సరిగ్గా 82 రోజుల్లో జగన్‌కు పతనం తప్పదు : చంద్రబాబు నాయుడు
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా 82 రోజుల్లో పతనం తప్పదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో శుక్రవారం జరిగిన రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదన్నారు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని.. 82 రోజుల్లో పతనం తప్పదన్నారు. జగన్‌ను గద్దె దించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
'రా.. కదలి రా..' అని పిలుపిస్తే వెంకటగిరి గర్జించింది. జగన్ రాజకీయ వ్యాపారి. మనందరినీ పెట్టుబడిగా పెట్టి రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. వైకాపాలో ఉంటూ జగన్ పాలన బాగోలేదని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ప్రజాహితం కోసం మాట్లాడితే ఆయన్ను దూరం పెట్టేశారు. సీనియర్లను కూడా లెక్కచేయని అహంకారం జగన్‌ది. ఈ సీఎం వెయ్యి తప్పులు చేశారు.. ఇంకా భరిస్తారా? అని నిలదీశారు.
జీతం కోసం అడిగితే ఉద్యోగులు జైలుకు వెళ్లే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చాక వెంకటగిరి తలరాత మారిందా? 25 ఏళ్ల క్రితం యువతకు ఐటీ అనే ఆయుధమిచ్చా.. అదే ఇప్పుడు వజ్రాయుధమైంది. టీడీపీ హయాంలో తిరుపతిని మొబైల్ హబ్‌గా తీర్చిదిద్దాం. ఓటు అనే ఆయుధాన్ని ప్రజలు ఉపయోగించాలి' అని చంద్రబాబు కోరారు.
అయోధ్య రామ్ లల్లా ప్రాణప్రతిష్టకు వెళ్ళనున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు
ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ఆయనకు శ్రీరామ్ తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఆహ్వాన లేఖను అందజేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆయన వెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈ నెల 21వ తేదీ సాయంత్రం ఆయన అయోధ్యకు బయల్దేరుతున్నారు. 22న జరిగే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కార్యక్రమానికి రావాలని కోరుతూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు రెండు రోజుల క్రితం చంద్రబాబును ఆహ్వానించారు.
జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగనుంది. గురువారం గర్భ రాముడి విగ్రహాన్ని చేర్చారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి 8 వేల మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. సమయం దగ్గర పడుతుండటంతో ఆహ్వానాలను అందించే ప్రక్రియను నిర్వాహకులు వేగవంతం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్న వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల తొలిసారి రాష్ట్రంలో పర్యటించనుంది. రెండు రోజుల పాటు ఆమె రాష్ట్రంలో పర్యటించేలా షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20, 21వ తేదీల్లో ఆమె పర్యటన కొనసాగనుంది. ఇందుకోసం ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆమె కడపకు చేరుకుంటారు.
అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుని... సాయంత్రం 4 గంటలకు తన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. ఆరోజు రాత్రి అక్కడే బస చేస్తారు. 21వ తేదీ ఉదయం కడప నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు విజయవాడలో పీసీసీ చీఫ్‌గా ఆమె బాధ్యతలను స్వీకరిస్తారు.
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిలకు పార్టీ హైకమాండ్ ఏపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించిన విషయం తెల్సిందే. ఇప్పటివరకు పీసీసీ చీఫ్‌గా ఉన్న గిడుగు రుద్రరాజుకు సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో షర్మిల... తొలిసారి రాష్ట్ర పర్యటనకు రానుండటం ప్రత్యేకత సాధించుకుంది.