మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 1 జులై 2019 (14:14 IST)

జగన్‌ నివాసం వద్ద తొక్కిసలాట... అపస్మారక స్థితిలో మహిళ

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద సోమవారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన మహిళ విశ్రాంతమ్మ స్పృహతప్పి పడిపోయింది. సీఎంకు అర్జీ ఇచ్చేందుకు ఆమె తాడేపల్లికి వచ్చింది. సీఎం ప్రజా దర్బార్ నిర్వహిస్తారనే ప్రచారం జరగడంతో ప్రజలు పెద్ద ఎత్తున సీఎం ఇంటి వద్దకు తరలివచ్చారు. ప్రజలు పెద్దసంఖ్యలో రావడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిని కలవాలంటూ ఒక్కసారిగా ప్రజలు లోపలికి రావడంతో తోపులాట జరిగింది.
 
కాగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నేటి నుంచి నిర్వహించాలనుకున్న ప్రజా దర్బార్‌ ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా పడింది. అయితే ఆ విషయం తెలియని ప్రజలు సీఎం నివాసం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. చివరికి విషయం తెలుసుకుని నిరాశతో వెనుదిరుగుతున్నారు.
 
ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి వినతులు స్వీకరించి సత్వర పరిష్కారానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ప్రజాదర్బార్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించాలనుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జూలై 1 నుంచి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి మొదలు పెట్టాలని ఆయన భావించారు. అయితే ఏర్పాట్లు ఇంకా పూర్తికాకపోవడం, జూలైలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా వేసినట్లు సీఎం క్యాంపు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.