మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 23 ఫిబ్రవరి 2019 (21:13 IST)

రాహుల్ గాంధీ పర్యటనతో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందా?(Video)

రాహుల్ గాంధీ తిరుపతి పర్యటన తరువాత కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోందా. పతనమైపోయిందన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుందా.. ప్రత్యేక హోదా అంశం కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకువస్తుందా.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలు, బస్సు యాత్రలు ఆ పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? 
 
రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎపిలో గడ్డుకాలమే. ఉన్న నాయకులందరూ వైసిపి, తెలుగుదేశం పార్టీ బాట పట్టారు. కేంద్రమంత్రులుగా పనిచేసిన వారు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిపోయారు. క్రిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీని వీడుతూ వచ్చారు. 
 
ఇక కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదాపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇస్తూ సంతకం చేస్తానని రాహుల్ గాంధీ ప్రకటించారు. దీంతో ఎపిలోని కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొత్త ఆశలు చిగురించాయి. 
 
రాష్ట్రాన్ని విడగొట్టి ప్రజలకు దూరమయ్యామని.. ప్రత్యేక హోదా అంశంపై పోరాటం చేసి ప్రజలకు దగ్గరవ్వాలని భావించారు కాంగ్రెస్ పార్టీ నేతలు. దీంతో ఈ నెల 23వ తేదీన అనంతపురంజిల్లాలో పిసిసి బస్సు యాత్రను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర నేతలందరూ ఈ యాత్రలో పాల్గొన్నారు. తిరుపతిలో జరిగిన బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొనడమే కాకుండా మోడీ ఎక్కడైతే ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారో అదే వేదికగా రాహుల్ గాంధీ మోడీని ప్రశ్నిస్తూ బహిరంగ సభలో పాల్గొన్నారు. 
 
రాహుల్ గాంధీ పర్యటనతో ఒక్కసారిగా ఆ పార్టీ నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ప్రత్యేక హోదాపై రాహుల్ చేసిన ప్రకటన ప్రజలకు వంద ఏనుగుల బలాన్ని ఇచ్చిందంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. రానున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో ధీటుగా పోటీకి సై అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం వచ్చినంత సంతోషంతో ఉన్నారు ఆ పార్టీ నేతలు. మరి నిజమవుతుందో లేదో చూడాలి. రఘువీరా రెడ్డి ఏమన్నారో చూడండి.