శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 26 నవంబరు 2018 (23:25 IST)

జగన్‌కి డబ్బులు వెళ్ళిపోయాయా అని బాబు అడుగుతారు.... పవన్

జగన్‌లా సీఎం అయితే చేస్తాను, చంద్రబాబులా నన్ను మరోసారి సీఎం చేస్తే చేస్తాను అని చెప్పను. ఎప్పుడూ మీతోనే ఉంటాను. రాష్ట్రాన్ని అవినీతిమయం చేసేసి, దోచేస్తుంటే ప్రతిపక్ష నేతగా జగన్ ఏమీ మాట్లాడరు. అసెంబ్లీలో నిలదీయరు. ఏమిటీ అంటే మా ఎమ్మెల్యేలను కొనేశారు అంటారు. అది మీ ఇంటి గొడవ. మీ పంతాలు పట్టింపులు కోసం ప్రజల ఇబ్బందులను పట్టించుకోరా?  ప్రజల సమస్యలపై మాట్లాడరా? ప్రతిపక్ష నేత అనేది ఎంత బలమైన స్థానమో గుర్తించరా? ముందు చట్టసభకు వెళ్లి చంద్రబాబు, లోకేష్‌లను నిలదీయండి. జగన్ ఆ పని మాత్రం చేయరు. దాని గురించి అడిగితే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు. 
 
నేనూ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడగలను. అవి ప్రజా జీవితాన్ని మార్చి, అభివృద్ధి చేస్తాయా? పోలవరం ప్రాజెక్ట్ నుంచి చిన్నపాటి ప్రాజెక్ట్ వరకూ టిడిపి, వైసిపి కలిసే వాటాలు పంచుకొంటున్నాయి. చంద్రబాబు గారు జగన్‌కి డబ్బులు వెళ్ళిపోయాయా అని అడుగుతారు. ఇసుక మాఫియాలో కూడా టిడిపి, వైసిపి కలిపే దోచుకొంటున్నారు. దాంతో ప్రభుత్వ అవినీతిని నిలదీయాలి అంటే జగన్‌కు భయం. అందుకే సభకు వెళ్ళరు. ప్రభుత్వం అవినీతిని నిలదీయలేని చేతగానితనం, పిరికితనం ఆయనది.
 
రిలయన్స్‌కి భయపడేది లేదు
పచ్చని కోనసీమలో ప్రకృతినీ, పచ్చదనాన్నీ పణంగాపెట్టి ఇక్కడి గ్యాస్, ఆయిల్ నిక్షేపాలను దేశానికి ఇస్తుంటే ఈ ప్రాంతానికి ఏమి చేశారు. ఎంత సంపద పెంచారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు. రిలయన్స్ వాళ్ళు ఇక్కడి నుంచి మన సంపద తరలించుకుపోతున్నారు. మన రైతులకు ఏమి చేశారు. కోనసీమ యువతకి ఎంతమందికి ఉపాధి ఇచ్చారు. రిలయన్స్‌కు ఇక్కడి నిక్షేపాలు ఇచ్చినప్పుడు మనకు ఏమిటి? ఎంత సంపద ఈ ప్రాంతంలో సృష్టిస్తారు? లాంటివి కూడా అడగరు. అప్పుడు పాలనలో ఉన్నది చంద్రబాబే. నాటి ప్రతిపక్షం ఏమీ మాట్లాడదు.
 
 దేశాన్ని శాసించే రిలయన్స్ అంటే భయం. ఏమిటీ ఈ భయం. 
అందరికీ భయపడితే రాజకీయం ఏమి చేస్తాం. రిలయన్స్‌కి భయపడేది లేదు. లోకేష్‌కి రెండు సూట్‌కేసులు ఇస్తే థాంక్స్ చెప్పి ఇంట్లో పెట్టుకుంటారు. జగన్ అడిగితే మోడీ కేసులు చూపిస్తారు భయపడి మాట్లాడరు. జనసేనకు అలాంటి భయాలు లేవు. ఇక్కడి నుంచి మన నిక్షేపాలు గుజరాత్‌కి తరలిపోతున్నాయి. ఇక్కడ సంపద సృష్టి, ప్రజల సంక్షేమంపై నిలదీస్తాం. మా కోనసీమకు అన్యాయం చేస్తున్నవారిని అడిగే హక్కు, నిలదీసే ధైర్యం మాకు ఉంది. నేను ధర్మాన్ని నమ్మినవాణ్ణి.
 
అప్పుడు గుంతల్లో గోదావరి అందం అని చదువుకోవాలి
టిడిపి పోవాలి.. జగన్ ను పక్కనపెట్టాలి. వాళ్ళకి అవకాశం ఇస్తే ఇసుకను మరింత దోచేస్తారు. ఒకప్పుడు వెన్నెల్లో గోదావరి అందం, గోదాట్లో ఇసుక తిన్నెలు అని చదువుకున్నాం. టిడిపి, వైసీపీలకు అవకాశం ఇస్తే ఇసుక మొత్తం తవ్వేసి, గుంతలు మిగులుస్తారు. గోదావరి కూడా మిగలదు. అప్పుడు గుంతల్లో గోదావరి అని చదువుకోవాలి. పి.గన్నవరం దగ్గర ఒక ఇసుక ర్యాంప్ కి లోకేష్ పేరు పెట్టుకున్నారు. పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్లు లోకేష్ చట్ట సభలోకి వెళ్ళగానే అవినీతి మొదలుపెట్టారు. 
 
అవినీతితో నిండిన ఇసుక ర్యాంప్‌కి పేరు పెట్టుకొంటే సిగ్గు అనిపించడం లేదా. భూమిని దోచుకొందామనుకున్న వాళ్ళు ఎవరూ మిగల్లేదు. పురాణాల్లో రాక్షసులు ఉంచి ఇప్పటి వరకూ. చింతకాయల్లా రాలిపోయారు. పంచ భూతాలనీ శాసిద్దాం అనుకొంటే కుదరదు.
జనసేన ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా పాలన అందిస్తాం. రైతుల కష్టాలు తెలిసినవాణ్ణి. రైతులకి ఎప్పుడూ అండగా నిలుస్తాం. చంద్రబాబులా రుణాల భారాన్ని రైతులకి ఇవ్వం. ఆడపడుచులకు రక్షణ నిలుస్తాం. వారికి 33 శాతం రాజకీయ రిజర్వేషన్ ఇస్తాం. వారికి స్థానం ఇవ్వడం వాళ్ళ అవినీతి తగ్గుతుంది. ఆడబిడ్డలకు స్కూల్స్ లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం. విద్య, వైద్యం ప్రజలకి అందుబాటులోకి తెస్తాం. నారాయణ, చైతన్య కార్పొరేట్ కాదు. సర్కారీ స్కూల్స్ లోనే మంచి విద్య అందిస్తాం" అన్నారు.