సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 13 జనవరి 2020 (23:39 IST)

నేటి నుంచి ఇంద్ర‌కీలాద్రిపై సంక్రాంతి సంద‌డి

భోగి, స‌ంక్రాంతి, క‌నుమ పండ‌గ‌ల‌ సంద‌ర్భంగా ఇంద్ర‌కీలాద్రిపై మూడు రోజుల పాటు బొమ్మ‌ల కొలువు ఏర్పాటు చేయ‌డంతో పాటు ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు శ్రీదుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల దేవ‌స్థానం ఈవో ఎం.వి.సురేష్‌బాబు తెలిపారు.

సోమ‌వారం జ‌మ్మిచెట్టు సెంట‌ర్‌లోని దేవ‌స్థానం పరిపాలనా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ జనవరి నెలలో దేవస్థానంలో నిర్వ‌హించ‌నున్న మ‌రియు నూతనంగా చేపట్టబోయే కార్యక్రమాలు గురించి వివ‌రించారు.

ఈ నెల 14 నుంచి 16వ తేది వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా మంగ‌ళ‌వారం ఉదయం 6 గంటలకు సాంప్రదాయబద్దంగా బోగి మంటలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, మేళ‌తాళాల‌తో సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతాయ‌ని, అందులో భాగంగా ఉదయం 10 గం.లకు బొమ్మల కొలువు ఏర్పాటు చేసి భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజుల పాటు నూతన రాజగోపురం ఎదురుగా బొమ్మలకొలువు నిర్వహించబడునని తెలిపారు.

అలాగే సింగ్‌నగర్ మరియు కానూరులో ఉన్న వృద్ధాశ్రమంలోని వృద్దులకు అమ్మవారి దర్శనం కల్పించి, భోజనం ఏర్పాటు చేసి, ఆశ్రమంలోని మహిళలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా అమ్మవారి వస్త్ర ప్రసాదంగా చీరలు పంచిపెట్టనున్నట్లు చెప్పారు.

సాయంత్రం ఆసక్తి గలవారు బొమ్మలకొలువు వద్ద ఏర్పాటు చేసిన ఉత్సవ మూర్తుల వద్ద చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయించుకోనవచ్చుని తెలిపారు. ప్రతి మంగళవారం వృద్దాశ్రమాలు, అనాదాశ్రమాలలోని వారికి భోజన సదుపాయం, ఉచిత ప్రసాదం దేవస్థానం వారిచే పంపిణీ చేయబడుతుంద‌ని, భక్తులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయటానికి గాను, దద్దోజనం, పొంగలి, పులిహోర  వితరణలో భక్తులు కోరుకున్న తేదీలలో వారి పేరున ఉచిత ప్రసాద పంపిణి జరుపుటకు (ఒక రకము)1 కేజీ రూ.175 చొప్పున విరాళాలు ఆర్జిత సేవా కౌంటరు నందు బుధ‌వారం నుంచి  స్వీకరించబడునని తెలిపారు.

అదేవిధంగా ఈ నెల ది.30న‌ శ్రీ పంచమి సందర్భంగా ప్రధానాలయం, మహామండపం 6వ అంతస్థు నందు (ఉత్సవమూర్తులు) అమ్మవారు సరస్వతి దేవి అలంకారములో దర్శనమివ్వనున్నారని, భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవాల‌ని పేర్కొన్నారు.

శ్రీ పంచమి సందర్భంగా విజయవాడలోని అన్ని పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల విద్యార్థుల‌కు ఉచితంగా అమ్మవారి దర్శనం, పులిహోర ప్రసాదం మరియు పెన్నులు పంపిణీ  చేయనున్న‌ట్లు తెలిపారు. ఈ అవ‌కాశాన్ని  విద్యార్థులందరూ స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. శ్రీపంచ‌మి రోజున సుమారు 40 వేల మంది విద్యార్థులు అమ్మవారిని దర్శించుకోనున్నట్లు తెలిపారు.

అలాగే ఈ నెల 31న సివి రెడ్డి చారిటీస్ వ్యవస్థాపకులు వారి వర్ధంతి కావడంతో 100 మంది పేద విద్యార్థులకు ఉప‌కార‌వేత‌నాలు, 100 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ మరియు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమము జయప్రదం చేయాల‌ని కోరారు.

కనకదుర్గ అమ్మవారి దర్శనార్దం వచ్చే భక్తులు సాంప్రదాయ‌ దుస్తుల్లోనే రావాలని కోరారు. రూ.300 టిక్కెట్టును ఆన్‌లైన్‌లో టీఎంఎస్ వెబ్‌సైటు ద్వారా బుక్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, కొండపైన అర్జునుడు ప్రతిష్టించిన ఆలయానికి భక్తులను అనుమతించే మార్గంపై ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామని, కేశఖండన శాల, ప్రసాదం పోటు, అన్నదానం కోసం శాశ్వత భవనాల ఏర్పాటుకు  త్వరలోనే శంకుస్ధాపనకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు.

విలేక‌రుల స‌మావేశంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి పి.చంద్రశేఖర్, సుధారాణి, బి.వెంకటరెడ్డి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు ఎల్‌.రమా త‌దిత‌రులు పాల్గొన్నారు.