గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 జులై 2024 (16:50 IST)

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై సీఎం బాబు సీరియస్...

fire accident
నంద్యాల జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అనుమానాస్పదంగా అగ్నిప్రమాదం సంభవించింది. కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించడానికి కొన్ని గంటలు ముందు ఈ ప్రమాదం జరగడం అనేక అనుమానాలకు తావిస్తుంది. దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రమాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మదనపల్లె వెళ్లి అగ్నిప్రమాద  ఘటనపై నిగ్గు తేల్చాలని డీజీపీ, సీఐడీ చీఫ్‌లను ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఏపీ సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యనార్ హుటాహుటిన మదనపల్లె చేరుకున్నారు. 
 
ఈ ప్రమాదంపై ఇప్పటికే పోలీసు విచారణ ప్రారంభంకాగా, డీజీపీ, సీఐడీ చీఫ్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించనున్నారు. ఈ ఘటనపై కుట్ర కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు.. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌‍ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మదనపల్లె కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందే ఈ ప్రమాదం జరగడంతో కీలఖ ఫైళ్ళను రూపుమాపేందుకు కావాలనే అగ్నిప్రమాదం సృష్టించారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.