మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2024 (16:34 IST)

సుప్రీంకోర్టులో ఏపీ సర్కారుకు షాక్ - అలా చేయడానికి వీల్లేదు..

supreme court
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూములను లేఔట్‌గా మార్చి అమ్మడానికి వీల్లేదని పేర్కొంటూ స్టే విధించింది. 2003 సెప్టెంబరు 13వ తేదీన అప్పటి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలు మినహా ఇతర కార్యకలాపాలకు ఆ భూములు వినియోగించరాదని ఆదేశాలిస్తూ, ఏపీ ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై మార్చి 11 లోపు స్పందించాలని ఆదేశించింది.
 
రామానాయుడు స్టూడియోకు సినీ అవసరాల కోసం 2003లో అప్పటి ప్రభుత్వం విశాఖలో 35 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోస్టల్ నిబంధనలకు విరుద్ధంగా లేఔట్‌గా మార్చి ఇతర కార్యకలాపాలకు వినియోగించుకునేందుకు స్టూడియో అధినేతకు అనుమతించింది. ఈ వ్యవహారాన్ని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో... ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
 
పిటిషన్‌పై విచారణను జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ అభయ్ ఎస్ ఓఖాల ధర్మాసనం చేపట్టింది. రామానాయుడు స్టూడియోకి భూమిని ఎందుకు కేటాయించారు? ఇప్పుడు వేరే కార్యకలాపాలు చేపట్టారా? అని పిటిషనర్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. సినీ స్టూడియో నిర్మాణానికి భూమిని కేటాయించారని.. దానికి అనుగుణంగా స్టూడియో నిర్మాణం చేపట్టకుండా... లేఔట్ వేసి అమ్మకాలకు సిద్ధం చేశారని కోర్టుకు న్యాయవాది తెలిపారు. 
 
దీంతో స్టే విధించిన కోర్టు ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి స్టూడియోకు ఇచ్చిన స్థలంలో లేఔట్ వేసి ఇళ్లను నిర్మించడం చట్ట విరుద్ధం. అయితే దీనికి జిల్లా కలెక్టర్ కూడా ఎన్డీసీ ఇవ్వడం గమనార్హం. పైగా, నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు పేరు మీదనే లేఔట్ వేశారు.