మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (21:07 IST)

వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి కోసం చర్యలు.. ఏపీ ప్రభుత్వం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా దేశంలో వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న 2,976 మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన వలస కార్మికులు, మత్స్యకారులు, కొద్దిమంది యాత్రికుల యోగక్షేమాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుందని సమాచార, పౌరసంబంధాల శాఖ కమీషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ప్రత్యేక కార్యదర్శి, కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ రోజు కోవిడ్-19 పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జరిపిన సమీక్షా సమావేశంలో వీరి యోగ క్షేమాల కొరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారని, అవసరమైన చోటుకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక అధికారిని ఆయా రాష్ట్రాలకు పంపి అక్కడి అధికారులతో సమన్వయం చేసుకుంటూ వారికి సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి  తెలిపారు.
  
శ్రీకాకుళం జిల్లాకు చెందిన దాదాపు 1,200 మత్స్యకారులు గుజరాత్ వెరవల్ లో చిక్కుకుపోయారని ఈ విషయానికి సంబంధించి జగన్ గుజరాత్ ముఖ్యమంత్రిని ఉద్ధేశించి ఒక లేఖ రాయడం జరిగిందని, అప్పటి నుంచి వీరికి రోజు విడచి రోజు రెండు కిలోల బియ్యం, కిలో పప్పుధాన్యాలను అందజేస్తున్నారని ఆయన అన్నారు.

ముఖ్యంగా వారణాసికి (ఉత్తరప్రదేశ్) 400 మంది యాత్రికులు 16 ఆశ్రమాలలో  చిక్కుకుపోయారని, వారు సుందర శాస్త్రి ఆంధ్ర ఆశ్రమంలో ఉన్నారని, వారికి అన్ని విధాల ప్రభుత్వం సాయం అందిస్తుందని, ఇందుకోసం స్థానికి ఎక్సైజ్ కమిషనర్ గురుప్రసాద్ తో సమన్వయం చేయటం జరగుతుందన్నారు.

సక్రమంగా వారికి కావలసిన రేషన్ సరఫరా తో పాటు, యాత్రికులందరనీ బాగా చూసుకుంటున్నారనీ, వారందరూ క్షేమంగా ఉన్నారన్నారని తెలిపారు.  గోరఖ్ పూర్ (ఉత్తరప్రదేశ్)కి గుంటూరు నుండి వచ్చిన 30 మంది యాత్రికులు, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న రామా ప్యాలెస్ వద్ద ఉన్నారని, ఎక్సైజ్ కమీషనర్ గురుప్రసాద్ వీరితో సమన్వయం చేస్తున్నారనీ, వీరికి కావాల్సిన రేషన్ మరియు అన్ని విధాల అవసరమైన మద్దతును అందిస్తున్నారని అన్నారు.

అజ్మీర్(రాజస్థాన్) కి కర్నూలు నుండి వచ్చిన 21 మంది యాత్రికులు లాడ్జిలో చిక్కుక్కకుపోయారని వారి యోగ క్షేమాలను ముఖ్యకార్యదర్శి ఆదేశాలతో నోడల్ ఆఫీసర్  పర్యవేక్షిస్తున్నారని వారికి కావాల్సిన రేషన్ మరియు ఇతర ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తున్నారని అన్నారు.

కాసీమేడు (ఛెన్నై) కి శ్రీకాకుళం నుండి 500 మంది మత్స్యకారులు పడవల్లో ఒడ్డుకు దూరంగా చిక్కుకున్నారని, జిల్లా అధికారుల సహాయంతో వీరికి రేషన్ క్రమం తప్పకుండా అందిస్తున్నామని  అన్నారు. గోవా కి కడప నుండి వెళ్లిన ఇరవై మంది యాత్రికులు మద్గావ్ సమీపంలో చిక్కుకున్నారని, జిల్లా అధికారుల సహాయంతో అవసరమైన ఆహారం మరియు వస్తువులను వీరికి రెగ్యులర్ గా సరఫరా చేస్తున్నారని ఆయన తెలిపారు.
 
కోయంబత్తూర్ లో 300 మంది మాసన్ కార్మికులు ఉన్నారని మరియు జిల్లా అధికారుల సహాయంతో బియ్యం, గోధుమలు మరియు ఇతర నిత్యావసర వస్తువులను క్రమం తప్పకుండా అందిస్తున్నారన్నారు. వెర్సోవా (ముంబాయి) కి కర్నూలు నుండి సుమారు 500 మంది వలస కార్మికులు వచ్చారని, వారికి కావాల్సిన రేషన్ను ముంబై అదనపు మున్సిపాల్ కమిషనర్ సహాయంతో 15 రోజుల పాటు అందిస్తున్నారని ఆయన అన్నారు.

ఆయా ప్రాంతాలలో ఉన్న తెలుగు ప్రజలకు సాధ్యమైనంత మెరుగైన సహాయాన్ని అందించడంలో, సమన్వయం చేయడంతో మరియు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడానికి రాష్ట్ర నోడల్ ఆఫీసర్‌గా ప్రత్యేక సీఎస్ సతీష్ చంద్ర పర్యవేక్షించనున్నారని విజయ్ కుమార్ రెడ్డి తెలియజేశారు.

రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన 238 రిలీఫ్ సెంటర్స్ ద్వారా 16,934 మంది నిర్వాసితులకు, వలసదారులకు వసతి సౌకర్యం కల్పించామని సమాచార, పౌరసంబంధాల శాఖ కమీషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ప్రత్యేక కార్యదర్శి, కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర కో-ఆర్డినేషన్ టీమ్ ఏర్పాటులో ముఖ్య ఉద్ధేశ్యం ఏ ఆధారంలేని వారికి, నిర్వాసితులకు, వలసదారులకు వసతి సౌకర్యం కల్పన తదితరమైన విషయాలను పర్యవేక్షించటమే అని అన్నారు.  విజయవాడ రోడ్లు, భవనాల శాఖ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ నుంచి నిత్యవసర వస్తువుల లభ్యత, ధరలను పర్యవేక్షిస్తారన్నారు.

ఈ కంట్రోల్ రూమ్ 11 ప్రభుత్వ శాఖల సౌజన్యంతో పనిచేస్తుందన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్ లు నిర్వహించటం జరగుతుందన్నారు. స్పందన టోల్ ఫ్రీ నెంబర్ 1902  ద్వారా 3,277 సమస్యలకు పరిష్కారం లభించిందని, 24 గంటలు పనిచేసే ఈ కాల్ సెంటర్ కు ఇప్పటి వరకు 3,321 సమస్యలు నమోదు అయ్యాయని తెలిపారు.

వాహనాలు మరియు వ్యక్తులకు ఆన్ లైన్ లో పాస్ లు ఇస్తున్నామని, ఇప్పటి వరకు 3,159 పాస్ లు జారీ చేశామని ఇంకా 1,281 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని ఆయన ఆ ప్రకటనలో తెలియజేశారు. త్రాగునీటి సరఫరా, పారిశుధ్ధ్యం, విద్యుత్ సరఫరా వంటి అంశాలను సంబంధిత శాఖలైన పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్ శాఖ లు నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నాయన్నారు.