సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 24 నవంబరు 2018 (21:53 IST)

'అన్నయ్య' పార్టీని అమ్ముకున్నాడు.... 'తమ్ముడు' ఏం చేస్తాడో... బాబు వ్యాఖ్య

అనంతపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్న చిరంజీవి పార్టీని అమ్ముకుని పోతే.. అదే చేసేందుకన్నట్టుగా పవన్ వచ్చాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా టీడీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ పవన్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. నాడు తన సిధ్ధాంతాలు రైటని, నేడు తననే మోసగాడంటున్నాడని.. పవన్ ఓ ఊసరవెల్లి అంటూ జనసేనానిపై మండిపడ్డారు. 
 
ప్రజలను మోసం చేసి, టోపీలు వేయడానికి అటు వైసీపీ, ఇటు జనసేన పార్టీలు వచ్చాయని.. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. జగన్ కోడి కత్తి.. అంతా ఓ డ్రామా అన్నారు. పీఎం మోదీని ఎదిరించి ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నానని.. ఎన్ని సమస్యలు వచ్చినా.. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎదుర్కోవడానికి తాను సిధ్ధమన్నారు. న్యాయంగా పని చేస్తుంటే తమపై సీబీఐ దాడులు జరపడం ఎంతవరకు న్యాయమన్నారు. 
 
ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీని గెలిపించడానికి సిధ్ధంగా ఉండమని పిలుపునిచ్చారు.
 
మరోవైపు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న నాయకులకు ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఏదైనా అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. 
 
ప్రతి నియోజకవర్గం నుంచి పోటీ చేసే ప్రతి అభ్యర్థి పేరు చెబుతా.. వాళ్ళను ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించండన్నారు. ‘‘అన్నీ చేశాం.. చేస్తున్నాం. మళ్ళీ పార్టిని గెలిపించే హక్కు మీకు లేదా’’ అని కార్యకర్తలను ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో 14 ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాలూ ఖచ్చితంగా గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.