తెలంగాణ సాయుధ పోరాట యోధుడు చెన్నమనేని రాజేశ్వర రావు ఇకలేరు
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీనియర్ రాజకీయ నేత, సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు 93 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఈయన ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిశారు. 1957లో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఐదు సార్లు, మెట్‌పల్లి నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన స్వస్థలం కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మారుపాక గ్రామం. రాజేశ్వరరావు రాజకీయ జీవితం సీపీఐ పార్టీతో ప్రారంభమైంది.
అంతేకాకుండా, సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఆయన సేవలు అందించారు. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెరాస పార్టీలో చేరారు. 2004 తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజేశ్వరరావు మృతి పట్ల పలు రాజకీయ పార్టీల నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
కాగా, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు ఈయన స్వయన సోదరుడు. రాజేశ్వరరావు కుమారుడు రమేష్ ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. చెన్నమనేని మృతి పట్ల వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెన్నమనేనీ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. విలువలకు కట్టుబడిన వ్యక్తి చెన్నమనేని అని జగన్ పేర్కొన్నారు.