మూడు రాజధానులకు కట్టుబడివున్నాం : సజ్జల రామకృష్ణారెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో వైకాపా నేతలు భిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజలను కూడా అయోమయానికి గురిచేసేలా వారు మాట్లాడుతున్నారు. మూడు రాజధానులు అనే మాట మిస్ కమ్యూనికేషన్ అంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఏపీ ప్రభుత్వ ప్రధాన సలదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మాత్రం తద్విరుద్ధంగా మాట్లాడారు. తమ ప్రభుత్వం విధానం మూడు రాజధానులు అని మరోమారు తేల్చి చెప్పారు.
మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడివుందన్నారు. వికేంద్రీకరణ అవసరాన్ని గుర్తించే మూడు రాజధానుల బిల్లు పెట్టామని, ప్రస్తుతం మూడు రాజధానుల అంశం న్యాయస్థానంలో నడుస్తుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి తేడా లేదని చెప్పారు. కోర్టుల్లో చిక్కులన్నీ పరిష్కారమైన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.