబడ్డార్!
కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో వైసీపీ వర్గాల మధ్య భగ్గుమంటున్న వివాదాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెక్ పెట్టారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను ఆయన సపోర్ట్ చేస్తూ, ఆయన నియోజకవర్గం మైలవరంలో విభేదాలు సృష్టించే వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.
మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే, భవిష్యత్తులో కూడా ఆయనే వైసీపీ అభ్యర్థిగా ఉంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. వసంత కృష్ణ ప్రసాద్ కు వ్యతిరేకంగా పని చేస్తే, పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్టే లెక్క అన్నారు. అలాంటి వారిపై పార్టీలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
జోగి రమేష్ పెడన ఎమ్మెల్యేగా ఉన్నారు... ఆయన అక్కడే కొనసాగుతారు. వారిద్దరి మధ్య అనవసర విభేదాలు సృష్టిస్తే ఉరుకోం. అలా ఎవరైనా చేస్తే, వారిని పార్టీ నుండి బయటకు పంపేందుకు కూడా వెనుకాడం అని వార్నింగ్ ఇచ్చారు. అందరూ కలిసి మెలిసి పని చేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని, అనవసర వివాదాలకు దారితీసే పరిస్థితులను సృష్టించవద్దని వర్గాలను ప్రోత్సహించేవారికి హెచ్చరికలు చేశారు. మీరు ఇలాంటి పార్టీ వ్యతిరేక చర్యలు ఉపసంహరించాలని పెద్దిరెడ్డి సూచించారు.