లేని చట్టాల పేర్లు చెబుతూ ఎంతకాలం మహిళల్ని మోసం చేస్తారు: జగన్‌పై నారా లోకేశ్ ఫైర్
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అఘాయిత్యాల నేపథ్యంలో టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ జగన్ పైన ధ్వజమెత్తారు. లేని చట్టాల పేర్లు చెబుతూ ఇంకా ఎంతకాలం మహిళల్ని ఏమారుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ తప్ప మీకు వేరే మార్గాలు తెలియవని మండిపడ్డారు.
మీ నిర్లక్ష్య ధోరణికి ఇంకా ఎంతమంది బలైపోవాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలిపారు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో రోజుకు మూడు అత్యాచారాలు జరుగుతున్నాయని, మృగాళ్లు రెచ్చిపోయి చిన్నారులను చిదిమేస్తున్నారని వెల్లడించారు.
విశాఖలో బంగారు భవిష్యత్తు కలిగిన వరలక్ష్మీని మృగాడు బలి తీసుకున్నాడని, బాధిత కుటుంబానికి న్యాయం జరగక ముందే చిత్తూరు జిల్లా రాయల్ పేటలో ఆరేళ్ల బాలకపై లైంగిక దాడి జరిగిందని లోకేశ్ మండి పడ్డారు. వట్టి మాటలను పక్కన పెట్టి మహిళలకు రక్షణ కల్పించాలని హితవు పలికారు.