రెండున్నర ఏళ్ళుగా నీరు- చెట్టు బిల్లులు పెండింగ్ పెట్టిన సీఎం జగన్
సీఎం జగన్ కక్షసాధింపు వైఖరితో రైతులు, ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని రైతు సంఘాల నేతలు అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ లు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ లు రైతు సంఘాల నాయకులు సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు అధ్యక్షతన సమావేశమయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు సంబంధించి గత రెండున్నర సంవత్సరాలుగా బిల్లులు చెల్లించకుండా కక్ష సాధించారని సమావేశం తీవ్రంగా నిరసించింది. నరేగా బిల్లుల తరహాలోనే నీరు చెట్టు పథకం కింద గత ప్రభుత్వ హయాంలో పనులు చేసి బిల్లులు పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్లు గ్రామస్థాయి నుంచి బిల్లులను సమీకరించి న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు.
నీరు చెట్టు పథకం వల్ల భూగర్భ జలాలు పెరగడం పంట పొలాలకు సారవంతమైన మట్టి సరఫరా చేయడంతో రైతులకు లబ్ధి చేకూరుతుందని మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పేర్కొన్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్షసాధింపు వైఖరి కారణంగా రాష్ట్రంలో పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత వైఖరి వల్ల అటు రైతులు ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు అన్ని విధాల నష్టపోయారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నీరు చెట్టు పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి రూ.1277 కోట్ల రూపాయలు సి ఎఫ్ ఎం ఎస్ లో పెండింగ్ లో ఉన్నాయని ఇవి కాక మరో రూ.500 కోట్ల వరకు జనరేట్ కాని బిల్లులు ఉన్నాయని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, నీరు చెట్టు కింద 98 కోట్ల ఘనపు క్యూబిక్ మీటర్ల మట్టిని పూడిక తీయడం జరిగిందని ఈ విధంగా పనులు నిర్వహించడం భారతదేశంలోనే తొలిసారి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6.975 లక్షల పంట కుంటలను త్రవ్వకం ,రాష్ట్రవ్యాప్తంగా 4735 చెరువులను అనుసంధానం చేశామన్నారు. ఈ పనుల వల్ల 90 టీఎంసీల నీటి సామర్థ్యం పెంచి కొత్తగా ఏడు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినట్లు చెప్పారు.
ఈ సమావేశంలో ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ లు యనమద్ది పుల్లయ్య చౌదరి (కృష్ణా),మైనేని మురళి కృష్ణ (గుంటూరు), రాపూరి సుందరరామిరెడ్డి (నెల్లూరు),గండి ముసిలినాయుడు (విశాఖపట్నం),రెడ్డి ఆదినారాయణ(విజయనగరం),కె సతీష్ నాయుడు(చిత్తూరు) ,మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రైల్వే కోడూరు ఇన్చార్జి పంతగాని ప్రసాద్,రాష్ట్ర పంచాయితీరాజ్ మాజీ కమిషనర్ బి.రామాంజనేయులు రైతు సంఘం నాయకులు కుర్రా నరేంద్ర, కవులూరి రాజా, చెన్నుపాటి శ్రీధర్, ముల్లంగి రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.