గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (13:11 IST)

వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవాలి... సమయమివ్వండి : బిల్కిస్ బానో దోషులు

bilkis bano case
తమకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని, ముఖ్యంగా వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవాల్సివుందని, అందువల్ల లొంగిపోయేందుకు మరికొంత సమయం కావాలంటూ బిల్కిస్ బానో అత్యాచార కేసులో ముగ్గురు దోషుల్లో ఒకరు కోరుతున్నారు. ఈ మేరకు వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వృద్ధ తల్లిదండ్రులు, పిల్లలకు తన అవసరం ఉందంటూ దోషుల్లో ఒకడైన గోవింద్‌ నాయ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. 
 
'వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత నాదే. నా ఇద్దరు పిల్లల అవసరాలు చూడాలి. ఇప్పుడు నా వయసు 55 సంవత్సరాలు. నేను ఆస్తమాతో బాధపడుతున్నాను. ఇటీవలే నాకు శస్త్రచికిత్స జరిగింది. అలాగే విడుదల సమయంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారమే నేను నడుచుకుంటున్నాను' అంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
అతడితోపాటు మరో ఇద్దరు దోషులు కూడా లొంగిపోవడానికి అదనపు సమయం కోరారు. 2002లో గోధ్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ కేసులో 11 మంది దోషులు 15 ఏళ్లు కారాగారంలో గడిపారు. 2022లో వీరికి గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌ మంజూరు చేసింది. ఆ ఏడాది ఆగస్టు 15న వీరంతా జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం.. వారి విడుదల చెల్లదని జనవరి 8న తీర్పు వెలువరించింది. వారంతా రెండువారాల్లోగా జైలు అధికారుల వద్ద లొంగిపోవాలని ఆదేశించింది.