శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 5 జూన్ 2019 (19:09 IST)

శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రత్యేక హోదాను మోడీ ప్రకటించేనా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 9వ తేదీన తిరుమలకు రానున్నారు. దేశ ప్రధానిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన శ్రీవారి దర్శనం కోసం వస్తున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం తిరుమల వచ్చిన నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరతామని ఆ ఏడుకొండల వాడి సాక్షిగా హామీ ఇచ్చారు. 
 
సీన్ కట్ చేస్తే.. గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ తిరుగులేని ప్రభంజనం సృష్టించారు. మోజార్టీ సీట్లతో గెలిచిన మోడీ.. దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్లు గడిచిపోయాయి.. కానీ ఆ ఏడుకొండలవాడి సాక్షిగా ఇచ్చిన హామీ ఏమైందని.. వివిధ రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు.
 
ఈ పరిస్థితుల్లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ... ఆ వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు, లోటు బడ్జెట్ తదితర అంశాలపై కీలక ప్రకటన చేస్తారా లేదా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, మోడీ పర్యటనను విజయవంతం చేయడానికి బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. 
 
అదేసమయంలో ప్రధాని మోడీతో సమావేశమయ్యేందుకు సీఎం జగన్ కూడా తిరుపతికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని ప్రధానిని కోరే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ నెల 15వ తేదీన జగన్ ఢిల్లీకి వెళ్లి నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనున్నారు.