శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (16:52 IST)

శీలాన్ని కాపాడుకునేందుకు భవనం పైనుంచి దూకేసింది...

ఓ కామాంధుడు చెర నుంచి తన శీలాన్ని కాపాడుకునేందుకు ఓ మహిళ భవనంపై నుంచి కిందికి దూకేసింది. దీంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన గుర్‌గ్రామ్‌లో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుర్‌గ్రామ్‌లోని బెలైర్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న అజయ్ అశ్వాని అనే వ్యక్తి తన ఇంట్లో పనిచేసే మహిళపై కన్నేశాడు. అసభ్యంగా ప్రవర్తిస్తూ పదేపదే కోరిక తీర్చమని వేధించసాగాడు. అతని తీరుతో విసిగిపోయిన సదరు మహిళ అజయ్ భార్యకు విషయాన్ని చెప్పింది. అయితే భార్య మాటలు కూడా పెడచెవిన పెట్టాడు. ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు కదా.. మరింతగా రెచ్చిపోయాడు.
 
ఈ క్రమంలో గురువారం పనిచేసేందుకు తన ఇంటికి వచ్చిన మహిళను తన కోర్కె తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అడ్డూ అదుపు లేకపోయింది. చేయి పట్టుకుని లాగుతూ అత్యాచారానికి యత్నించాడు. అతని నుండి ఎలా తప్పించుకోవాలో అర్థంకాని అయోమయ స్థితిలో భవంతి కిటికీలోంచి దూకేసింది. 
 
ఆమె అరిచిన అరుపులు విని చుట్టుప్రక్కల వారు వచ్చారు. మొదటి అంతస్తులో నుండి దూకడంతో ప్రాణానికి ప్రమాదం ఏమీ జరగలేదు కానీ వెన్నుపూస, మోకాళ్లకు మాత్రం తీవ్రగాయాలయ్యాయి. ఆ మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.