ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శుక్రవారం, 1 అక్టోబరు 2021 (11:18 IST)

రొమ్ము కేన్సర్ బాధితుల కోసం జాతీయ హెల్ప్‌ లైన్ ‘యూబీఎఫ్ హెల్ప్’

భారతదేశంలో ప్రజారోగ్య సంబంధిత విషయంలో విప్లవాత్మక మార్పు అయిన ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్‌ మిషన్‌’లో ప్రతి భారతీయుడు స్వచ్ఛందంగా భాగస్వామి కావాల్సిన అవసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రతి భారతీయుడికీ ప్రత్యేకమైన ఆరోగ్య గుర్తింపు కార్డుతోపాటు ఆరోగ్య వివరాలన్నీ డిజిటలీకరించబడటం వల్ల వైద్యులు చికిత్సనందించడం సులభతరం అవుతుందన్నారు. వైద్యులకు వ్యాధిగ్రస్తుల అనారోగ్య వివరాలు, అందించిన వైద్యం తదితర విషయాలను తెలుసుకునేందుకు వీలుపడుతుందన్నారు. 
 
రొమ్ము కేన్సర్ వ్యాధిగ్రస్తులకు కౌన్సెలింగ్ ద్వారా సాంత్వన చేకూర్చేందుకు, వారిలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని నింపేందుకు ఉషాలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్ రూపొందించిన జాతీయ హెల్ప్‌లైన్ ‘యూబీఎఫ్ హెల్ప్’ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. రొమ్ము కేన్సర్‌ బారి నుంచి కోలుకున్న వారి ద్వారా ఈ హెల్ప్ లైన్ నడపాలన్న ఆలోచనను, రొమ్ము కేన్సర్‌ విషయంలో మహిళల్లో చైతన్యం కల్పించేందుకు డాక్టర్ పి. రఘురామ్, డాక్టర్ ఉషాలక్ష్మి బృందం చేస్తున్న ప్రయత్నాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు. తెలుగు, కన్నడ, తమిళం సహా 11 భారతీయ భాషల్లో ఈ హెల్ప్‌ లైన్ నడపాలన్న ఆలోచనను ప్రశంసిస్తూ, గ్రామాల్లో ఉండే మహిళలకు వారి భాషలో రొమ్ము కేన్సర్ గురించిన సంపూర్ణ సమాచారం తెలుసుకోవడంతోపాటు చికిత్సకు సంబంధించిన విషయాలపై అవగాహన కలుగుతుందన్నారు.
 
భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఏటా 23 లక్షలమంది మహిళలు రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారని, 6.85 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తించి, బాధితులకు సకాలంలో వైద్యాన్ని అందించాలని ఆయన అన్నారు. వ్యాధుల తీవ్రత విషయంలో గణాంకాలను చూసి ఆందోళన చెందాల్సిన పనిలేదని.. అయితే నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని ఈ లెక్కలు గుర్తుచేస్తాయన్నారు.
 
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉషాలక్ష్మి, డాక్టర్ పి. రఘురామ్, తెలంగాణ ప్రభుత్వ ఐటీ కార్యదర్శి శ్రీ జయేశ్ రంజన్‌తోపాటు వైద్యులు, ప్రొఫెసర్లు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు, అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఇన్ ఇండియా ప్రతినిధులు, బ్రెస్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.