దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం : మాధురిపై పోలీసుల కేసు.. ఎందుకో తెలుసా?
వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆయన అడల్టెరీ రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్న దివ్వెల మాధురిపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యారని పేర్కొంటూ ఆమెపై భారత న్యాయ సంహిత సెక్షన్ 125 ప్రకారం అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాగా, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో మాధురి కలిసి ఉంటోందని, తన భర్తను తనకు కాకుండా చేసిందని దువ్వాడ వాణి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వాణి తన కూతురు హైందవితో కలిసి టెక్కలిలోని దువ్వాడ ఇంటి ముందు నిరసన చేస్తున్నారు.
ఇంట్లోకి అనుమతించాలని గత నాలుగు రోజులుగా రాత్రీపగలు అక్కడే ఉంటున్నారు. ఈ గొడవకు సంబంధించి మీడియా ముఖంగా వాణి, మాధురి పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. దీంతో టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ నివాసంపై తనకూ హక్కు ఉందని, ఇకపై పిల్లలతో కలిసి అక్కడే ఉంటానని మాధురి ఆదివారం ప్రకటించారు.
సాయంత్రం తన కారులో టెక్కలికి బయలుదేరారు. ఈ క్రమంలోనే పలాస హైవేపై లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర మాధురి నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. కానీ, కారు మాత్రం దెబ్బతినగా మాధురికి మాత్రం రవ్వంత కూడా గాయం కాలేదు. అయినప్పటికీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుంది.
దీనిపై ఆమె స్పందిస్తూ, ఇది రోడ్డు ప్రమాదం కాదని, వాణి ఆరోపణలతో డిప్రెషన్‌కు గురై తానే ఆ కారును ఢీ కొట్టానని మాధురి చెప్పారు. జరుగుతున్న పరిణామాలతో విసుగుచెంది చనిపోవాలనే ఉద్దేశంతో యాక్సిడెంట్ చేశానన్నారు. అయితే, పోలీసులు మాత్రం కారును నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యారంటూ కేసు నమోదు చేశారు.