శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 14 జులై 2021 (08:22 IST)

మరణాలు దాచిపెడితే ఏమొస్తుంది?: సజ్జల

40 ఏళ్ళ రాజకీయ అనుభవం, సుదీర్ఘకాలంపాటు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకి పుట్టిన గడ్డ, పుట్టిన ప్రాంతం, సొంత రాష్ట్రం మీద కూడా ప్రేమ, మమకారం లేదన్నది ఆయన చర్యల ద్వారా ప్రతిసారీ రుజువు అవుతోందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

గ్రామ సచివాలయాలపై.. మతి చలించినవాడిలా ఈరోజు చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని, మాట్లాడేందుకు మైకు, రాసేందుకు అనుకూల మీడియా ఉందని గ్రామ స్వరాజ్యంపై చంద్రబాబు అడ్డగోలు వాదనలు చేస్తున్నారని సజ్జల తీవ్రంగా విమర్శించారు. జన్మభూమి కమిటీ పేరుతో పంచాయతీల గొంతు నొక్కి, స్థానిక సంస్థల ఊపిరి తీసింది మీరు కాదా చంద్రబాబూ అని సజ్జల ప్రశ్నించారు.

జన్మభూమి కమిటీల పేరుతో ప్రతి పనికీ ఒక రేటు కట్టి దారిదోపిడీ దొంగల్లా దోచుకున్నది మీ హయాంలో కాదా.. అని నిలదీశారు. రాష్ట్రం మీద కసితో తన కళ్ళు మాత్రం పొడుచుకోడుగానీ,  రాష్ట్రం కళ్ళు చంద్రబాబు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. 
 
రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్టాండ్‌ ఏంటో, అలాగే ప్రతిపక్ష పార్టీ వైఖరి ఏంటో ఇప్పటికైనా స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఆతర్వాతే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌పై టీడీపీ నేతలు మాట్లాడితే బాగుంటుందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని సూటిగా ప్రశ్నించారు.

తెలుగు రాష్ట్రాల జల వివాదంపై తానేమో మీడియా ముందు ముఖం చాటేసి, ప్రకాశం జిల్లాకు చెందిన తన పార్టీ ఎమ్మెల్యేల చేత రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగేలా, తెలంగాణ వాదాన్ని నెత్తికెత్తికుంటూ లేఖలు రాయించడం ద్వారా చంద్రబాబు ఏం సందేశం ఇస్తున్నారని సజ్జల ప్రశ్నించారు.  జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఏ ప్రాంత ప్రయోజనాలకూ ఇబ్బంది రాకుండా వ్యవహరిస్తుంటే... చంద్రబాబు నాయుడు మాత్రం జిల్లాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.

సొంత జిల్లా చిత్తూరులో రిజర్వాయర్ల నిర్మాణంపై తెలంగాణకు అనుకూలంగా ఎన్‌జీటీలో చంద్రబాబు కేసులు వేయించారని చెప్పారు. దీనినిబట్టి పుట్టిన ప్రాంతం, పుట్టిన గడ్డ, సొంత రాష్ట్రంపై కూడా చంద్రబాబుకు ఎటువంటి ప్రేమ లేదనేది అర్థమవుతుందన్నారు. ఎంతసేపటికీ చంద్రబాబుకు అధికారంపై యావే తప్ప రాష్ట్ర అభివృద్ధి పట్టదన్నారు.
 
తాడేపల్లిలోని వైయస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ జల అక్రమాలపై మాట్లాడని చంద్రబాబు నాయుడు అర్థంలేని ప్రేలాపనలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. 

చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారన్న భ్రమలో ఉన్నారని దుయ్యబట్టారు. ఆయన మాటలు చూస్తుంటే అసలు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారా అన్న అనుమానం కలుగుతుందని అన్నారు. పంచాయతీల అభ్యున్నతికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. 
 
సజ్జల మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
 
1. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుగారు ఇవాళ దూళిపాళ్ల నరేంద్రను పరామర్శించేందుకు వెళ్లి మీడియాతో మాట్లాడుతూ..  సంగం డెయిరీ దగ్గర మొదలుపెట్టి ఎక్కడకో వెళ్లిపోయారు. ఆయన అస్సలు దేనిమీద మాట్లాడారో ఏమి చెప్పాలనుకున్నారో వదిలేసి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం చూస్తుంటే చంద్రబాబు ఓ దశలో మతి చలించి వ్యవహరించే తీరులో మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది.

అంత విశేష అనుభవం ఉన్న నాయకుడు... పంచాయతీలకు సంబంధించి నిన్న హైకోర్టులో ఇచ్చిన తీర్పుపై మాట్లాడిన తీరు చూస్తే... అసలు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారా? ఆయనకు ఆ అర్హత ఉందా అనే అనుమానం కలిగింది. వితండవాదం, అర్థం లేని ప్రేలాపనలు చేశారు. 
 
2. ‘గ్రామ సచివాలయాలు పెట్టి సర్పంచ్‌లను ఏదో చేశారు. కేంద్రం రాష్ట్రంలో ఒక సెక్రటేరియట్‌ పెడితే ఒప్పుకుంటారా..’ అని చంద్రబాబు అంటున్నారు. అసలు రెండింటి మధ్య సంబంధం ఏంటి? రాజ్యాంగం ఏమి చెబుతోంది. గ్రామ పంచాయతీలకు.. స్థానిక సంస్థలుగా దానికి ఉన్న పరిమితులు ఏంటి? గ్రామ స్వరాజ్యం పరిమితులు ఏమిటి..? గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ పరమైన పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

ఏదో అడ్డగోలు కామెంట్లు చేసేవాళ్లో, చెట్టుకింద కూర్చుని ఉబుసుపోక నోటికి ఏది వస్తే అది వితండవాదం చేసేవారికి ఇది సరిపోతుంది కానీ... విశేష అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం వినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారా.. అనేలా సిగ్గు కూడా వేస్తోంది.
 
3. కోర్టు కామెంట్‌ చేసిన కాంటెక్ట్స్‌ అలాగే గ్రామ పంచాయతీల అధికారాలకు ఎక్కడ ఇబ్బందైంది. గ్రామ సచివాలయం వద్దంటున్నారా? ఇవాళ ప్రజల జీవితంలో భాగమైన సచివాలయం అధికార వికేంద్రకరణలో భాగంగా పౌర సేవలన్నీ ఒకే దగ్గర అందిస్తోంది. పంచాయతీలు, సర్పంచ్‌లు ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన దానికి ఉన్న హక్కులు, అధికారాలకు సంబంధించి ఎలాంటి జోక్యం లేదు.

దానిమీద మీకు ఏదైనా అభ్యంతరం ఉందంటే అదే వేరే విషయం. కానీ సంబంధమే లేకుండా కేంద్రం...రాష్ట్రంలో సెక్రటేరియట్‌ పెడితే అని మాట్లాడుతుంటే దానికి మేము ఏం సమాధానం ఇవ్వాలి? వినేవాడికి మాత్రం భలే ఉంటుంది. ఓహో చంద్రబాబు భలే ఆర్గ్యుమెంట్‌ బ్రహ్మాండంగా పెడుతున్నాడు కరెక్టే కదా.  మైక్‌ ఉంది కదా... రాసేందుకు అనుకూల మీడియా ఉంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. మీకున్న అనుభవం వల్ల ఎలా అనుకుంటే అలా మాట్లాడి ప్రజలను అయోమయానికి గురిచేయడం సరైన పద్ధతి కాదు.
 
4. చంద్రబాబు నాయుడు తన హయాంలో ప్రారంభించిన జన్మభూమి కమిటీల ద్వారా బహుశా ఎక్కడా జరగనంత అన్యాయం రాష్ట్రంలో ప్రజలకు జరిగింది. గ్రామంలో ఎవరైనా చనిపోతే వారికి సాయం రావాలంటే లంచం, పెన్షన్‌ కావాలంటే రెండు వేలో, మూడు వేలో  లంచం ఇచ్చే  పరిస్థితి, జన్మభూమి కమిటీలు అంటే దారిదోపిడీ చేసేవాళ్లుగా తయారయ్యారని టీడీపీ నాయకులే అప్పట్లో మొత్తుకున్నారు.

ఇదీ సర్పంచ్‌లకు అధికారం తీయడం అంటే. ఇంటి స్థలాలు, పెన్షన్‌ కావాలన్నా, ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకైనా జన్మభూమి కమిటీ సర్టిఫికేట్‌ కావాలనేలా.. ఊహకు అందనది, ఇల్లీగల్‌గా వ్యవస్థను తీసుకువచ్చి తెలుగు డిక్షన్షరీలో ఎక్కించిన ఘనత చంద్రబాబుది. గ్రామ పంచాయతీలు ప్రాణాలు హరించడం, ఊపిరీ తీయడం చేసిందే చంద్రబాబు.
 
5. జగన్‌ మోహన్‌ రెడ్డిగారు పంచాయతీలకు రియల్‌ జీవం పోస్తున్నారు. ఒకవైపు పొలిటికల్‌ స్ట్రక్చర్‌ను అలాగే ఉంచి మరోవైపు అడ్మినిస్ట్రేషన్‌ స్ట్రక్చర్‌ తీసుకు వస్తున్నారు. రెండింటి మధ్య సమన్వయం సాధిస్తే అద్భుతమైన గ్రామ స్వరాజ్యం వస్తుంది.

గ్రామం దాటకుండానే పౌరులకు కావాల్సిన సేవలు, సౌకర్యాలు అందిస్తున్నారు. ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. రాజ్యాంగం అంటే తన జేబులో ఉండేది, తాను ఏమనుకుంటే అలా చేయొచ్చు అనుకునే చంద్రబాబు గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. 
 
6. సంగం డెయిరీ కేసు విషయంలో ఆధారాలు ఉంటే చూపించాలని చంద్రబాబు అంటున్నారు. ఆధారాలు ఈయనకు ఎందుకు చూపిస్తారు. ఆధారాలు ఉన్నాయనే కేసుపెట్టారు, దర్యాప్తు జరుగుతుంది. రాజకీయంగా మేము దూళిపాళ్ల నరేంద్ర పచ్చిదొంగ రైతులకు పోవాల్సిన డివిడెంట్లు, లాభాలు దూళిపాళ్ల నరేంద్ర తీసుకున్నారు. అందులో సింహభాగం చంద్రబాబు నాయుడుగారికి పోయింది. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి అని మేము అని ఉండవచ్చు.

ఇక్కడ హెరిటేజ్‌ పాలును ప్రాసెస్‌ చేశారనే పేరుతో అక్కడ నుంచి ఖాళీ ట్యాంకర్లు తెప్పించి, సంగం డెయిరీ పాలను అక్కడకు తరలించారనేది వాస్తవం. రాజకీయ పార్టీగా మేము మాట్లాడతాం. వాటిని వదిలేయండి. అయితే నిజానిజాలు అనేవి కోర్టులో తేలతాయి. ఆధారాలు రుజువైతే ఆయనకు శిక్ష తప్పదు. అప్పటివరకూ కొంచెం ఓపిక పట్టవచ్చు కదా.
 
7.  తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా.. వచ్చిన నీళ్లు వచ్చినట్లు విద్యుత్‌ ఉత్పత్తి కోసం కిందకు వదులుతుంటే అవన్నీ వాడుకోవడానికి అవ​కాశం లేకపోవడంతో సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వస్తుంటే.. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు దానిమీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం రియాక్షన్‌ కూడా లేదు. మీ పార్టీ నేత దేవినేని ఉమ వచ్చి అయ్యయ్యో నీళ్లను వదలొద్దు అంటున్నారు.

విద్యుత్‌ ఉత్పత్తి కోసం  నీళ్లు  ఎలా వదులుతారని తెలంగాణ ప్రభుత్వాన్ని, అక్కడ ముఖ్యమంత్రిని ఎందుకు అడగరు?. విద్యుత్‌ ఉత్పత్తి కోసం విలువైన నీటిని ఎలా వదులుతారు అని అడగకుండా మౌనంగా ఎందుకు ఉన్నారు. రాష్ట్రంలో మేము మేము కొట్టుకుంటాం. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో గొంతు కలిపి ఒక నిరసన వినిపించకుండా, అడగకుండా... ప్రభుత్వానికి మద్దతు రాకపోగా, పైపెచ్చు జిల్లాల మధ్య ఎలా చిచ్చు పెట్టాలి అని చూస్తున్నారు.
 
8. చంద్రబాబు పుట్టి పెరిగిన.. రాజకీయ జీవితం ప్రసాదించిన చిత్తూరు జిల్లాలో సాగునీటి అవసరాల కోసం స్టోరేజీ కోసం నిర్మాణం చేపడుతుంటే తెలంగాణ రాష్ట్ర వాదాన్ని తెరమీదకు తెస్తూ.. టీడీపీ స్థానిక నాయకులతో ఎన్జీటీ లో కేసు వేయించారు. ఇంతకంటే దిగజారుడు తనం, ఇంతకంటే అన్యాయం ఉందా? తన కళ్ళు పొడుచుకోడుగానీ, రాష్ట్రం కళ్లు పొడిచి కసి ఉందని చూపడం చూస్తుంటే, రాష్ట్రంపై ఆయనకు ఎందుకంత కసో తెలియదు.

రాయలసీమకు సంబంధించినంత వరకూ తెలంగాణ ప్రభుత్వం ఏవిధమైన వాదన తెస్తుందో దాన్నే సమర్థించేలా తన పార్టీ వ్యక్తులతో ఎన్జీటీలో కేసు వేయించారు. చంద్రబాబుకు తెలియకుండానే కేసు వేశారా? మరోపక్క ప్రకాశం జిల్లా పార్టీ నేతలతో తమకు అన్యాయం జరుగుతుందని లేఖ రాయిస్తారా?

ఈ రెండు తెలంగాణకు సంబంధించినంత వరకూ ఆ ప్రభుత్వ వర్గాలకు కానీ, అక్కడ అధికార పార్టీతో తెర వెనుక లోపాయకారిగా ఏమైనా ఒప్పందం జరిగిందా? అనే అనుమానం వస్తోంది. ఆ కోర్డినేషన్‌ కూడా సరిగ్గా సరిపోతోంది. టీడీపీ ఒక పొలిటికల్‌ పార్టీగా ఇటువంటి పనులు చేయడం, లేఖలు రాస్తే అర్థమేంటి..?
 
9. పోలవరం నుంచి తీసుకు వచ్చే నీటిని నాగార్జున సాగర్‌ కుడి కాల్వలో పోయడం ద్వారా ప్రకాశం, గుంటూరు జిల్లాలకు నీరు అందేలా.. అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. రూ.1200 కోట్లు ఖర్చు పెట్టాం. భూసేకరణ జరుగుతోంది. ఆ ప్రాజెక్ట్‌ పూర్తి అవుతుంది. 

అక్కడ రాయలసీమకు సంబంధించినంత వరకూ వరద జలాలు వృథాగా పోకుండా తక్కువ సమయంలో తీసుకోవడానికి ఎలా ఏర్పాటు చేస్తున్నామో... ఈ పక్క పులిచింతల ద్వారా... చింతలపూడి దగ్గర నుంచి నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వకు. ఎక్కడ కూడా ఏ ప్రాంత ప్రయోజనాలు ఇబ్బంది కలగకుండా వృథాగాపోయే నీళ్లు ఒడిసిపట్టుకోవాలని జగన్‌ మోహన్‌ రెడ్డి ఆలోచన.

అప్పట్లో వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు అలాగే ఆలోచించి అమలు చేశారు. మూడు ప్రాంతాలకు అంటే అప్పట్లో తెలంగాణ తీసుకుంటే...రాయలసీమకు పోతిరెడ్డిపాడును 11వేల క్యూసెక్కుల నుంచి 44వేల క్యూసెక్కులకు చేయడం ద్వారా వరద జలాలు... కృష్ణా డెల్టాకు ఇబ్బంది కాకుండా పులిచింతల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి పోలవరం కుడి కాల్వకు కలపడం తెలంగాణకు సంబంధించి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ను టేకప్‌ చేయడం చేశారు. ఒక నాయకుడు అంటే అన్ని ప్రాంతాలను సమానంగా చూసే, చూడగలిగేవాడు. సమన్యాయం చేసే నాయకుడు.
 
10.  అలాంటివి చంద్రబాబు నాయుడుగారికి ఎలా అర్థం అవుతుంది. అసలు చంద్రబాబుకు పుట్టిన ఊరు, గడ్డ, రాష్ట్రం మీద ప్రేమ లేదు. ఆయనకు ఎప్పుడూ రాష్ట్రాన్ని కూనారిల్లింపచేసి, కుంగదీసి, ఘర్షణవాతావరం నెలకొల్పి తద్వారా తన నాయకత్వాన్ని పెంచుకోవాలనుకుంటారు. ఇప్పుడు జిల్లాల మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాకు మీరేం చేశారని? రాజశేఖర్‌ రెడ్డిగారు ఏం చేశారనేది చెబితే.. పెద్ద హిస్టరీనే ఉంది దానిజోలికి పోదల్చుకోలేదు.

- ఈవాళ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక మీ హయాంలో పూర్తి చేయాల్సిన వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ లో దాదాపు 18 కిలో మీటర్లు పొడవు ఉన్న మొదటి సొరంగాన్ని వైయస్‌ రాజశేఖర్‌రెడ్డిగారి హయాంలో దాదాపు పదకొండున్నర కిలోమీటర్లు పూర్తి చేస్తే.. ఆయన తర్వాత వచ్చిన కాంగ్రెస్, టీడీపీ హయాంలో పూర్తి చేసింది చాలా తక్కువ. 

చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉండి ఉంటే వెలిగొండ ప్రాజెక్ట్‌ ఎప్పుడో పూర్తి అయ్యి ఉండేది, ప్రకాశం జిల్లా రూపురేఖలు మారిపోయి ఉండేవి. జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక రెండు టన్నెల్స్ ను త్వరితగతిన పూర్తి చేస్తూ.. రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో పని చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డిగారి. చిత్తశుద్ధి, తపనకు ఇదే నిదర్శనం.
 
11. రాయలసీయ లిఫ్ట్‌ వల్ల ఉపయోగం లేదా అంటే రాళ్లపాడుకు నీళ్లు దాని నుంచే రావాలని అంటున్నారు. రాయలసీమ ఇరిగేషన్‌కు లిప్ట్‌ పెట్టడం వల్ల ఎవరైనా అపార్థాలు, అపోహలు రాకుండా చేయడం కోసం డిపెండబులిటీ తగ్గించడం కోసం అల్టర్‌నేటివ్‌గా పనులు జరుగుతున్నాయి. ప్రాంతాలు మధ్య,  జిల్లాల మధ్య, మండలాలు, డివిజన్ల మధ్య విద్వేషాలు సృష్టించి దాని ద్వారా  రాజకీయంగా లబ్ధి పొందాలనేదే తప్ప చంద్రబాబుకు ఆయన పార్టీకి వేరే విద్య తెలిసినట్లు లేదు.

నీళ్ల గురించి మీడియా అడిగితే నేను మాట్లాడను అంటారు. ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? మీడియా అమాయకంగా ఆలోచిస్తుందనుకుంటున్నారా? ఓవైపు చిత్తూరు జిల్లాలో తన పార్టీ నేతలతో తెలంగాణ వాదానికి అనుకూలంగా ఎన్జీటీలో కేసులు వేయిస్తారు. మరోవైపు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో లేఖ రాయిస్తారు. చంద్రబాబు మాత్రం మాట్లాడరంట. పోనీ ఆయన ఏమైనా అధికారంలో ఉన్నారా? గుంభనంగా ఉండటానికి?
 
12. చంద్రబాబు నాయుడుగారు సూటిగా అడుగుతున్నాం. పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ వరద జలాలను ఒడిసి పట్టుకునేందుకు పెడుతున్న లిఫ్ట్‌ గురించి అఫిషియల్‌గా మీ స్టాండ్‌ ఏంటి? అది ఉండాలా? వద్దా? తెలుగుదేశం పార్టీ వైఖరి కచ్చితంగా చెప్పాలి. మీరు ఏం భావిస్తారో అది చెప్పాలి.

ఆ తర్వాత మీరు దానిగురించి మాట్లాడండి. ఇలాంటి దౌర్బాగ్యపు రాజకీయం చేసే పార్టీ అసలు ఎక్కడైనా ఉంటుందా? అబద్ధాలు, అసత్యాలు, అర్థసత్యాలపై రాజకీయాలు చేయాలనుకుంటున్న చంద్రబాబు వైఖరిపై అందరూ ఆలోచన చేయాలి. 

ఇందుకు తగ్గట్టే... చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా.. దాని గురించి రోజూ చెప్పాలంటే మాకు ఇబ్బంది. చిన్నా చితక వాటి గురించి మేము పట్టించుకునేవాళ్లం కాదు. అత్యధిక సర్కులేషన్‌ ఉన్న ఈనాడు దిన పత్రిక రకరకాల కథనాలు అల్లి ప్రచారం చేస్తోంది. ఎన్నికలు ఇంకా మూడేళ్లు ఉండగానే కుట్ర పూరితంగా, అన్నివైపుల నుంచి ప్రజలు, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కాకుండా సంబంధం లేని కుయుక్తులుతో రాజకీయం చేసి అప్పర్‌ హ్యాండ్‌ చేయాలనుకుంటోంది.

మతం అంటూ కొన్నిరోజులు హడావుడి చేసింది. ఆరోజుకు ఏమి దొరికితే దాన్ని తీసుకుంటూ ప్రాంతాలు, రాష్ట్రాలు, కేంద్రానికి ఏదో చేశారని ప్రజలలో ఒకరకమైన సందిగ్ధత తీసుకురావాలనే ప్రయత్నంలో ప్రధాన భూమిక ఈనాడు పోషిస్తోంది.
 
13. ఇవాళ ‘ఈడబ్ల్యూఎస్‌ ఎప్పుడు.. ఈడబ్ల్యూఎస్‌ ఇవ్వలేదని జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించడంపై నిరుద్యోగుల ఆందోళన..’ అని కథనం ఇచ్చింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆఖర్లో చేసిన మిర్ఛీఫ్‌ వల్ల ఒక గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో కాపు సామాజికవర్గం ఓట్లు ఎలా రాబట్టుకోవాలా అనే దానితో.. అది రాజ్యాంగబద్ధంగా అమలు అవుతుందా లేదా అని ఆలోచించకుండా రిజర్వేషన్లు అంటూ ప్రకటించి... దానిపై కోర్టులో కేసు పెండింగ్‌లో పడిపోవడంతో దాన్ని ఏం చేయాలేమని చేతులు దులుపుకుంది.
 
14. దీనిపై జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ప్రభుత్వం తాజాగా ఇంప్లిమెంటేషన్‌ చేస్తోంది. దీనిపై జీవో కూడా విడుదల అవుతుంది. అది కూడా మా ఎఫెక్ట్‌ వల్లే అని రేపు గొప్పలు చెప్పుకుని వార్తలు రాస్తుంది కూడా ఈ మీడియా. ఈడబ్ల్యూఎస్‌ అమలు ఆలస్యం అవడానికి కారణం కూడా టీడీపీనే. అయితే ఈ రెండేళ్లలో సుమారు 5.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు మర్చిపోయి రాసిందేమో ఈనాడు దినపత్రిక. దీంట్లో మాత్రం ఉద్యోగాలు ఇచ్చినట్లు ఒప్పుకుంటూ ఈనాడు వార్త రాసింది.

అదే ప్రభుత్వంపై బండ పడేయాలనుకుంటే... వారం క్రితం ‘కొలువుల ఆశలపై నీళ్లు’ అని ఇదే ఈనాడు రాసింది. ఆరోజేమో అస్సలు ఉద్యోగాలు ఏమీ క్రియేట్‌ చేయలేదు. మేనిఫెస్టోలో చెప్పినట్లు కాకుండా మోసం చేశారని రాస్తే....ఇవాళమో నెంబర్లతో సహా రాస్తూ ఉద్యోగాలు ఇచ్చారు మరి ఈడబ్ల్యూఎస్‌ ఏమైంది అని రాశారు.


అలాగే అంతకు ముందు.. ‘లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ తవ్వకాలు’ అని రాస్తే,  ఇవాళేమే ‘దారి మార్చి దాటేస్తున్నారు’ విశాఖలో లేటరైట్‌ తవ్వకాలు... ఇలా అబద్ధాలు ఆడినా ఎక్కడోచోట దొరికిపోతున్నారు. అది బాక్సైట్‌ కాదు లేటరైట్‌ మొర్రో అని ప్రభుత్వం మొత్తుకుంది కూడా. ఆ లేటరైట్‌ తవ్వకాల లీజు మేము ఇచ్చింది కాదు, అవి టీడీపీ హయాంలోనివే. అలాంటి దాన్ని ఏదో కుంభకోణం జరిగినట్లు హెచ్చరిస్తున్నట్లు రాయడం, ఘోరం జరిగిపోయినట్లు రాస్తున్నారు.

గత రెండు మూడు నెలలుగా ప్రతిదాన్ని పైకి ఒకలా మాట్లాడటం.. రాతలు మరోలా ఉండటం...చూసేవారికి మాత్రం ఏదో జరిగిపోతుంది అన్నట్లు ఉండటం. చాలా తెలివిగా చేస్తున్నాము అనుకుంటున్నారు కానీ అడ్డంగా దొరికిపోతున్నారు. ఈడబ్ల్యూఎస్‌ కూడా రాబోతుంది. మిగిలినవాటికంటే మెరుగ్గా ఉండబోతుంది. 

మీడియాకు సంబంధించినంతవరకూ మా విధానం చాలా స్పష్టంగా ఉంది. మొత్తం వ్యవస్థలో కచ్చితంగా కిందిస్థాయిలో కానీ, ప్రభుత్వం- మీడియామధ్య ఏర్పడే కమ్యూనికేషన్‌ కూడా ఒకోసారి వేరేగా అర్థం రావచ్చు. అలాంటిది లక్షలాదిమంది పనిచేస్తున్న ప్రభుత్వంలో అయిదుకోట్ల మంది ప్రజల జీవితాలను సరిదిద్దే ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడైనా ఒకటీ అరా లోపాలు ఉండవచ్చు.

అయితే పాయింట్‌ అవుట్‌ చేసేటప్పుడు నిష్పాక్షికంగా ఇందులో లోపాలు ఉన్నాయి, మీ ఆలోచనల్లో పొరపాట్లు ఉన్నాయి, వీటిని ఇలా చేస్తే బాగుంటుందని ఎన్ని సలహాలు ఇచ్చినా బాగుంటుంది. అలాంటిది ఏమీ లేనిదానిలో.. ఏదో ఉన్నట్లు క్రియేట్‌ చేయడం సరికాదు.
 
15. లేటరైట్‌ తవ్వకాలు గురించి రాతలు చూస్తుంటే విడ్డూరంగా ఉన్నాయి. కడప జిల్లాలో లేటరేట్‌ ఫ్యాక్టరీ. కడప జిల్లాలో సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏంటి... తాండూరులో సిమెంట్‌ ఫ్యాక్టరీ కూడా లేటరైట్‌నే వాడతాయి. కడప జిల్లా అని రాస్తే.. చదవేవారికి రాజశేఖర్‌రెడ్డివాళ్ల జిల్లా...అక్కడకు దోచుకుపోతున్నారేమో అన్నట్లు రాయడం. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు?

ఏమీలేనిదాన్ని ఏదో ఉన్నట్లు రాయడం... మైనింగ్‌ జరుగుతోంది, టిప్పర్లు అంటూ అన్యాయమైన, అడ్డగోలు రాతలా? లేటరైట్‌ను సిమెంట్‌ తయారికీ వాడతారు. అదేదో ఇవాళ కొత్తగా పుట్టినట్లు రాస్తున్నారు. చంద్రబాబు నాయుడుగారి హయాంలో  లేటరైట్‌ పేరుతో వేలకోట్ల దోపిడీ జరిగింది. మరి ఇప్పుడు ఎక్కడా జరగడం లేదే. ఆ రోజు జరిగిన కుంభకోణాలు బయటకు వస్తాయేమో అని యాగీ చేస్తున్నారు. మీరు చెప్పిన తప్పులు కప్పిపుచ్చుకోలేరు కదా.
 
16. కోవిడ్‌ మారణాలు దాచిపెట్టారంటూ ఆరోపణలు చేశారు. మరణాలు దాచిపెట్టుకోవడానికి ఏముంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోవిడ్‌ నియంత్రణ చాలా బాగా చేసిందని, దేశంలోనే వన్‌ ఆఫ్‌ది బెస్ట్‌ స్టేట్‌ అని ప్రశంసలు పొందింది. అయినా చనిపోయినవారి మరణాలు గురించి దాచిపెడితే ఏమొస్తుంది? ప్రభుత్వానికి ఏమైనా అవార్డులు వస్తాయా?

అర్థం లేకుండా బ్యానర్లు పెట్టి రాతలు రాస్తూ దాని నుంచి రాజకీయ లబ్ది పొందాలనుకోవడం, దాన్ని వాడుకుని దానితో ప్రభుత్వం సరిగా పని చేయడం లేదని ప్రజలను అయోమయంలో పడేయడం చేస్తున్నారు. ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో మీ చొరవ లేదుగానీ, పక్క రాష్ట్రం తెలంగాణ వాదనతో గొంతు కలిపి రాష్ట్రానికి అన్యాయం చేయడానికి మాత్రం మీకు మనసు ఎలా వస్తుంది. చంద్రబాబు నాయుడు ధోరణి, వైఖరి రాష్ట్రానికి నష్టం కలిగించేలా ఉంటున్నాయనేది అందరూ గమనించాల్సి ఉంది.