సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (08:42 IST)

ఏపీలో 'పంచాయతీ' సేవలు అభినందనీయం

కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న ఈ సంక్షోభ సమయంలోనూ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గ్రామాల్లో మంచినీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, బోరు బావులు, డ్రైనేజీ వ్యవస్థలను పర్యవేక్షించడం వంటి కీలక విధులతో పాటు ప్రజారోగ్యం పై కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. 

ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన “నవరత్నాలు’’ను ప్రజలకు చేరువ చేయడంలో పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులు చేస్తున్న కృషి ప్రసంశనీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెల ఒకటో తేదీనే లబ్ధిదారులకు ‘’వైఎస్ఆర్ పెన్షన్ కానుక’’ను అందించడంను ఒక సవాల్ గా తీసుకుని పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులు నిర్వర్తించిన సేవలు కొత్త రికార్డులను సృష్టించాయన్నారు.

ఈ సందర్బంగా దేశంలోనే ఆదర్శవంతమైనవిగా సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థలు గుర్తింపును సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. అనేక రాష్ట్రాలకు మన ప్రభుత్వం రూపొందించి, అమలు చేస్తున్న ఈ వ్యవస్థలు స్పూర్తిదాయకంగానూ, మార్గదర్శకంగానూ నిలవడంలో ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులు, వాలంటీర్ల చిత్తశుద్ది ఇమిడివుందని అన్నారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడటానికి, వారిలో అవగాహనను కల్పించడం, పారిశుధ్య కార్యక్రమాలను ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్ళడం, ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతతో వ్యవహరించడం ద్వారా ‘’గ్రామ మార్గదర్శి’’గా పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది శ్లాఘనీయమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

ఇటువంటి మంచి వ్యవస్థలను విజయవంతంగా నిర్వహిస్తున్న జిల్లా ప్రజాపరిషత్, జిల్లా పంచాయతీ విభాగం, మండల ప్రజాపరిషత్, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్ విభాగాలకు అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలను చైతన్యవంతం చేయటం లో పంచాయతీ, సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ విజయవంతంగా పని చేస్తోందని అన్నారు. 

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేయడం, ఎప్పటికప్పుడు సమాచారాన్ని క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వ ఉన్నత స్థాయి వరకు అందజేయడంలో పంచాయతీ వ్యవస్థ మహత్తరమైన కృషి చేస్తోందని అన్నారు.

గ్రామాలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్లడం, పరిశుభ్రతతో, ముందు జాగ్రత్తలతో కరోనా వంటి మహమ్మారిని కట్టడి చేయటానికి చిత్తశుద్ధితో సేవలు అందించడంలో ఉద్యోగులు సైనికుల్లా పని చేస్తున్నారని, వారి సేవలు ప్రజలు సంతోషంగా ఉందని అన్నారు.