బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 26 నవంబరు 2018 (16:13 IST)

కోనసీమ పచ్చదనం వల్లే తెలంగాణ విడిపోయింది : పవన్ కళ్యాణ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకుగల కారణాలపై జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ సరికొత్తగా సెలవిచ్చారు. కోనసీమ పచ్చదనం చూసి ఓర్వలేకే తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారని వ్యాఖ్యానించారు. 
 
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పోరాటయాత్రలో భాగంగా, రైతులతో జరిగిన ముఖాముఖితో మాట్లాడుతూ, కొనసీమలో పంటలు పండక, గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారన్నారు. కానీ బయటి వ్యక్తులు మాత్రం వాస్తవాలు తెలియక.. 'మీకేమండి!.. అద్భుతమైన కోనసీమ ఉంది. పంటలు బాగా పండుతాయి' అని చెబుతూ ఉంటారని వ్యాఖ్యానించారు. కోనసీమ ప్రాంతంలో కాలువలు పూడికతో నిండిపోయినా పట్టించుకునే నాథుడే లేడని పవన్ కల్యాణ్ విమర్శించారు. 
 
రైతులకు మద్దతు ధర, మార్కెట్ కల్పనపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. పచ్చటి కోనసీమకు అందరి దిష్టి తగిలిందన్నారు. అసలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రావడానికి, తెలంగాణ ఓ రాష్ట్రంగా విడిపోవడానికి కోనసీమ పచ్చదనమే కారణమని జనసేనాని అభిప్రాయపడ్డారు. 
 
కానీ వాస్తవంలో పొలాల్లో మంచినీళ్లు వేసే పైపులు కూడా పగిలిపోయి, నేల నుంచి ఉప్పునీటి ఊట వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమ నీళ్లు అంటే కొబ్బరి నీళ్లలా ఉంటాయన్న నానుడి ఉందనీ, ఇప్పుడు మాత్రం ఉప్పునీళ్లు వస్తున్నాయని చెప్పారు. 
 
రైతన్నల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం తిప్పించుకుంటోందని దుయ్యబట్టారు. అన్నం పండించే రైతుకు అండగా ఉండని ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు. ఎంతసేపు సింగపూర్ తరహా రాజధాని, సింగపూర్ తరహా ప్రభుత్వం అని చంద్రబాబు అంటున్నారనీ, కానీ రైతులకు ఏ రకంగా గిట్టుబాటు ధర కల్పించాలి? అని మాత్రం ఆలోచించడం లేదని దుయ్యబట్టారు.