సచిన్ టెండూల్కర్.. 16 దత్తత గ్రామానికి.. పీఆర్ కండ్రిగను ఎంపిక ఎలాగంటే?
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తాంధ్ర జిల్లా అయిన నెల్లూరు పట్టణానికి ఈనెల 15వ తేదీన రానున్నారు. ఆ తర్వాత 16వ తేదీన ఆయన తాను దత్తత తీసుకున్న పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని సందర్శిస్తారు. సచిన్ రాకతో నెల్లూరు పట్టణంతో పాటు పీఆర్ కండ్రిగలో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.
కాగా, ప్రధాని నరేంద్రమోడీ పిలుపుకు స్పందించి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సచిన్ టెండూల్కర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గురువారం నాడు సచిన్ టెండూల్కర్ ప్రతినిధులు మనోజ్, ఈ గ్రామాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఇందుకోసం ఆయన 15వ తేదీనే జిల్లా కేంద్రమైన నెల్లూరుకు వస్తున్నారు.
దీంతో గ్రామంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా.. సచిన్ ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఎవరెవరిని కలవాలి? ఏయే కార్యక్రమాలు ప్రారంభించాలి? అనే విషయాలను సచిన్ ప్రతినిధులు పరిశీలించారు. తాను దత్తత తీసుకున్న గ్రామాన్ని పరిశీలించడానికి మాత్రమే సచిన్ వస్తున్నారని, సచిన్ రాక సందర్భంగా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ గ్రామాన్ని సందర్శించడం మినహా ఆయన వేరే ఇతర కార్యక్రమాలలో పాల్గొనడం గానీ, గ్రామానికి సంబంధించని వారిని కలవటం గానీ చేయరు. సచిన్ ఈ గ్రామం మొత్తాన్నీ కాలి నడకన తిరిగే అవకాశం వుంది. గ్రామం మొదట్లో శంకుస్థాపన కార్యక్రమం తర్వాత నూతనంగా నిర్మితమవుతున్న కంపోస్టు యార్డు, ఆటస్థలం, చెరువును సచిన్ పరిశీలిస్తారు. సచిన్‌ను కలిసే గ్రామస్తులను జేసీ ఆయన ప్రతినిధులకు చూపారు. మరుగుదొడ్డి నిర్మించుకున్న ఒక కుటుంబాన్ని, ప్రహరీ గోడ కట్టుకున్న మరో కుటుంబాన్ని ఆయన కలుస్తారు.
కాగా, ఈ గ్రామాన్ని ఎలా ఎంపిక చేశారంటే... నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఉన్న గ్రామాల్లో పీఆర్ కండ్రిగ ఓ చిన్న గ్రామం. అభివృద్ధిలో బాగా వెనుకబడిన ఈ గ్రామాన్ని ఇటీవల ఆ జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ సందర్శించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల లేమిని గుర్తించిన ఆయన 2.79 కోట్ల రూపాయలను కేటాయించి వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం అమెరికా నుంచి వస్తున్న నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) రేఖారాణి అదే విమానంలో ప్రయాణిస్తున్న సచిన్ టెండూల్కర్‌ను చూసి, ఆయనతో తాను ఎవరో పరిచయం చేసుకుని సంభాషించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి దత్తత గ్రామ పథకాన్ని సచిన్‌కు ఆమె వివరించి.. నెల్లూరులోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జీసీ అభ్యర్థనకు సచిన్ అపుడే సానుకూలంగా స్పందించి.. అక్టోబర్ 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీని కలిసినపుడు పీఆర్ కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ గ్రామ అభివృద్ధి కోసం రూ.4 కోట్లను కేటాయించారు. దీంతో ఒక్కసారిగా పీఆర్ కండ్రిగకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ఈ గ్రామానికి సచిన్ ఈనెల 16వ తేదీన రానున్నారు. ఇప్పటికే ఆయన ప్రతినిధులు ఈ గ్రామాన్ని సందర్శించి ఏర్పాట్లు చేస్తున్నారు.