ఆస్పత్రిలో ప్రాంగణంలో 'జగనన్న ప్రాణ వాయువు రథ చక్రాలు' సిద్ధం
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా గణనీయంగా పెరుగుతున్న బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 'జగనన్న ప్రాణ వాయువు రథ చక్రాలు' పేరుతో రెండు బస్సులు సిద్ధమవుతున్నాయి.
రాజమహేంద్రవరం ఎంపి మార్గాని భరత్ రామ్ సూచనల మేరకు రాజమహేంద్రవరం ఆర్టీసీ గ్యారేజీలో రెండు వెన్నెల ఏసీ బస్సులను అత్యవసర వైద్య సేవలకు వీలుగా తగు ఏర్పాట్లు చేస్తున్నారు.
36 సీట్ల సామర్ధ్యం గల ఈబస్సులో ఆరు పడకలను ఏర్పాటు చేశారు. అంటే ఈ రెండు బస్సుల్లో మొత్తం 12 బెడ్స్‌ను కోవిడ్ బాధితుల కోసం సిద్ధం చేశారు.
అలాగే ఈ బస్సుల్లో వైద్యం పొందేవారికి ఆక్సిజన్ సదుపాయంతో పాటు ఒక మినీ ఐసియులా తయారైంది. బస్సులో ఇమిడే విధంగా ఆక్సిజన్ సిలెండర్లను ప్రత్యేకంగా విశాఖపట్నం నుంచి తీసుకువచ్చారు.
కోవిడ్ బాధితునకు సత్వరమే ఆక్సిజన్ అందజేసి ప్రాణాపాయ స్థితి నుంచి ఆదుకునేందుకు ఎంతగానో దోహదపడతాయి. ఆసుపత్రిలో పడక లభించగానే బస్సులో చికిత్స పొందుతున్న వారిని వెంటనే ఆసుపత్రిలోనికి షిఫ్ట్ చేసి వైద్య సేవలు అందిస్తారని ఎంపి భరత్ రామ్ మీడియాకు తెలిపారు.
చాలా మంది కోవిడ్ బాధితులు ఆక్సిజన్, బెడ్స్ కొరత కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి రావడంతో ' జగనన్న ప్రాణ వాయువు రథ చక్రాలు' రూపకల్పన చేసినట్లు తెలిపారు.
మొట్టమొదటి సారిగా రాజమహేంద్రవరం నగరంలో కోవిడ్ బాధితులకు బస్సులో వైద్య మందజేసే విధానం విజయవంతమైతే ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళ్ళతానని చెప్పారు. గురువారం నుంచి ప్రారంభించే ఈ కార్యక్రమం ట్రైల్ రన్‌గా పేర్కొన్నారు.
తన ఆలోచనల నుంచి ఉద్భవించిన ఈ కార్యక్రమం ద్వారా కోవిడ్ బాధితులకు న్యాయం జరిగితే అంతకంటే ఆనందం మరొకటి ఉండదన్నారు.