మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 12 మే 2017 (04:17 IST)

ఆ ఘోర ప్రమాదంలో తప్పు నిషిత్‌దా లేదా మాదా.. పోలీసు శాఖ మల్లగుల్లాలు

ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్, అతడి స్నేహితుడు రాజా ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనకు కారణమైన జూబ్లీ హిల్స్ మలుపుపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా అధ్యయనం చేస్తున్నారు

చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం అనే సామెతను అన్ని వేళలా యథాతథంగా స్వీకరించడం కుదరదు. ఒక ఊహించని ఘోరం జరిగిన తర్వాత ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని వెనక్కు తిరిగి పరిశీలించుకుంటే భవిష్యత్తులో అలాంటి ఘోరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశమైనా దక్కుతుంది. ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్, అతడి స్నేహితుడు రాజా ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనకు కారణమైన జూబ్లీ హిల్స్ మలుపుపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా అధ్యయనం చేస్తున్నారు.

ప్రమాదం జరిగిన ప్రతిసారీ అతివేగం అనీ, మద్యం తాగారని, డ్రైవింగ్ అదుపు తప్పిందని ఇలా మామూలు కారణాలు చెప్పి కేసు ముగించడం కాకుండా ట్రాపిక్ పోలీసులతోటి సమన్వయంతో హైదరాబాద్ నగరం మొత్తంమీద ప్రమాదాలు తరచుగా జరుగుతున్న స్పాట్స్‌ను అధ్యయనం చేసి ఏ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు అరికట్టగలమో తుది అంచనాకు రావచ్చని పోలీసు ఉన్నతాధికారులు ప్లాన్ చేస్తున్నారు.
 
సాధారణంగా రహదారిపై ఏ ప్రమాదం జరిగినా... పెద్ద వాహనం నిర్లక్ష్యంగా, అతివేగంగా దూసుకువచ్చి చిన్న వాహనాన్ని ఢీ కొట్టిందంటూ పోలీసులు ‘నిగ్గు తేల్చేస్తారు’. యాక్సిడెంట్‌ కేసుల్లో సరైన, పూర్తి స్థాయి దర్యాప్తు లేని కారణంగానే ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫలితంగా నగరంలోని అనేక రహదారులపై ఉన్న ‘బ్లాక్‌ స్పాట్స్‌’వెలుగులోకి రాక నిత్యం ప్రమాదాలకు హేతువులుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్ని మార్చాలని నిర్ణయించిన నగర పోలీసు ఉన్నతాధికారులు ప్రమాదాలపై దర్యాప్తును బలోపేతం చేయాలని నిర్ణయించారు. దీనికోసం కీలక కేసుల దర్యాప్తులో శాంతిభద్రతల విభాగంతో పాటు ట్రాఫిక్‌ పోలీసుల్నీ భాగస్వాముల్ని చేయాలని యోచిస్తున్నారు.
 
నగర వ్యాప్తంగా 80కి పైగా బ్లాక్‌ స్పాట్స్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గడిచిన మూడేళ్లలో ఓ ప్రాంతంలో చోటు చేసుకున్న ప్రమాదాల గణాంకాల ఆధారంగా వీటిని కనుగొన్నారు. ఇతర విభాగాలతో కలసి ఉమ్మడి పర్యటనలు చేయడం ద్వారా ఈ స్పాట్స్‌లో అసలు కారణాలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి అవసరమైన మార్గాలు నిర్దేశించడం, వీటిని అమలు చేయాల్సిందిగా సంబంధిత విభాగాలను కోరడంతో పాటు పని తీరును పర్యవేక్షించడం తప్పనిసరి చేస్తున్నారు.