అరకు వ్యాలీలో అద్దంలాంటి రహదారులు... డిప్యూటీ సీఎంపై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రహదారులను నిర్మించింది. ఈ ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన రహదారులను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు.
ముఖ్యంగా, జిల్లాలోని అరకు వ్యాలీ నియోజకవర్గం పరిధిలో హుకుంపేట మండలం, గూడా రోడ్డు నుండి సంతబయలు వరకు మర్రిపుట్టు గ్రామం మీదుగా 2.00 కిలోమీటర్లు మేర రూ 90.50 లక్షల అంచనాతో తారు రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది.
ఈ తారు రోడ్డు పంచాయతీ రాజ్ విభాగంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులు ద్వారా నిర్మాణం పూర్తి చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో 170 జనాభా కలిగిన మర్రిపుట్టు గ్రామానికి డోలి మోతలు నివారించి, విద్య, వైద్య, వ్యాపార పరమైన వసతులకు ప్రభుత్వం మరింత చేరువ చేసింది.
ఈ తారు రోడ్డు నిర్మాణం జరగక ముందు ప్రజలు ఆసుపత్రికి వెళ్ళాలన్నా, విద్యార్థులు పాఠశాలకు వెళ్ళాలన్నా, ఏ అవసరం వచ్చినా చాలా ఇబ్బంది పడేవారు. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి అరకు నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.