సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (09:44 IST)

వ్యక్తిగత లాభం చూసుకోలేదు... రాపాక ఉన్నాడో లేదో తెలియదు : పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నడు కూడా వ్యక్తిగత లాభం చూసుకోలేదన్నారు. అలా అనుకునివుంటే భారతీయ జనతా పార్టీలో చేరి పదవులు అనుభవించేవాడినని చెప్పుకొచ్చాడు. పైగా, తన పార్టీ తరపున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఉన్నాడో లేదో తెలియదన్నారు.
 
మంగళగిరిలో విజయవాడ తూర్పు, నరసరావుపేట నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చి గుర్తింపు పొందిన వారు, ఇప్పుడు తన పద్ధతి బాగాలేదంటూ విమర్శలు గుప్పించి వెళ్లిపోతున్నారని, అటువంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదంటూ పరోక్షంగా సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 
 
అలాగే, ఎవరికీ కాపలా కాస్తూ తాను ఉండలేనని, ఎవరి మోచేతి నీళ్లూ తాగబోనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు తప్పుమీద తప్పు చేయగా, ఇప్పుడు వైసీపీ సర్కారు నియమించిన గ్రామ వాలంటీర్లు సైతం అదే పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యర్థి పార్టీకి ఓటు వేశారని ఆరోపిస్తూ, రేషన్ కార్డులు, ఇళ్లపట్టాలను ఇవ్వడం లేదని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు దగ్గర చేసిన సంక్షేమ పథకాలకు 70 శాతం నిధులను కేంద్రమే ఇస్తోందని, వాటిని దారి మళ్లిస్తున్నారని చెప్పారు.
 
తనపై ఆధారపడిన కుటుంబాలను పోషించేందుకే తిరిగి సినిమాలు చేయాలని నిర్ణయించానే తప్ప, సినిమాలంటే ఇష్టంతో కాదని, అడ్డదారుల్లో సంపాదించే డబ్బు తనకు అక్కర్లేదన్నారు. అసలు వ్యక్తిగత లాభాన్ని చూసుకుని ఉండుంటే, జనసేన పార్టీ పెట్టుండే వాడిని కాదని, బీజేపీలో చేరివుంటే కోరుకున్న పదవులు లభించి వుండేవని, వాటిని అనుభవిస్తూ ఉండేవాడినంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.